కొత్త జిల్లాలపై సూచనల పరిశీలనకు కమిటీ

జిల్లా కలెక్టర్లు, సీసీఎల్‌ఏ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శితో ఏర్పాటు 

వచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు 

వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్న సీఎస్‌ కమిటీ

అమరావతి: కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను  క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిపై అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. వాటిపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.

జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఇక తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్‌ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్‌ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.

ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయిస్తుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ ప్రక్రియ పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వీరి సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ చివరకు నిర్ణయం తీసుకుంటుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top