విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలతో మా పార్టీకి సంబంధం లేదు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టీకరణ

విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
 
 బీసీలకు ఏం చేశావు అని మీ అయ్యను అడగాల్సింది లోకేష్..!

లోకేష్ ఒక చెల్లని కాణి..

 సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం వైయ‌స్ జగన్ గారు

 ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ, పేద వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

 మంత్రి మేరుగు నాగార్జున

తాడేప‌ల్లి: విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలతో మా పార్టీకి గానీ, ప్ర‌భుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేద‌ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.  మహాత్మా గాంధీజీ పై రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వపరంగానూ, పార్టీ పరంగానూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు  మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.  ఆయన మా పార్టీ వారు కాదు. ఆయన మా పార్టీలో కూడా పెద్ద పదవులు చేసిన పరిస్థితి లేదు అని చెప్పారు. ఎస్సీల హక్కులు కాపాడుతూ, అలానే ఇతర కులాల హక్కులకు ఇబ్బంది కలిగించకుండా చూడాల్సిన బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆయన బాధ్యతతో మాట్లాడాల్సిందని మంత్రి మేరుగు అభిప్రాయపడ్డారు. దేశం గర్వించదగ్గ నాయకులు గాంధీజీ, అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ , పూలే లను గౌరవించడం, మహానుభావులుగా పూజించడం మన సంస్కృతి, మన విధానం అని ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారు చాటి చెబుతారన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన నాయకుడు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అని గుర్తు చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

 
మీ అయ్యను అడగాల్సింది లోకేష్..!
        బీసీలకు మా ప్రభుత్వం వచ్చాక చేస్తున్నమేలు, వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిగారి నేతృత్వంలో బీసీల సమావేశం నిర్వహిస్తే.. దానిపైన టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు చాలా మేలు జరిగిందని ఆ సమావేశంలో ముక్తకంఠంతో తీర్మానించడం జరిగింది. బీసీలంతా ఏకమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ రథ చక్రాలు ఊడిపోతున్నాయి. దీంతో ఆ పార్టీ ట్వీట్ల వీరుడు, మా పార్టీ పెద్దల గురించి నోటికొచ్చిన పదాలు వాడుతున్నాడు. బీసీల  గురించి మాట్లాడేటప్పుడు.. బీసీలకు ఏం చేశాడో, ఒకసారి మీ అయ్యను అడగాల్సింది లోకేష్. ఒకప్పుడు ఎన్టీఆర్ పెట్టిన టీడీపీకి బీసీలు పట్టుగొమ్మలుగా ఉండేవారు. ఆ తర్వాత మీ తండ్రి చంద్రబాబు పార్టీని లాక్కున్నాక, బీసీలను అణగదొక్కాడు. 

బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, పేద వర్గాలకు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తున్నారు. అది లోకేష్ కు మాయలా కనిపిస్తుందంటే, అతనికంటే అజ్ఞాని మరొకరు ఉండరు. లోకేష్ కు రాజకీయాలు తెలియవు. కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేకపోయాడు. నీ అయ్య, నీకు రాజకీయాలు నేర్పడు, ఎందుకంటే, నీవు ఒక సుద్ద పప్పువి అని ఆయనకీ తెలుసు. అటువంటి నీవు  మా పార్టీ పెద్దల గురించి నోరు పారేసుకుంటే సహించేది లేదు. మా పార్టీ పెద్దల గురించి అక్షరం మాట్లాడే అర్హత కూడా లోకేష్ కు లేదు.

