ప్ర‌పంచ వేదిక‌పై ఏపీని నిల‌బెట్టేందుకు మీ స‌హ‌కారం మాకు అవ‌స‌రం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గ‌త మూడేళ్లుగా ఏపీ నంబ‌ర్ వ‌న్‌

పారిశ్రామిక వేత్త‌ల ఫీడ్ బ్యాక్‌తోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నాం

విశాఖ‌ త్వ‌ర‌లో రాజ‌ధాని కాబోతోంది.. నేను కూడా షిఫ్ట్ అవుతున్నా..

మార్చి 3, 4 తేదీల్లో విశాఖ‌లో గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నాం

విశాఖ‌లో  పెట్టుబ‌డులు పెట్టేందుకు మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తున్నాం

ఢిల్లీలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ స‌న్నాహ‌క‌ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఢిల్లీ: ‘‘ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. 11.43 వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. వరుసగా గత మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ స‌న్నాహ‌క‌ సదస్సుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో వివిధ దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా స‌ద‌స్సుకు హాజ‌రైన ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.
 
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం..
11.43 శాతం జీఎస్‌డీపీతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా గత మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. ప్రత్యేకంగా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఇచ్చిన అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. పారిశ్రామిక వేత్త‌ల ఫీడ్ బ్యాక్‌తోనే ఏపీ నంబ‌ర్ స్థానంలో నిలిచింది.

ఈ స‌ద‌స్సులో ఇంతకు ముందు ప్రదర్శించిన వీడియోలో సుస్పష్టంగా  చెప్పినట్లుగా ఏపీకి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇప్ప‌టికే 6 పోర్టులు ఏపీలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. వీటికి అద‌నంగా మరో 4 పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 ఇండస్ట్రీయల్‌ కారిడార్స్‌ నిర్మిస్తున్నాం. దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ నిర్మిస్తుంటే.. వాటిలో 3 ఏపీలో నిర్మించబడటమే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి, పరిశ్రమలకిచ్చే కనెక్టివిటీని తెలియజేస్తున్నాయి.  పరిశ్రమలకు కావాల్సిన సహజ వనరులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులు ఇచ్చేవిధంగా సింగిల్ డెస్క్ విధానం వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్నాము. 

ఏపీలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫాక్చరింగ్  క్లస్టర్స్, టాయ్  క్లస్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్, టెక్స్‌టైల్స్ పార్క్స్, సిమెంట్  క్లస్టర్స్, మెడికల్ డివైజ్ మ్యానుఫాక్చరింగ్  క్లస్టర్, ఫార్మా మరియు ఆటోమొబైల్  క్లస్టర్ ఉన్నాయి.  

రాబోయే రోజుల్లో రాజధానిగా మారబోతోన్న విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. త్వరలోనే నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. విశాఖ‌లో మార్చి 3, 4న గ్లోబల్‌ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలో జరిగే సమ్మిట్‌లో పాల్గొనాలని అందరినీ నా తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ఎంత సులభమో మీ సహచరులకు, విదేశాలలో ఉన్న మిత్రులకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. సమయం ఇచ్చి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సుకు హాజరైన వారందరికీ నా కృతజ్ఞతలు.

Back to Top