మంచి జరిగితే మీ బిడ్డకు అండగా ఉండండి

నరసన్నపేట బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం.

17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం

వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తి

క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం

రాజకీయామంటే జవాబుదారీ తనం 

తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, వైయస్‌ జగన్‌ అంటారు

ప్రజలకు మంచి చేస్తేనే ప్రజలు ఆదరిస్తారనే మెస్సేజ్‌ పోవాలి

చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు..దేవుడిని, ప్రజలను 
నమ్ముకున్నాను

మోసం చేసే వారిని ప్రజలు నమ్మవద్దు

వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా?..

మీ సేవలు వద్దు బాబూ అంటూ బైబై చెప్పి ఇంటికి పంపాలా అని ఆలోచన చేయాలి

మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరోఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా?

శ్రీకాకుళం: చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం వైయ‌స్ జగన్‌ కోరారు.  రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని  వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా?..మీ సేవలు వద్దు బాబూ అంటూ బైబై చెప్పి ఇంటికి పంపాలా అని ఆలోచన చేయాలని సూచించారు. మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరోఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా? అన్నారు.  బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

దేవుడి దయతో ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి నాతో పాటు పాల్గొనేందుకు వచ్చి.. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు  చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికి, స్నేహితుడి, అవ్వా, తాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు. 

భూముల రీ సర్వే– గొప్ప కార్యక్రమం...
దాదాపు రెండు సంవత్సరాల కిందట ఈ భూముల సమగ్ర రీ సర్వే, దాని తర్వాత భూముల రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. ఇది గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో దాదాపుగా 17,584 రెవెన్యూ గ్రామాలుంటే... అందులో 2వేల రెవెన్యూ గ్రామాలలో, 7,92,238 మంది భూయజమానులకు సర్వే చేయడమే కాకుండా, భూరికార్డులన్నీ పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి భూహక్కు పత్రాలను అందజేసే భారీ కార్యక్రమం నేటి నుంచి నరసన్నపేటలో ప్రారంభమవుతుంది. 
ఈ రోజు నుంచి మరో 15 రోజుల్లో మొదటి దశలోనే 2 వేల గ్రామాల్లోని రైతులందరికీ కూడా భూహక్కు పత్రాలను అందజేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. 


దశల వారీగా....
రెండో దశ పిబ్రవరి  2023 అంటే మరో నాలుగు నెలల్లోనే ఇంకో నాలుగువేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ పూర్తిగా వాళ్ల భూహక్కు పత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాం. 
మూడో దశ ఆ తర్వాత మరో నాలుగు మాసాల్లో మే 2023 నాటికల్లా 6వేల గ్రామాల్లో, పట్టణాలలో భూహక్కు పత్రాలను వారి చేతిలో పెడతాం. ఆ తర్వాత మరో మూడునాలుగు నెలల్లో ఆగష్టు 2023 నాటికి మరో 9వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి రైతులందరికీ వాళ్ల భూహక్కు పత్రాలన్నీ చేతిలో పెడతాం.
మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ భూములన్నింటికీ సమగ్ర సర్వే పూర్తి చేసి, భూరికార్డులన్నీ ప్రక్షాళన చేసి అన్ని పనులను పూర్తి డిసెంబరు 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.

ఇక్కడ మరికొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 
భూముల విలువలు పెరగడంతో అక్రమాలు ఎక్కడపడితే అక్కడ పెరుగుతా ఉన్న పరిస్థితులు మన కళ్లెదుటనే కనిపిస్తునాయి. నా 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ బాధితులను చూశాను.
వాళ్లు పడుతున్న అగచాట్లను చూశాను. భూ రికార్డులు సరిగ్గా లేకపోవడం, సర్వే చేసిన పరిస్థితిలో కూడా లేకపోవడం, ఇష్టమొచ్చినట్లు భూరికార్డులు మార్పులకు గురికావడంతో ప్రజలు పడుతున్న అగచాట్లను నా కళ్లారా చూశాను. 
చివరికి మనకున్న 80 – 90 శాతం సివిల్‌ కేసులన్నీ కూడా కేవలం భూవివాదాలకు సంబధించిన కేసులే కనిపిస్తున్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు మారితేనే మన రాష్ట్రంలో కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపదకు ర క్షణ ఉంటుంది. అలాంటి సరైన వ్యవస్ధ లేకపోవడం వల్ల, రికార్డులు టాంపరింగ్‌ చేసే పరిస్థితులు వల్ల, అమ్మిన తర్వాత సబ్‌డివిజన్‌లు జరగకపోవడం వల్ల, మ్యుటేషన్‌లు జరగకపోవడంతో పాటు ఇతర  కారణాల వల్ల తమ భూమి చేజారిపోయే పరిస్థితి ఎవరికన్నా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఏదీ ఉండదు. ఇది మనందరికీ తెలుసు. మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మన పిల్లలకు హక్కుగా ఇవ్వాలనుకుంటాం. తీరా మన పిల్లలకు ఇచ్చే సమయానికల్లా దాన్ని గెద్దల్లా వేరెవరో తీసుకునిపోతే ఆ కడుపు మంట, బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయడానికి కూడా కష్టమనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు అన్నీ మార్చాలని అడుగులు ముందుకు పడ్డాయి. ఎలాంటి సివిల్‌ వివాదాలకు కూడా తావుండే పరిస్థితి రానే రాకూడని అడుగులు ముందుకు పడ్డాయి. 

