సహాయ, పునరావాస కార్య‌క్ర‌మాల‌ను నేనే స్వయంగా పరిశీలిస్తా..

మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి

పశువులకు గ్రాసం కొరతలేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టండి

వరద ప్ర‌భావిత‌ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు రక్షిత తాగునీటి సరఫరా కొనసాగించాలి

పంట, ఆస్తినష్ట పరిహారం పారదర్శకంగా అందించాలి

శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2 వేలు, వ్య‌క్తులైతే రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి

వరద ప్రభావిత జిల్లాల‌ కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని, ఈ కార్యక్రమాలను తానే స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లుకు సూచించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 

వరద సహాయక కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్లు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ``మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ అందించాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి. ఈ సహాయం అంద‌ని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు, వ్యక్తులైతే రూ.వెయ్యి  చొప్పున‌ ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి. 

వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. వైద్యశిబిరాలను కొనసాగించండి పీహెచ్‌సీల్లో, విలేజ్‌ క్లినిక్స్‌లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కోసం జాబితాను ఉంచండి. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి. 

అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లది. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలి. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలి. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలి. 

సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదు. నేను ఎక్కడకు వచ్చేదీ  ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు మీకు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తాను`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌కు చెప్పారు.

Back to Top