2023 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తాం

అవరోధాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్తున్నాం

సీడబ్ల్యూసీ నుంచి రావాల్సిన డ్రాయింగ్స్‌ డిజైన్స్‌ డిలే అవుతున్నాయి

పోలవరం నాన్న స్వప్నం.. ఆ ప్రాజెక్టును నేనే పూర్తిచేస్తా

ప్రాజెక్టు వద్ద నాన్న విగ్రహం కూడా ఏర్పాటు చేస్తా

పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించం

ఎన్నిక ఎన్నికకు ఎత్తు తగ్గి మరుగుజ్జు అయ్యేది చంద్రబాబే..

ఎత్తు తగ్గిస్తున్నట్టు రామోజీ, రాధాకృష్ణలకు మోడీ, షెకావత్‌ ఫోన్‌ చేసి చెప్పారా..?

చంద్రబాబు చేసిన పాపాలు పోలవరానికి శాపాలుగా మారాయి

పద్ధతి, ప్లాన్‌ లేకుండా నిర్మాణాలు చేసి.. చిక్కులు తెచ్చిపెట్టాడు

రెండేళ్లుగా సాంకేతిక నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు

పోలవరం ప్రాజెక్టు ఐదు శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబుకే సొంతం

మనం వచ్చాక స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ను సేఫ్‌ లెవల్, స్పిల్‌ ఛానల్, 48 గేట్లు, మెయిన్‌ డ్యామ్‌లో గ్యాప్‌ 3, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తిచేశాం

నదీని స్పిల్‌ వే మీదుగా తరలించడం, పవర్‌ టన్నెల్‌ కీలక నిర్మాణాలు పూర్తయ్యాయి 

నిర్వాసితులను తరలించేందుకు కార్యాచరణ రూపొందించాం

ఆగస్టు నాటికి విడతల వారీగా 20,496 కుటుంబాలను తరలిస్తాం 

పోలవరం ఒక్కటే కాదు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తాం

సభలో పోలవరంపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అసెంబ్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. ఎన్నిక ఎన్నికకు ఎత్తు తగ్గేది చంద్రబాబేనని, 2024 వచ్చేసరికి కుప్పంలో కూడా ఓడిపోయి.. పూర్తిగా మరుగుజ్జులా మారుతాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన పాపాలు పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని, అవరోధాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి.. ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్‌ కల్లా పూర్తిచేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నుంచి రావాల్సిన డ్రాయింగ్స్‌డిజైన్స్‌ డిలే అవుతున్నాయని, అప్రూవల్స్‌ వస్తే ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తిచేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నమని, ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును నాన్నకు కొడుకుగా నేనే పూర్తిచేస్తాను. ప్రాజెక్టు వద్ద నాన్న విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. 

పోలవరంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘ఎల్లో మీడియా రోజుకో కథనాన్ని వండివార్చడం చూస్తున్నాం. చంద్రబాబు మాట్లాడటం.. ఆయనకు బాజా మోగించే ఎల్లోమీడియా దాన్ని ఎత్తుకోవడం ఇవన్నీ రొటీన్‌గా జరుగుతున్నాయి. తాము చేయలేని పనిని, ఇంకొకరు చేస్తున్నారనే బాధ, ఆవేదన, కడుపుమంట ఇవన్నీ కలిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ల్లో బ్యానర్‌ స్టోరీలు. సహజంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఫలానా మంచి చేశానని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేని వ్యక్తి. చివరకు సొంత జిల్లాలో కూడా నీటి సదుపాయం కల్పించడం కోసం కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయని చంద్రబాబు.. పోలవరం మన  హయాంలో పూర్తవుతుందంటే కడుపుమంట ఉండటంలో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ఎలా ఉన్నా.. సరే మసిపూసి మారేడు కాయ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

పనులు ఎలా జరుగుతున్నాయి.. గత ప్రభుత్వానికి, ఇప్పటికి తేడా ఏమిటీ.. ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయి.. వీటన్నింటికీ సంబంధించి ఆధారాలు, సాక్షాలతో సహా సభ ముందుపెడతాను. 

చంద్రబాబుకు ఒక గుణం ఉంది. తానొక గొప్ప విజనరీ అని, మేధావి అని, ప్రపంచంలోనే  తానొక మేధా సంపన్నుడని తనకు తానుగా ముద్ర వేసుకొని తన ఎల్లో మీడియా సాయంతో దాన్ని ప్రచారం చేసుకునే చంద్రబాబు.. ఏం చేశాడో గమనించాలి. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు చేసిన పనులు పోలవరం ప్రాజెక్టుకు ఎంత శాపంగా మారాయో.. ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. 

ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాంతాన్ని చూస్తే ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం నదిని పూర్తిగా కుడివైపు మళ్లించాల్సి ఉంటుంది. మళ్లించడానికి ముందే స్పిల్‌ వే పార్టును పూర్తి చేయాలి. స్పిల్‌ వే పనులను పూర్తిచేసిన తరువాతే నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ కట్టాల్సి ఉంది. రెండు డ్యామ్‌లు పూర్తిచేసిన తరువాత వీటి మధ్య మెయిన్‌ డ్యామ్‌ కట్టడం జరగాలి. కానీ, చంద్రబాబు ఒకవైపు స్పిల్‌ వే పనులు పూర్తి చేయకుండా.. మరోవైపున ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కట్టడం ప్రారంభించాడు. స్పిల్‌ వే పనులు పూర్తికాకుండా.. కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయితే నీరుపోవడానికి అవకాశం ఉండదు.. ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. రెండు కిలోమీటర్లు పొడవున్న కాఫర్‌ డ్యామ్‌లను అసంపూర్తిగా వదిలేశాడు. స్పిల్‌ వే పనులు పూర్తికాలేదు. ఇదీ చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఏం చేస్తున్నాం.. ఎందుకు చేస్తున్నాం.. ఒక ప్లానింగ్, పద్ధతి లేకుండా వ్యవహరించాడు. 

చంద్రబాబు చేసిన పనివల్ల వరదలు వచ్చినప్పుడల్లా ప్రతీసారి పనులు చేయడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున వదిలిపెట్టిన కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీల గుండా వరద నీరు రెట్టింపు వెలాసిటీతో వెళ్లాలి. మరోవైపు కట్టీకట్టని స్పిల్‌ వే ద్వారా వరద నీరు పోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో స్పిల్‌ వే వద్ద, కాఫర్‌ డ్యామ్‌ దగ్గర పనులు చేయడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. వరద వచ్చిన ప్రతీసారి స్పిల్‌ వే ముందున్న అప్రోచ్‌ ఛానల్, కింద ఉన్న స్పిల్‌ ఛానళ్లు ఎప్పుడూ నీటితో నిండిపోయి ఉంటాయి. వరద తగ్గిన తరువాత కూడా స్పిల్‌ ఛానళ్లలో దాదాపు 2 టీఎంసీలకు పైగా నీటిని మోటార్లతో పెట్టి తోడాల్సిన పరిస్థితి. ప్రతి వర్షాకాలం ఇవే కష్టాలు.. చంద్రబాబు చేసిన పనికి మూడేళ్లుగా తిప్పలుపడుతూనే మరోవైపు పనులు సాగిస్తున్నాం. 

గోదావరి నదికి కుడివైపున స్పిల్‌ వే మీదుగా మళ్లిస్తూ.. నదికి అవతల మూడు నిర్మాణాలు చేయాలి. ఎగువ కాఫర్, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, రెండింటికీ మధ్యలో మెయిన్‌ డ్యామ్‌ (ఎర్త్‌ ఫ్రం రాక్‌ఫిల్‌డ్యామ్‌) నిర్మాణం జరగాలి. చంద్రబాబు తాను పోతూపోతూ రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లుపెట్టాడో.. పోలవరం ప్రాజెక్టులో కూడా కాఫర్‌ డ్యామ్‌లలో మూడు పెద్ద పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు. 2340 మీటర్లు అంటే.. 2.3 కిలోమీటర్లు పొడవైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఒక చోట 480 మీటర్ల గ్యాప్, మరోచోట 400 మీటర్ల గ్యాప్‌ పెట్టాడు. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 450 మీటర్లు కట్టకుండా వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని వల్ల జరిగిన నష్టం భారీగా ఉంది. 

