విజయవాడ: ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని.. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 20 వేల కోట్ల అప్పులు చేసి, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని ఆరోపించారు. ఆ అప్పులన్నీ మేము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామన్నారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.