రాష్ట్రంలో ప్రతి కమతానికి యునిక్‌ ఐడెంటిఫికేషన్ నెంబరు. 
ఒకసారి రాష్ట్ర మొత్తంగా భూములన్నీ పూర్తిగా కొలతలువేసి అది ఎక్కడుందో... లాటిట్యూడ్‌ అండ్‌ లాంగిట్యూడ్‌ అంటే అక్షాంశాలు, రేశాంఖాలు ఆధారంగా మార్కింగ్‌ చేయడమే కాకుండా ప్రతి ఒక్క కమతానికి కూడా నిర్దిష్టంగా ఒక యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు కూడా ఈ సర్వే కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమతానికి కూడా ఫిజికల్‌గానూ, డిజిటల్‌ గానూ దాన్ని పూర్తిగా నిర్ణయించి, క్యూఆర్‌ కోడ్‌తో ల్యాండ్‌ మ్యాపింగ్‌ కూడా చేసి, దాన్ని కూడా భద్రంగా పెడతాం. ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడుతున్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వపరంగా హక్కుగా భూహక్కు పత్రం కూడా అన్నిరికార్డులను ప్రక్షాళన చేసి వాళ్ల చేతుల్లో పెట్టబోతున్నాం. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారన్న భయం పూర్తిగా రైతుల్లోంచి కానీ, ప్రజల్లో నుంచి కానీ తొలిగిపోతుంది. డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు పూర్తిగా అవకాశం లేకుండా ప్రక్షాళన జరుగుతుంది.

మహా యజ్ఞంలా భూసర్వే....
భూకమతం ఒక సర్వే నెంబరు కింద ఉండి.. కాలక్రమంలో విభజన జరిగిన, మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలన్నింటికీ  కూడా పూర్తిగా చెక్‌ పెట్టినట్లవుతుంది. రైతుల భాగస్వామ్యంతో వారికి మంచి జరిగేలా.. భూసర్వే చేయడం, భూరికార్డులన్నింటినీ ప్రక్షాళన చేయడం వంటి ఈ కార్యక్రమాలన్నీ ఒక మహా యజ్ఞంలా ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది.

జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా.... 
రాష్ట్రంలో కొన్ని కోట్ల ఎకరాలకు సంబంధించిన సాగు, ఇతర భూములకు సంబంధించి ఒక జానెడు కూడా తప్పు జరగకుండా పూర్తిగా సర్వే చేయిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వేలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌ క్రాప్ట్‌లను, హెలీ కాప్టర్‌లను, దాదాపు 80 డ్రోన్లను, వేల సంఖ్యలో గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్స్‌ అంటే జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లను వినియోగిస్తున్నాం. వీటితో పాటు ప్రత్యేకంగా 75 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ బేస్‌లు అంటే కోర్స్‌ బేస్‌లు కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 17వేల పై చిలుకు రెవెన్యూ గ్రామాల్లో 1.07 కోట్ల రైతులు, 2.47 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన సర్వే జరుగుతుంది. దీంతో పాటు మరో 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ,  ప్రైవేటు ఆస్తులు 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది .ఇలా సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించి సబ్‌ డివిజన్లు, మ్యుటేషన్లు, ఇతర సమస్యల పరిష్కారం, యాజమాన్య పత్రాల జారీ వంటివన్నీ ...గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా...  ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతుంది.