పోలవరం ప్రాజెక్టులో ఆర్థికంగా జరిగిన నష్టం ఒకవైపు అయితే.. ప్రాజెక్టు నిర్మాణంలో విపరీతమైన జాప్యం మరోవైపు. కనీసం 10 లక్షల క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 25 లక్షల క్యూసెక్కుల వరకు వరదలు గోదావరిలో వచ్చాయి. ఇంత పెద్దమొత్తంలో నీరు.. ఇటు స్పిల్‌ వే పూర్తికాలేదు కాబట్టి అటు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఖాళీల గుండా వెళ్లిపోవాల్సిన పరిస్థితి. మామూలుగా సెకన్‌కు 2–3 మీటర్ల స్పీడ్‌ ఉంటే.. కంప్రెస్‌ చేయడం వల్ల సెకన్‌కు 13.5 మీటర్ల వేగంతో వెళ్లింది. సుమారుగా 48 కిలోమీటర్ల వేగంతో నీరు అక్కడ నుంచి ప్రవహించినట్టు. నీరు వేగంతో ప్రవహించడం వల్ల మెయిన్‌ డ్యామ్‌లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్‌ లెవల్‌ కొట్టుకుపోవడమే కాకుండా.. పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకుపోయింది. మొత్తంగా 35 మీటర్ల మేర ఒక పెద్ద గుంత మెయిన్‌ డ్యామ్‌లో ఖాళీ వద్ద ఏర్పడింది. మెయిన్‌ డ్యామ్‌లో రెండో గ్యాప్‌ వద్ద పునాదిపైన బెడ్‌ లెవల్‌ 8 మీటర్లు, పునాది లోపల మరో 12 మీటర్లు కొట్టుకుపోయింది. 20 మీటర్ల గుంత రెండో గ్యాప్‌ వద్ద ఏర్పడింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌కు సంబంధించి భారీ నష్టం వాటిల్లింది. పునాది పైన బెడ్‌లెవల్‌లో 14 మీటర్లు, పునాది కింద మరో 22.5 మీటర్లు కొట్టుకుపోయింది. 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడింది. ఈ నష్టం ఇక్కడితో ఆగిపోలేదు. మెయిన్‌ డ్యామ్‌లో భాగంగా కట్టిన డయాఫ్రం వాల్‌ గ్యాప్స్‌కు అటు, ఇటు ప్రాంతం కూడా భారీగా దెబ్బతిన్నది. ఇది బాబు గారి విజన్‌. 

చంద్రబాబు విజన్‌ ఫలితం.. ప్రపంచ చరిత్రలో ఇంత దారుణమైన ప్లానింగ్, తద్వారా మ్యాన్‌మేడ్‌ డిజాస్టర్‌ చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దడానికి దేశంలో ఉన్న సాంకేతిక నిపుణులు గత రెండు సంవత్సరాలుగా మల్లగుల్లాలుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సీడబ్ల్యూసీ ఇంజినీర్ల దగ్గర నుంచి ఐఐటీల వరకు డిజైన్లను పరిశీలిస్తూ.. సరైన పరిష్కారం కోసం మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇంతటి దారుణం చంద్రబాబు వల్ల జరిగి.. ప్రాజెక్టు అనుకున్న  సమయం కంటే డిలే అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నా.. ఇవేవీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కి కనిపించిందా..? అని గుండెల మీద చేతులు వేసుకొని మనస్సాక్షిని అడగండి. వీటి గురించి కనీసం ప్రస్తావన అయినా చేశారా..? ఇంత దారుణం చేసిన చంద్రబాబును ప్రశ్నించలేని పేపర్లు, టీవీ ఛానళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయా అనేది ప్రజలు ఆలోచన చేయాలి. 

మన ప్రభుత్వం వచ్చాక ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను విజయవంతంగా అతితక్కువ కాలంలోనే పూర్తిచేశాం. గతేడాది జూన్‌ 11న మహా గోదావరిని మళ్లించి దిగ్విజయంగా స్పిల్‌ వే మీదుగా నీటిని కూడా తరలించడం జరిగింది. స్పిల్‌ వే పూర్తి చేశాం.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేశాం. మెయిన్‌ డ్యామ్‌ పనులు వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే సీడబ్ల్యూసీ, కేంద్రం  డ్రాయింగ్‌ క్లియరెన్స్‌ ఇస్తే తప్ప వేగంగా పనులు జరగవు. డ్రాయింగ్స్‌ కోసం కేంద్రం, సీడబ్ల్యూసీ మీద రకరకాల సందర్భాల్లో చర్చలు జరిపిస్తూ క్లియరెన్స్‌ వచ్చేలా చేస్తున్నాం. 

మరోవైపున డిజైన్స్‌ క్లియరెన్స్‌ పొంది దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద కారణంగా మెయిన్‌ డ్యామ్‌లో ఏర్పడిన భారీ గుంతలను ఎలా పూడ్చాలనే దానిపై డిజైన్స్‌ కూడా ఈనెలాఖరులో ఖరారు అవుతాయని కేంద్రమంత్రి చెప్పారు. 

