మన కర్తవ్యం పవిత్రమైనది.. లక్ష్యం ఉన్నతమైనది

ప్రతి ఇంటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అడుగులు వేస్తున్నాం

గ్రామాల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం

చరిత్రలో లేని విధంగా విద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం కార్యక్రమాలు

అవినీతి, వివక్షకు తావులేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నాం

వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ తెలుగుజాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది

నిత్యం విషప్రచారాలు చేసే టీవీలు, పత్రికల తీరును సమాచార స్వేచ్ఛ అందామా..?

బయటివారి కత్తిగాట్లు.. సొంతవారి వెన్నుపోట్లతో తల్లడిల్లిన రాష్ట్రం మనది

కులాల కలుపు మొక్కలు రాష్ట్రం పరువు తీస్తున్నాయి

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలంతా ఆలోచన చేయాలి

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘ఆంధ్రప్రదేశ్‌ అవతరించి నేటికి 64 ఏళ్లు. అమరజీవి పొట్టిశ్రీరాములు మహాత్యాగాన్ని స్మరించుకుంటూ ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకునేందుకు, ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో మరిన్ని ముందడుగు వేసేందుకు ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసిన మువ్వన్నెల జెండాకు వందనం చేసిన అనంతరం తెలుగు తల్లికి నమస్కరించి.. అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం ఏం మాట్లాడారంటే..

తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్‌ 19న పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష చేయడం. 58 రోజుల పాటు ఆ నిరాహార దీక్ష కొనసాగింది. 1952 డిసెంబర్‌ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఆ తరువాత 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రరాష్ట్రం అవతరించింది. తెలుగువారందరి ఉమ్మడి రాష్ట్రంగా 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఇవన్నీ మనకు తెలిసిన గొప్పనైన చరిత్ర. 

ఎందరో మహనీయుల త్యాగఫలం మన రాష్ట్రం. 28 రాష్ట్రాల దేశ చరిత్రలో ఇన్ని త్యాగాల నడుమ ఏ రాష్ట్రం కూడా పడనంతగా దగా పడిన రాష్ట్రం కూడా మనది అని గుర్తుచేసుకోవాలి. బయటివారి కత్తిగాట్లు.. సొంతవారి వెన్నుపోట్లతో తల్లడిల్లిన రాష్ట్రం మనదని గుర్తుచేసుకోవాలి. నేటికి కూడా 33 శాతం మన రాష్ట్రంలో చదువురాని వారు ఉన్నా.. నేటికి కూడా దాదాపుగా 85 శాతం ప్రజలు తెల్లరేషన్‌ కార్డులతో బీపీఎల్‌ దిగువన ఉన్నా.. స్వయం సహాయక బృందాల్లో చేరి స్వావలంబన కోసం సుమారు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలు సమరం చేస్తున్నా.. ఒక పంటకు కూడా కనీసం నీటి సదుపాయం లేకుండా కోటి ఎకరాలు భూములు ఇవాల్టికి మన రాష్ట్రంలో ఉన్నాయన్నా.. నేటికి కూడా ఆవాసం కోసం ఎదురుచూస్తున్న 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయన్నా.. పిల్లల చదువుల కోసం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆస్తులు ఎన్నో కుటుంబాలు అమ్ముకోవాల్సిన మనం రాష్ట్రం చూస్తోంది. ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవలు కూడా దేవరించాల్సిన పరిస్థితులు.. ఇలాంటి అనేక అంశాలు నెరవేర్చాల్సిన మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. 

గ్రామ, గ్రామాన ప్రజల ఆకాంక్షలను, అవసరాలను వారిలో ఒకరిగా ఉండి వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి వారితో మమేకై గుర్తించి మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆస్పత్రి, మన వైద్య, ఆరోగ్య రంగం, మన నీటి పారుదల రంగం వంటి ప్రతి అంశంపై అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టాల్సిన దానికంటే వాస్తవిక దృక్పథంతో పెట్టాం. 

తెలుగువారందరికీ మంచి జరగాలంటే మన గ్రామాల రూపురేఖలు ఎలా మార్చాలనే ఒక డ్రీమ్‌తో పరిగెత్తడం జరిగింది. గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో ప్రతి సేవ డోర్‌ డెలివరీ కనిపిస్తుంది. అదే గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంతో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల రూపురేఖలు కనిపిస్తాయి. ఆ పక్కనే వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ పేరుతో ఏకంగా 51 రకాల మెడిసిన్‌తో ఒక ఏఎన్‌ఎం నర్సు, ఆశా వర్కర్ల రిపోర్టింగ్, ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్‌గా 24 గంటలు సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతును చేయి పట్టి నడిపించే  రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యాచరణలు చేస్తున్నాం. 

గ్రామాల రూపురేఖలు మార్చి.. ప్రతి గ్రామంలో ప్రభుత్వ సేవలను కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు ఇవేవీ చూడకుండా అవినీతి, వివక్ష లేకుండా మన 17 నెలల పాలన సాగింది.. సాగుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మొత్తంగా వ్యవస్థల్లోనే మార్పులకు శ్రీకారం చుట్టాం. గ్రామాన్ని ఒక యునిట్‌గా తీసుకొని సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాం. 

మన తెలుగు రాష్ట్రంలో ఒక మహ యజ్ఞం జరుగుతుంది. దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు.. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా..? మనమంతా ఈ అంశాలపై ఆలోచన చేయాలి. తెలుగు నేలపై పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను ఈ రోజున బజారులోకి ఈడుస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేద్దామా అనే ఆలోచనలు చేయాలి. 

నా వాళ్లు కాదనే ధోరణిలు బాహటంగా రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. ఇవన్నీ మన కళ్ల ఎదుటనే ఇవి కనిపిస్తున్నాయి. ఇలాంటి ధోరణులను సమర్థించవచ్చా..? ప్రజల తీర్పును, ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ మొత్తం తెలుగుజాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది. దీనని ఇలాగే కొనసాగిద్దామనే ఆలోచనలు గట్టిగా చేయాలి. 

తన వాడు గెలవలేదు.. తమ వాడు అధికారంలో లేడన్న కడుపుమంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న పేపర్లు, టీవీల వైఖరిని సమాచార స్వేచ్ఛ అందామా..? వీటిపై ప్రజలంతా ఆలోచన చేయాలి. సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. అయినా కర్తవ్యం పవిత్రమైంది.. లక్ష్యం ఉన్నతమైనదని కాబట్టి ప్రజాబలంతో మార్గం వేయగలం అని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలం అన్న నమ్మకంతో ఇక మీద మన రాష్ట్రంలో ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మన ప్రభుత్వం వెరపన్నది లేకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలందరకీ మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top