సర్వే కోసం విప్లవాత్మక మార్పులు....
ఒక్క ఈ సర్వే కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం కోసం.. ఇది సాధ్యమయ్యేలా చేయడం కోసం 13,849 మంది సర్వేయర్లను రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో నియమించాం. 
అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈకార్యక్రమాన్ని రూ.1000 కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం.  భూమికి సంబంధించిన కచ్చితమైన సరిహద్దులతో సహా, పూర్తి వివరాలను ఎవరూ మార్చలేని విధంగా, డిజిటల్, ఫిజికల్‌ విధానంలో ప్రభుత్వ రికార్డులలోనికి వాటిని ఎక్కించి, భూకమతం మ్యాప్‌తో సహా భూహక్కు పత్రాలను  మన రైతన్నల చేతుల్లో పెట్టె గొప్ప కార్యక్రమం జరుగుతుంది. 

ఒక్కసారి సర్వే పూర్తయితే....
ఒక్కసారి ఇది పూర్తయితే... మన భూములకు సంబంధించిన క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా మన గ్రామంలోనే మన కళ్లెదుటనే సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ కింద సేవలు కూడా గ్రామ సచివాయలయంలోనే అందించే గొప్ప మార్పుకు కూడా శ్రీకారం చుడుతున్నాం. దీనివల్ల మన కళ్లెదుటనే మన భూముల రిజిస్ట్రేషన్, మన గ్రామంలో, మన సచివాలయంలో జరుగుతాయి. ఈ భూములకు సంబంధించిన రికార్డులన్నీ కూడా మన గ్రామ సచివాలయంలోనే,  మన దగ్గరే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా మోసం చేయాలనే ప్రయత్నం చేసే ఆలోచన కూడా రాని పరిస్థితుల్లోకి వ్యవస్ధలో మార్పులు తీసుకొస్తున్నాం.  ఇది ఒక్కసారి పూర్తయితే  భూవివాదాలకు ఇక అవకాశం ఉండదు. కబ్జాలు ఉండవు. ఎవరో కొందరు అధికారులు లేదా ఉద్యోగులు ఎవరైనా మన  భూములు టాంపర్‌ చేస్తారు, కాజేస్తారన్న భయం కూడా లేకుండా పోతుంది. అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. ఇక రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు కూడా ఎవరూ లంచాలు అడిగే పరిస్థితిని పూర్తిగా లేకుండా చేసే మార్పులు తీసుకొస్తున్నాం. గ్రామ సర్వేయర్‌ల ద్వారానే మన గ్రామంలోని సచివాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీని ద్వారా మన గ్రామ సచివాలయంలో ఉన్న సర్వేయర్లు ద్వారానే ఇకమీదట సరిహద్దులు మార్కింగ్‌ చేసే.. ఫీల్డ్‌ లైన్‌ దరఖాస్తులన్నీ 15 రోజుల టైమ్‌ ఇచ్చి కచ్చితంగా పూర్తి చేయాలి. పట్టా సబ్‌డివిజన్‌ మరియు మ్యుటేషన్‌ దరఖాస్తులన్నీ 30 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఎస్‌ఓపీలు తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరూ లంచాలడిగే పరిస్థితి ఉండదు. ఎవరైనా లంచాలు అడిగితే జగనన్న ఉంటాడన్న భయం కూడా కచ్చితంగా ఉంటుంది. ఆ స్ధాయిలో సబ్‌రిజిస్ట్రేషన్‌ వ్యవహారాల ప్రక్షాళన జరుగుతుంది. 

ఇప్పటివరకూ....
100 సంవత్సరాల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో 17 వేల పై చిలుకు రెవెన్యూ గ్రామాలకు గానూ,  ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో 47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్‌ ప్లైయింగ్‌ పూర్తైంది.  ఈ రోజు వరకు మొత్తం 2వేల గ్రామాల్లో సమగ్ర రీసర్వేతో పాటు భూపట్టాల ప్రక్షాళన,  మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు రైతులకు 7,92,238 భూహకు పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరో 15 రోజులపాటు ఈ 2 వేల గ్రామాల్లో వీటి పంపిణీ జరుగుతుంది. 

రీ సర్వే ప్రయోజనాలు.... 
ఈ రీ సర్వే వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్నది క్లుప్తంగా రెండు మాటల్లో చెబుతాను...

ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా..ఈ 9 నెలల్లోనే, ఈ 4 వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్‌డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. ఇది ఎంత గొప్ప విషయం అంటే.. .గతంలో సంవత్సరానికి 35 వేల సబ్‌ డివిజన్ల దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కేవలం 21 వేలు మాత్రమే సబ్‌డివిజన్‌ జరిగేవి. అంటే ఎక్కడ సంవత్సరానికి 21 వేలు మాత్రమే సబ్‌డివిజన్‌లు జరిగే పరిస్థితి నుంచి ఈరోజు కేవలం 9 నెలల కాలంలోనే 4.3 లక్షల సబ్‌డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లుకు సంబంధించిన పరిష్కారాలు జరిగాయి అంటే.. రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు గమనించండి. 

రైతులు రూపాయి చెల్లించకుండానే..... 
రైతులు దరఖాస్తు చేసుకుని... ఈ సబ్‌డివిజన్లకు కానీ, మ్యుటేషన్లకు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం వసూలు చేయడం లేదు. తద్వారా మన రైతులకు ఈప్రక్రియలో దాదాపు రూ.30 కోట్ల విలువైన సేవలను వారి చేతిలో ఉచితంగా పెట్టినట్లవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎందుకింత విజయవంతం అయిందంటే.. దానికి కారణం  ఇంత చిత్తశుద్ధి ఎప్పుడూ, ఎవరూ చూపించకపోవడమే. 

ఇంత మార్పు తీసుకుని రావాలి, నిజంగా మన పిల్లలకు రేప్పొద్దున మనం ఏదైనా ఆస్తి ఇవ్వాలి ఇంటే.. దానికి సంబంధించిన లిటిగేషన్ల వల్ల ఆ ఆస్తిని వారికి ఇవ్వలేని పరిస్థితులు ఎప్పుడూ, ఎవరికీ రాకూడదు అని చిత్తశుద్ధి చూపించిన పరిస్థితులు, పాలకులు ఎప్పుడూ కనిపించలేదు.
ఈ రోజు ఆ పరిస్థితులన్నీ మారి, స్పష్టమైన మార్పు కనిపిస్తోంది కాబట్టి గొప్ప ప్రక్రియకు ఈరోజు బీజం పడుతోంది.
ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక విప్లవాత్మక మార్పుల్లో జగగన్న భూహక్కు కార్యక్రమం కూడా ఒకటి. ఇది కాక మార్పులు రాష్ట్రంలో ఏ స్ధాయిలో జరుగుతున్నాయో గమనించండి.

రాష్ట్ర రాజధానిలో ఉండే సచివాలయం మాత్రమే కాదు... ప్రతి గ్రామంలో కూడా పౌరసేవలందించే సచివాలయాలుండాలని, తద్వారా ప్రతి సేవ పారదర్శకంగా, వివక్ష లేకుండా, లంచాలకు తావులేని విధంగా అందాలని, అధికారంలోకివచ్చిన వెంటనే దాదాపు 15,004  గ్రామ, వార్డు సచివాలయాలు నియమించాం. 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు నియమించాం. ఆ సచివాలయాల్లో ఉద్యోగులుగా మన పిల్లలకు మన దగ్గరే పనిచేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ చొప్పున  2.60 లక్షల మంది వాలంటీర్‌లు ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నారు.
పరిపాలనా సంస్కరణలో మార్పు తీసుకొచ్చిన ఘటన ఇది. పరిపాలనా సంస్కరణలలో ఒక అడుగు ముందుకు వేశాం. అంతటితో ఆగలేదు. 13 జిల్లాలు ఉంటే వాటిని మేనేజ్‌ చేయడం కలెక్టర్లకు, ఎస్పీలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాటిని కూడా ప్రక్షాళన చేస్తూ 13 నుంచి 26 జిల్లాలుగా మార్చాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మనదే. 

ఇదే మాదిరిగా రాష్ట్రంలో కూడా ఒకే రాజధాని, ఒకే ప్రాంతంలో ఉంటే దానివల్ల జరిగే మంచి కన్నా.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా రాజధానుల్ని కూడా మూడు ప్రాంతాలకు మూడు ఇవ్వడం జరిగింది.