లోకేష్ ఒక చెల్లని కాణి
    జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో  బీసీలకు అన్నింటా పెద్ద పీట వేశారు. మీ బాబు లాక్కున్న పార్టీ ఉందని, నోటికి ఏదొస్తే.. అది మాట్లాడితే కుదరదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. జగన్ గారు సామాజిక విప్లవానికి తెరతీసి, ఒక చరిత్ర సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల అభ్యున్నతికి, వారి బంగారు భవిష్యత్తు కోసం పనిచేస్తున్న గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో లిఖించే విధంగా జగన్ గారి పరిపాలన ఉంది. ఎక్కడెక్కడో ఉన్న బీసీ కులాల్ని వెతికి మరీ, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారికి పదవులు ఇచ్చారు, గౌరవించారు.  మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు.. ఇలా అన్నింటా బీసీలకు జగన్ గారి పరిపాలనలో అగ్ర తాంబూలం దక్కుతుంది. మా పార్టీ నాయకత్వాన్ని కించపరుస్తూ.. ట్విట్టర్ లో ఉడత ఊపులు ఇప్పటికైనా చాలిస్తే మంచిది. లోకేష్ ఒక చెల్లని కాణీ.  లోకేష్ వ్యాఖ్యలు, అతని పెత్తందారీ మనస్తత్వానికి, అహంకారానికి నిలువుటద్దంలా ఉన్నాయి. 

రాష్ట్రంలో సామాజిక సంస్కరణలకు శ్రీకారం
            విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని నమ్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రభుత్వ స్కూళ్ళను కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్ది, విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ గారు. జగన్ గారు అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఈరోజు బడుగు,  బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల  స్వరూపాలే మారిపోతున్నాయి.  ప్రతి పల్లెకూ, ప్రతి గడపకూ అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా వంటి పథకాలు అందుతున్నాయి. వీటన్నింటితో పాటు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు ఇవాళ ఇంగ్లీషు మీడియం చదువులు గర్వంగా చదువుకోగలుగుతున్నారు.  మహిళల పేరు మీదే 31 లక్షల మందికి, అందులో మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూశారా..?. మరి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..?. ఈ వర్గాల అభ్యున్నతి కోసం రూ.  1.80 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ముఖ్యమంత్రి గారు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తే.. వారిలో మెజార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే.  పేదలను అక్కున చేర్చుకున్న పార్టీ మాది. పిల్ల కాకిలా ట్వీట్లు పెట్టడం మానేయ్ లోకేష్.  తిండి లేని పేదవాడు కూడా, ఆరోగ్యశ్రీ ద్వారా  కొవిడ్ లో వైద్యం పొంది ప్రాణాలు దక్కించుకున్నాడు.. జగన్ గారి పరిపాలన వల్లే బతికి బట్టకట్టాం అని పేదలు చెబుతున్న మాటలు మీ చెవులకు ఎక్కడం లేదా.. ? 

- టీడీపీ హయాంలో సామాజిక న్యాయం అంటే.. సుజనా చౌదరిలాంటి వాణ్ణి కేంద్ర మంత్రిని చేయడం, అతనికి ఆస్తులు కూడబెట్టడమే చూశాం. అలానే టీడీపీ ప్రజా ప్రతినిధులు కాల్ మనీ పేరుతో మహిళల్ని వేధిస్తే... వారి మీద ఎక్కడ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను వాడుకోవడమే సామాజిక న్యాయమా..?. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు మాట్లాడటం సామాజిక న్యాయమా..?.  దళితులు మురికిగా ఉంటారని, శుభ్రంగా ఉండరని తన మంత్రులతో మాట్లాడించడమే సామాజిక న్యాయమా..? అని ప్రశ్నిస్తున్నాం. 

ఈ వర్గాలను నెత్తిన పెట్టుకున్న సీఎం వైయ‌స్ జగన్ గారు
        ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ, ఆ వర్గాలను నెత్తిన పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్ గారు. ఈ వర్గాలన్నింటినీ ఒకే తాటి మీదకు తెచ్చి.. బీసీలంటే.. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు..  సమాజానికి వెన్నెముక అని మార్చిన నాయకుడు జగన్ గారు. పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్ మోహన్ రెడ్డిగారిని నోటికొచ్చినట్లు మాట్లాడితే.. మీకు పుట్టగతులు ఉండవు. మీకు రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తే ఉండదు. ఇప్పటికే చంద్రబాబు పార్టీ చక్రాలు ఊడిపోయి.. తిరగలేక, బాబ్బాబూ.. అంటూ వాళ్ళు, వీళ్ళు కాళ్ళు పట్టుకుని పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు అని మంత్రి మేరుగు నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. 

Back to Top