కోడెల మృతికి చంద్రబాబే పరోక్ష కారణం

మానసికంగా వేధించి చంపేశారు

బతికున్నప్పుడు హింసించడం.. మృతిచెందాక శవ రాజకీయాలు

వ్యతిరేక గ్రూపును ప్రోత్సహించి కోడెలను వేధించారు

కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా హింసించారు

తప్పు కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీపై బురదజల్లాలని చంద్రబాబు కుట్ర

చంద్రబాబూ ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకో

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబు పరోక్షంగా కారణమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోడెలను చంద్రబాబు మానసికంగా వేధింపులకు గురిచేశాడని, బతికి ఉన్నంత వరకు హింసించడం.. చనిపోయిన తరువాత శవ రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూడడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరితో కోడెల శివప్రసాదరావు మానసికంగా కుంగిపోయారన్నారు. పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి అధికార పార్టీపై చంద్రబాబు బురదజల్లాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నాడన్నారు. మాజీ స్పీకర్‌ కోడెల మృతి బాధాకరమని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. చంద్రబాబు మనిషేనా.. ప్రజలకు సేవ చేసే గుణం ఉందా అనిపిస్తుంది. రాత్రి 11 గంటలకు, ఉదయం పదే పదే ప్రెస్‌మీట్లు పెడుతూ అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని మాట్లాడుతున్నాడు. బతికి ఉన్నప్పుడు హింసించడం, చనిపోయాక శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఎన్టీఆర్‌ బతికి ఉన్నప్పుడు నిర్ధాక్షిణ్యంగా వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్‌ తన ఇంటర్వ్యూలో ఏ రకంగా చంద్రబాబు వేధించింది. హింసించింది వివరంగా చెప్పారు. ఎన్టీఆర్‌ మరణించిన తరువాత వెంటనే ఊరేగింపులో శవయాత్రలో పాల్గొన్నాడు. హరికృష్ణను బతికి ఉన్నంత వరకు వేధించి హింసించాడు. చనిపోయిన తరువాత దండ వేయడానికి వెళ్లి అక్కడ కూడా తెలంగాణలో రాజకీయంగా లబ్ధి కోసం శవ రాజకీయాలు చేశాడు. లాల్‌చాంద్‌ బాషాను, ఇప్పుడు కోడెల వంతు. ఇలా ఎంతో మందిని బలితీసుకున్న వ్యక్తి చంద్రబాబు. బతికి ఉన్నంత వరకు హింసిస్తాడు. చనిపోయిన తరువాత శవయాత్ర అంటాడు. 

కోడెల శివప్రసాద్‌ను మూడు నెలల నుంచి ఒక్కరోజు అయినా పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లాడా..? ఇబ్బందులు ఏంటని అడిగాడా..? అలా కాకుండా కోడెలను అవమానించే రీతిలో సత్తెనపల్లి, నర్సరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపును ప్రోత్సహించడం, వారికి అపాయింట్‌మెంట్స్‌ ఇస్తూ పార్టీ కార్యక్రమాలు మీరే చేపట్టండి అని చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో కోడెల మానసికంగా కుంగిపోయారు. 

కోడెల మృతికి ఒకపక్క ఆయన కొడుకు బాధ్యుడు అయితే.. పరోక్షంగా చంద్రబాబు కారణం. పార్టీలో మానసిక క్షోభకు గురిచేసి చంపిన వ్యక్తులు వీరు. పది రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేసుకుంటే ఇదే చంద్రబాబు కూతవేటు దూరంలో మీటింగ్‌కు వెళ్లి పక్కనే ఉన్న ఆస్పత్రిలో కోడెలను పరామర్శించకపోవడం ఆయన్ను మరింత కుంగదీసింది. ఇవన్నీ మరిచి రాజకీయ లబ్ధి కోసం ప్రెస్‌మీట్లు పెట్టి శవరాజకీయాలు చేస్తూ.. వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లుతున్నాడు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులే కోడెలను దూషించడం మొదలుపెట్టారు. 