మెడికల్‌ కాలేజీలు– విప్లవాత్మక మార్పులు...
ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడున్నర సంవత్సారల కాలంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా... తీసుకొచ్చిన మరో గొప్ప మార్పు.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు. 
మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. ఆ 11 సరిపోని పరిస్థితి. మనకు సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కావాలన్నా, అటువంటి సేవలు అందించాలంటే మన దగ్గర హైదరాబాద్‌ వంటి టయర్‌ –  నగరాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ మల్టీస్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు అందని పరిస్థితి. దీన్ని పూర్తిగా మారుస్తూ... మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పుల్లో ఈరోజు మరో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నాం.
ఎందుకంటే ఎక్కడైతే మెడికల్‌ కాలేజీ వస్తుందో అక్కడ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ వస్తారు. పీజీ స్టూడెంట్స్‌ ఎప్పుడైతే వస్తారో.. అక్కడ మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలు మన  ప్రజలకు మన దగ్గర, మన కళ్లెదుటనే అందుబాటులోకి వస్తాయని... ఈ గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం. 

రైతుకు తోడుగా.. – ఆర్బీకేలు...
గ్రామస్ధాయిలో రైతన్నలకు ప్రతి విషయంలో తోడుగా అండగా నిలబడేందుకు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులువేస్తే విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయి. అందులో 67 మందులతో 14 రకాల డయాగ్నోస్టిక్‌ టెస్టులు చేసే మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రాక్టీసనర్, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు అక్కడే రిపోర్టు చేస్తారు. వీళ్లందరూ కూడా ప్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో ప్రివెంటివ్‌ కేర్‌లో విప్లవాత్మకంగా గ్రామ స్ధాయిలో మార్పులు తీసుకొచ్చే విధంగా మన ప్రభుత్వంలోనే అడుగులు వేశాం.
అదే విధంగాఅక్కడే నాడు–నేడుతో మార్పు చెందుతుదన్న ఇంగ్లిషు మీడియం స్కూల్‌ కనిపిస్తోంది. అదే గ్రామంలోనే కట్టడానికి సిద్ధంగా ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తాయి. అన్‌లిమిటెడ్‌ బ్యాండ్‌ విడ్త్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి.. వర్క్‌ ఫ్రం హోం కాన్సెఫ్ట్‌ అనేది మన గ్రామ స్ధాయిలోనే మన పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్‌ లైబ్రరీలు తీసుకొచ్చే గొప్ప మార్పు జరుగుతుంది. 
ఈరోజు అక్కచెల్లెమ్మలు ఏ సమయంలో అయినా ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు కేవలం వాళ్ల సెల్‌ఫోన్‌ తీసుకుని పోయి.. అందులో దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేస్తే చాలు.. ఆ చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, 5 సార్లు ఫోన్‌ షేక్‌ చేసినా చాలు వెంటనే 10–15 నిమిషాల్లో పోలీసు మీ దగ్గరకు వచ్చి చెల్లెమ్మా ఏమైంది నేను నీకు తోడుగా ఉన్నాననే గొప్ప మార్పు ఈ రోజు కనిపిస్తోంది.
దిశ పోలీస్‌ స్టేషన్లు వంటివి అక్కచెల్లెమ్మల భద్రతలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో మార్పును చూపిస్తున్నాయి. 

శ్రీకాకుళం  జిల్లానే తీసుకుంటే... 
. ఇచ్చాపురం, పలాస ప్రాంతంలో కిడ్నీ సమస్యతో బాధపడే ప్రజలు మన కళ్లెదుటనే దశాబ్దాలుగా కనిపించేవారు. పాలకులు వచ్చేవారు వారితోపాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టర్లూ వచ్చేవారు.  ఐదు సంవత్సరాలు వాళ్లంతా కలిసి పరిపాలన చేశారు. ఐదేళ్లపాటు వాళ్లు సంసారం చేశారు. అయినా.. ఇచ్చాపురంలో కిడ్నీ పేషెంట్లు గుర్తుకు రాలేదు, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు గుర్తు రాలేదు. వారికి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత జరిగిన  మార్పు.. ఈ రోజు ఒక్క ఇచ్చాపురం, పలాస ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రు.765 కోట్లతో సర్పేస్‌ వాటర్‌ తీసుకొచ్చి, కిడ్నీ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించే గొప్ప కార్యక్రమానికి  అడుగులు పడుతున్నాయి. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి.  
ఒక్క కిడ్నీ పేషెంట్లకు సంబంధించి రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ ఆసుపత్రి కూడా కడుతున్నాం. అది కూడా దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కిడ్నీ పేషెంట్ల కోసం మానవతాధృక్పధంతో ఆలోచన చేసి.. రూ.10వేలు డయాలసిస్‌ చికిత్స కోసం వాళ్లకు పెన్షన్‌ రూపంలో ఇచ్చే మార్పు తీసుకొచ్చాం. ప్రతి అడుగులోనూ ఏం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది.. ఏం చేస్తే దీనిలో శాశ్వతంగా మార్పు వస్తుందని ఆలోచన చేసి అడుగులు వేస్తున్నది మీ అన్న, మీ తమ్ముడి ప్రభుత్వం. 