రెండో సమస్య కూడా చంద్రబాబు చలవే. గడిచిన ఐదేళ్లలో ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ పట్టించుకోకుండానే కాఫర్‌ డ్యామ్‌ పనులు మొదలుపెట్టడం ఆశ్చర్యమేసింది. కాఫర్‌ డ్యామ్‌ పూర్తయి ఉంటే.. ముంపు వచ్చినప్పుడు ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన వారి పరిస్థితి ఏంటీ..? ఆర్‌అండ్‌ఆర్‌ ఇళ్లు కట్టించరు, పనులు చేయరు.. మరోవైపున కాఫర్‌ డ్యామ్‌ పనులకు శ్రీకారం చుట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మన ప్రభుత్వం వచ్చాక ఆర్‌అండ్‌ఆర్‌ పనులు ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటూ వెళ్తున్నాం. 373 జనవాస ప్రాంతాలు ఉంటే.. ఇప్పటికే 27 ప్రాంతాల నుంచి నిర్వాసితులను తరలించడం జరిగింది. ప్రస్తుతం కాఫర్‌ డ్యామ్‌ పూర్తయినందున ఆ మేరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. అందుకనే ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వారిని తరలించే కార్యక్రమం జరుగుతుంది. ముందస్తుగా 20,496 కుటుంబాలను తరలించాలని లెక్కవేస్తే..  అందులో 7,962 కుటుంబాలు ఇప్పటికే తరలించడం జరిగింది. మిగిలిన 3,228 కుటుంబాలు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అడిగారు. 17,268 కుటుంబాలకు ఇళ్లు కట్టించే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించి 11,984 కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 5,284 ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్వాసితులను తరలించేందుకు కార్యాచరణ రూపొందించాం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టులో విడతల వారీగా మొత్తంగా 20,496 కుటుంబాలను  తరలించడం జరుగుతుంది. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలా చంద్రబాబు గారి మీడియాలో తరచుగా ఎత్తు తగ్గిస్తున్నారని రాస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని వీరికి చెప్పారు. ప్రధాని మోడీ బెడ్‌రూంలోకి వెళ్లి అడిగారా..? లేక షెకావత్‌ బెడ్‌రూం దగ్గరకు వెళ్లి అడిగారా..? నా దగ్గరకు అయితే ఎలాగోరారు..  మరి పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ఎవరు చెప్పారో అర్థం కావడం లేదు. ప్రజల్లో భయాందోళన, గందరగోళం సృష్టించాలి, ప్రభుత్వంపై బురదజల్లాలని బాబుగారి మీడియా ఎత్తుగడ వేసి.. ఈనాడు రామోజీరావుకు ప్రధాని మోడీ చేసినట్టుగా, రాధాకృష్ణకు షెకావత్‌ ఫోన్‌ చేసి చెప్పినట్టుగా రాతలు రాస్తున్నారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు. ఎన్నిక ఎన్నికకు ఎత్తు తగ్గేది చంద్రబాబుది. 2024 ఎన్నిక వచ్చేసరికి చివరకు కుప్పంలో కూడా ఓడిపోయి మరుగుజ్జు అయిపోయే పరిస్థితిలోకి వెళ్తాడు. 

చంద్రబాబు మిగిల్చిన మూడో సమస్య.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం. కేంద్రంతో ఇన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు దాపరించిందంటే.. పోలవరం జాతీయ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుకు సమస్య తీసుకువచ్చిన కారకుడు మన విజనరీ చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసా కూడా కేంద్రమే భరిస్తుందని అర్థం. చంద్రబాబు కమీషన్ల కోసం కక్కుర్తిపడి, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్లు చంద్రబాబు చేతికి వచ్చే వరకు 2017 వరకు పోలవరం పనుల గురించి ఆలోచన చేయలేదు. మూడు సంవత్సరాలు ప్రాజెక్టును గాలికొదిలేశాడు. అంతటితో ఆగిపోకుండా.. 2013–14 ధరల ప్రకారమే ప్రాజెక్టు కడతానని కేంద్రానికి సమ్మతి కూడా తెలిపాడు. ఇదే విషయాన్ని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఏరకంగా 2013–14 రేట్లకు అంగీకరిస్తారు..? ఎలా పూర్తవుతుందని అడిగితే నా గొంతు నొక్కేశారు. 

చంద్రబాబు చేసిన పనివల్ల కేంద్రం రూ.29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది. మనం పట్టువిడవ కుండా ప్రాజెక్టుకు ఎంత అవసరం అయితే అంత డబ్బులు ఇవ్వాలని, 2017–18కి సంబంధించిన రేట్ల ప్రకారం రూ.55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రతిసారి కేంద్రం మీద ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నాం. ఇలాంటి అడ్డంకులు ఉన్నా.. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణ పనుల్లో అడుగులు ముందుకేస్తున్నాం. 