పదే పదే శవ రాజకీయాల వల్ల, వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండడంతో ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. కోడెల మానసిక వేధన అనుభవిస్తున్న సమయంలో పరామర్శించకపోవడమే కాకుండా గ్రూపులు రెచ్చగొట్టడం వల్ల చనిపోయారని అందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై నిందలు వేస్తున్నారు. చంద్రబాబు సంస్కారం ఏపాటిదో ఆలోచించుకోండి. కోడెల బాధితులు బయటకు వచ్చి స్వయంగా కేసులు పెడితే దానికి వైయస్‌ఆర్‌ సీపీ బాధ్యత వహించాలా..? దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం.. చంద్రబాబూ? ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబు ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడు. 

తాడుతో ఉరివేసుకున్నాడని కొందరు, లుంగీకి ఉరివేసుకున్నాడని చంద్రబాబు పదే పదే అంటున్నాడు. ఒక టీవీలో గుండెపోటు అని, మళ్లీ అదే చానల్‌లో ఇంజక్షన్‌ వికటించి చనిపోయాడని, ఎల్లో మీడియా రాజకీయ వేధింపులు అని ప్రసారాలు చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తికి గౌరవ మర్యాదలు దక్కకుండా చేయాలనేది చంద్రబాబు కుట్రగా కనిపిస్తుంది. తనపై కూడా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కేసులు పెట్టాడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. తప్పు చేసినప్పుడు కేసులు పెడితే అన్ని స్టేలు తెచ్చుకొని బతుకుతున్నావు. వేధింపులు, రాజకీయ హత్యలు నీ హయాంలో ఎలా చేశావో గుర్తు చేసుకో చంద్రబాబూ... పత్తికొండలో నారాయణరెడ్డిని బాంబులు పెట్టి, నరికి చంపారు. అనంతపురంలో వందలాది హత్యలు చేయించాడు. ఎమ్మార్వో కార్యాలయంలో చంపిన నేచర్‌ చంద్రబాబు పార్టీది. అవినీతికి అండగా నిలబడి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు. వైయస్‌ఆర్‌ సీపీ వాళ్లను హింసించండి అని మాట్లాడలేదా..? 1983 తరువాత చంద్రబాబు వల్లే ఫ్యాక్షన్‌ పెరిగింది. ఫ్యాక్షన్‌ రూపుమాపిన వ్యక్తి వైయస్‌ఆర్‌. 

కోడెల ఆయన కుమారుడు, కూతురు వల్లే చనిపోయాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. 49 మంది లాంచీ ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆ ప్రాంతంలో పర్యటించి ఆస్పత్రికి వెళ్లి ప్రతి ఒక్కరిలో నైతిక స్థైర్యం నింపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు మాకు ముఖ్యమంత్రి ధైర్యం నింపారని చెబుతున్నారు. పదే పదే ఆ తప్పు ఎందుకు జరిగిందని సమీక్షలు చేస్తూ.. మరో పక్క కోడెల మృతికి సానుభూతి తెలుపుతూ పనిచేశారు. లాంచీ ప్రమాదంలో చనిపోయిన పేదవారి గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడైతే రాజకీయ లబ్ధి చేకూరుతుందని శవయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడని చంద్రబాబు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. 

కోడెల విషయమే కాదు.. ఏ అంశంలో కూడా తప్పు లేకుండా ఎవరిపై కేసులు పెట్టేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఒప్పుకోదు. పోలీసులకు కూడా అలాంటి ఆదేశాలు ఇవ్వదు. ప్రతి విషయంలో రాజకీయాలు చేయడం మానుకో చంద్రబాబూ.. రాజకీయాలను దిగజార్చొద్దని చంద్రబాబుకు మనవి చేస్తున్నా. ఈ పద్ధతి మార్చుకో చంద్రబాబు అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top