పాలనలో ప్రజలకు మనసుతో తెచ్చిన మార్పులివి
ఇవన్నీ పరిపాలనలో ప్రజల కోసం మనసుతో, బాధ్యతతో మనం తీసుకొచ్చిన మార్పులు.
కాసేపు క్రితం మంత్రి ధర్మాన మాట్లడుతూ... శ్రీకాకుళం గురించి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో మాట్లాడటం దగ్గర నుంచి మొదలైన  ప్రతి కార్యక్రమం గురించి చెప్పారు. ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ చేయలేదు. మీ బిడ్డ మాత్రం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశాడు. పూర్తి చేసే కార్యక్రమం కూడా మన కళ్లెదుటనే కనిపిస్తోంది.
ఈ మార్పులు, సంస్కరణలో భాగంగా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా  11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా ఇక మీదట భూములు, ఆస్తులు అమ్మకాలు, కొనుగోలు రిజిస్రేషన్‌ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇంతకు ముందు కేవలం 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రమే ఉండేవి. ఇవాళ దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 11వేలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈరోజు సబ్‌రిజిస్ట్రార్‌ సేవలు అందుబాటులోకి వచ్చే మార్పు జరుగుతుంది.

చివరిగా..
రెండు మాటలు మిమ్నల్ని అందరినీ ఆలోచన చేయమని చెపుతున్నాను. ఎక్కడైనా తన ఆస్తిని తాను అనుభవిస్తే వారిని హక్కుదారులు అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడని మనమంతా అంటాం. అదే మాదిరిగా మీరంతా ఆలోచన చేయండి. 

రాముడెవరో – రావణుడెవరో ఆలోచన చేయండి...
ఎవరైనా తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్ధం చేస్తే ఆ మనిషిని శ్రీరాముడు అని అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్నువేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్లను రావణుడు అంటారు. మరి తనకు తాను పార్టీ పెట్టుకుని.. ఎవరైనా అధికారంలోకి  వస్తే వాళ్లను ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆరో లేదా ఒక జగనో అంటారు. కానీ ఎవరైనా సొంత కూతుర్నిచ్చిన మామను, ఆ మామ పెట్టిన పార్టీని, ఆ మామ పెట్టిన ట్రస్టుని, చివరికి ఆ మామకి ప్రజలిచ్చిన ఆ సీఎం కుర్చీని.. వీటన్నింటినీ వెన్నుపోటు పొడిచి కబ్జా చేస్తే వాళ్లను ఏమంటారు ? చంద్రబాబు అని అంటారు. 

వీళ్లు దుష్టచతుష్టయం – రాక్షస మూక...
రావణుడిని సమర్ధించిన వారిని మనమంతా రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడిని కొమ్ము కాసిన వారిని మనం దుష్టచతుష్టయం అంటున్నాం. మరి మామ కుర్చీని కబ్జా చేసి, మామ పార్టీని దందా చేసి ఎన్నికలప్పుడు ప్రజలు మాయ మాటలు చెప్పి, ఆ తర్వాత ఆ ప్రజలను గాలికి వదిలేసి మోసం చేసిన చంద్రబాబును సమర్ధిస్తున్న ఒక రామోజీరావును, ఈనాడును, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని, దత్తపుత్రుడని వీళ్లనేమనాలి ? దుష్ట చతుష్టయమని అనాలా ? వద్దా ? వీరిని రాక్షసమూకలనాలా ?వద్దా ? అని ఆలోచన చేయండి.