చంద్రబాబు చేసిన అన్యాయాలు, భారీ వరదలు, మధ్యలో కోవిడ్‌ లాంటి విషమ పరిస్థితులు ఉన్నా.. ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణాలు పూర్తిచేసుకుంటూ అడుగులు ముందుకేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చాక అడుగులు మనం ఎలా వేశామని ఒక్కసారి గమనించేముందు.. చంద్రబాబు హయాంలో, మన హయాంకు మధ్య నాడు–నేడు గమనించాలి. పిల్లర్లు పూర్తికాకముందే ఒక ఇనుప గేటు పెట్టి జాతికి అంకితం చేస్తున్నానని డబ్బాలు కొట్టుకున్నాడు. 

చంద్రబాబు పోలవరంలో ఎన్ని రకాల శంకుస్థాపనలు చేశాడంటే.. స్పిల్‌ వే కాంక్రీట్‌ కమెన్స్‌మెంట్‌ కోసం 30–12–2016లో ఒకటి, ఐకానిక్‌ బ్రిడ్స్‌ అండ్‌ కాఫర్‌ డ్యామ్‌ వర్క్‌ కమెన్స్‌మెంట్‌ 08–06–2017లో మరొకటి, కంప్లీషన్‌ ఆఫ్‌ డయాఫ్రం వాల్‌ కోసం 11–06–018లో శంకుస్థాపన, స్పిల్‌ వేలో రేడియల్‌ గేట్లకు సంబంధించి ఫ్యాబ్రికేషన్‌ కోసం 24–12–2018లో మరొకటి, 2018 సెప్టెంబర్‌లో స్పిల్‌ వేలో గ్యాలరీ వాక్‌ అని పెట్టాడు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టు ఫ్యామిలీ టూర్‌ వేసి ప్రాజెక్టు అయిపోయిందని భ్రమ కల్పించారు. వీటితో పాటు ఎన్నికలు వస్తున్నాయని.. రూ.100 కోట్లు ఖర్చు చేసి బస్సులు పెట్టారు. పోలవరం దగ్గరకు ప్రజలను తీసుకెళ్లి.. జయము జయము చంద్రన్న పాట పాడించాడు. దీని కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశాడు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేశాడు కాబట్టే ప్రజలు బుద్ధిచెప్పారు. 

మన ప్రభుత్వం వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. స్పిల్‌ వే నిర్మాణం పూర్తిచేశాం. అప్రోచ్‌ ఛానల్‌ను సేఫ్‌ లెవల్‌కు పూర్తిచేశాం. స్పిల్‌ ఛానల్‌ను కూడా పూర్తిచేశాం. పిల్లర్లు పూర్తిచేయకుండా రెండు ఐరన్‌ రేకులు పెట్టి గేట్లు పెట్టామని ప్రచారం చేసుకుంటే.. మేము 48 గేట్లు అమర్చి వాటిని ఆపరేషన్‌లోకి తీసుకువచ్చాం. మెయిన్‌ డ్యామ్‌లో గ్యాప్‌ 3 పూర్తిచేశాం. అన్నింటికీ మించి కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తిచేశాం. నదీని స్పిల్‌ వే మీదుగా తరలించడం పూర్తయ్యింది. ఇప్పుడు దిగువ కాఫర్‌డ్యామ్‌ పనులు ముమ్మరంగా చేస్తున్నాం. ఇది పూర్తవ్వగానే.. మెయిన్‌ డ్యామ్‌ పనులకు శ్రీకారం చుడతాం. హెడిల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కీలక టన్నల్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎడమ కాల్వకు కనెక్టివిటీ పనులు కొనసాగుతున్నాయి. 

ఇంత జరుగుతున్నా.. బస్సులు పెట్టలేదు.. భజన చేయించలేదు. ఇదంతా చిత్తశుద్ధితో చేస్తున్నాం. కేంద్రం సహకారంతో ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు కూడా వేగంగా పూర్తిచేస్తాం. అవరోధాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి.. ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్‌ కల్లా పూర్తిచేస్తాం. ఆ తాపత్రయం, తపనతో అడుగులు ముందుకేస్తున్నాం. సీడబ్ల్యూసీ నుంచి రావాల్సిన డ్రాయింగ్స్‌డిజైన్స్‌ డిలే అవుతున్నాయి. అప్రూవల్స్‌ వస్తే ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తిచేస్తాం. 

పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును నాన్నకు కొడుకుగా నేనే పూర్తిచేస్తాను. ప్రాజెక్టు వద్ద నాన్న విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో పోలవరం ఒక్కటే కాదు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందుకు వేగంగా అడుగులు వేస్తూ వెళ్తాం.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top