మీ సేవలు మాకొద్దు - బై బై బాబూ అనండి....
ప్రజాస్వామ్యం అంటే అర్ధమేమిటి. తమను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటలను నాయకులు నిలబెట్టుకోవాలి. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ తమను గెలిపించిన ప్రజలను ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. అనేక సార్లు మోసం చేసి, మాటలు తప్పి, వెన్నుపోటి పొడిచిన నాయకుడ్ని మరోసారి అసెంబ్లీకి పంపాలా ? లేక మీ సేవలు మాకొద్దు బాబూ అంటూ బై బై చెప్పి ఇంటికి పంపాలా అన్నది ఆలోచన చేయండి.
రావణుడికి కానీ, దుర్యోధనుడి కానీ, మోసం చేసే వాడికి కానీ, వెన్నుపోటు పొడిచే వాడికి కానీ మరో ఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా ? అన్నది ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి. 
రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే కేవలం ఒక నలుగురు తోడుగా ఉంటే చాలు ప్రజలు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితుల్లోకి తయారయ్యాయి. 
ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు వీళ్లుంటే నాకు ఇక చాలు.. నాకు ఇక ప్రజలతో అవసరం లేదు, ప్రజలను మోసం చేసినా, వాళ్లకు ఎన్ని అబద్దాలు చెప్పినా ఎవ్వరూ రాయరు, ఎవ్వరూ చూపరు, ఎవ్వరూ ప్రశ్నించరు అనుకునే రాజకీయ వ్యవస్ధలో మార్పు రావాలి.
రాజకీయం అంటే ఒక జవాబుదారీ తనం. రాజకీయం అంటే ప్రజలకు, ఇంటింటికీ మనం మంచి చేస్తేనే, ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారు. లేదంటే అధికారం నుంచి తప్పుకుంటారు అనే మెసేజ్‌ పోవాలి.
అందుకనే నేను వాళ్ల మాదిరి దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు. 

దేవుడి దయను, ప్రజలనే నమ్ముకున్నాను...
నేను నమ్ముకున్నదెవరిని అంటే ఆదేవుడి దయని, ప్రజలని మాత్రమే.
మీ అందరితో నేను ఇదే చెప్తున్నాను. వీళ్లు చెప్పే అబద్దాలను నమ్మొద్దండి. టీవీలలో వీళ్లు చూపించే అబద్దాలను చూడొద్దండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా పెట్టుకొండి. 
ప్రతి ఇంటిలో కూడా మీ ఇంటికి మంచి జరిగిందా ? లేదా ?అన్నది ఒక్కటే  కొలమానంగా పెట్టుకొండి. మంచి జరిగి ఉంటే... మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డకు తోడుగా నిలబడండి.  మీ జగన్‌కు అండగా నిలబడండి.  ఇటువంటి మోసాలకు, అబద్దాలు నమ్మోద్దు. 
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలి. 

నరసన్నపేటకు సీఎం వరాల జల్లు

ఎమ్మెల్యే కృష్టదాసు మాట్లాడుతూ నరసన్నపేట ఆర్‌ అండ్‌ బి రోడ్డు విస్తరణకోసం, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం రూ.10 కోట్లు ఖర్చువుతుందని అడిగారు. దీన్ని మంజూరు చేస్తున్నాను.  మడపాం లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం వల్ల 4వేవల ఎకరాలకు మంచి జరుగుతుంది, రూ.15 కోట్లు  ఖర్చవుతుందని చెప్పారు. ఇది కూడా మంజూరు చేస్తున్నాను. 
బొంతు లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం బ్యాలెన్స్‌ వర్క్స్‌ పూర్తి చేయాడనికి రూ.40 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇది కూడా మంజూరు చేస్తున్నాను. రివర్స్‌ ఫ్లో ఆటోమేటిక్‌ పాలింగ్‌ షట్టర్స్‌ గుడిపేట వద్ద కావాలన్నారు. ఇది కూడా మంజూరు చేస్తున్నాం. వంశధార కెనాల్‌ మీద డీ ఎల్‌ పురం వద్ద లో లెవల్‌ కాజ్‌వే అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాను. నరసన్నపేటలో రాజుల చెరువు అభివృద్ధి కోసం రూ.10 కోట్లు అడిగారు. ఇదీ మంజూరు చేస్తున్నాం. రెవెన్యూ శాఖాపరంగా విలేజ్‌ సర్వేయర్ల గ్రేడ్‌ –3 ని విలేజ్‌ సర్వేయర్ల గ్రేడ్‌ – 2 గా రీ డిజిగ్నేట్‌ చేయడం జరుగుతుందని వాళ్లకు కూడా శుభవార్త చెబుతున్నాను. మరొక్కసారి దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరికీ  ఇంకా ఎక్కువ మంచి చేసే రోజులు రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top