ఇంత ఉలికిపాటా? ...ఇంతింతగా కుమిలిపాటా?

పెళ్లి గ్యారంటీ అనగానే బెంబేలెత్తిపోయే మగాళ్లనేమనాలి? పెళ్లి మాట వినగానే...పెళ్లయిపోయినట్టు...ఇక అరెస్ట్‌ అయిపోయినట్టు..బతుకంతా బాధగా, చేదుగా గడిచిపోయినట్టుగా భయభ్రాంతులకు గురయ్యే బ్యాచ్‌నేమందాం? అవతలివాళ్ల విషయంలో వీరవిక్రమాధిపతుల్లా కోతలతో విరుచుకుపడే బాపతు మగధీరులు...తమ దాకా వస్తే, వంటింటిలో గిన్నెపడ్డ శబ్దానికే బాంబు పడ్డంత కలకలం చేసేస్తే ఏమనుకోవాలి? భీరులు...ఉత్తరకుమారులు అనైనా అనుకోవాలి? లేదా...దొంగతనం చేసేసి, పట్టుబడకుండా తిరుగుతూ..అనుక్షణం గుండెలరచేతపట్టుకుని పైకి నటిస్తున్న దొంగధీరులన్నా అనుకోవాలి? ఈ విశేషణాలన్నీ కలిపేసి...ఒక చోట కుప్పగా పోస్తే...టీడీపీ నాయకుల అవతారాలు కనిపిస్తాయి.

రాష్ట్రంలో ఎక్కడ అవినీతి తీగ కదిలినా, ఐటీ దాడులు జరిగినా, తమ పేరు ముడిపడి వినపడితే చాలు..చెప్పాల్సిందేదో చెప్పుకోవాల్సింది పోయి, అవతలివారిమీద బురదచల్లేస్తుంటారు. అరేబాబూ, నీ కథేందో చెప్పు అంటే, అవతలివాళ్ల కథలే కథలు అంటారు. తమదంతా వైట్‌పేపర్‌ బాపతేనంటారు. ఇప్పుడు ఏపీలో విపక్షం నాయకులు అధికారపార్టీ నాయకులపై విరుచుకుపడుతున్న తీరు గమనిస్తే, కాస్త బుద్దిజ్ఞానం ఉన్నవారికైనా..ఔరా, కిందపడ్డా పై చెయ్యి మాదే అనే గడుసుదనం కనిపిస్తుంది. మొట్టాలనిపిస్తుంది.

ఇక ఇంతగా గుండెలవిసేలా స్వీయసమర్ధనకు పూనుకుంటున్న పచ్చనేతలకు...తమ నాయకుడి రాజకీయ చిట్టా నిండా అంటుకున్న అవినీతిబురద ఎంతో తెలీదా? అడుగడుగునా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ...అడ్డదారుల్లో రాజకీయంగా, ఆర్థికంగా ఎక్కడికో ఎదిగిపోయిన బాబుగారి గతమెంత అపకీర్తి కలదో వందిమాగధ సందోహాన్ని తెలియని విషయమా? మరి తెలిసీతెలిసి ఎందుకింతగా బుకాయింపులు? ఎందుకింతగా దబాయింపులు? ఆరిపోయేముందు దీపం వెలుగెక్కువ అన్న తరహాలో...దొరికిపోయే ముందు దొంగచూపే ధీమా అనుకుందామా...ఇదంతా!

చంద్రబాబుగారి రాజకీయాల్లో శిఖరాయమానమైన కుట్రపూరిత వ్యవహారం వైస్రాయ్‌ ఎపిసోడ్‌. అది మనిషన్నవాడెవడూ కలనైనా ఊహించలేని అనైతిక అరాజకీయ నీచనికృష్ట అధమాధమ వ్యవహారం. ప్రజలచేత ఎన్నుకోబడి...అందులో ఆ ఎన్టీయార్‌ పుణ్యం తోనే తాను గెలిచిన చంద్రబాబు..అయనకే వెన్నుపోటు పొడవడం రాజకీయం అందామా? మేధావితనమందామా?

ఎన్నికలు రాగానే పొత్తుల ముసుగులో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ...బాబు పాలనంతా ప్రజలకు మద్దతుగా సాగకపోవడానికి కారణం...ఆయననెప్పుడూ పూర్తిగా ప్రజలు నమ్మలేదు. ఆయన కుట్ర, కుతంత్రాలు రాజకీయాల వలలో పడుతూ పోయారంతే. 1999–2004 మధ్యకాలంలో బాబు పాలనంతా ప్రజావ్యతిరేక పాలనే. తనను తాను రాష్ట్రానికి సీఈవోనని చెప్పుకుంటూ ఫక్తు రాజకీయదళారీగా వ్యవహారాలు నడిపారు. ఒక్కొక్కవ్యవహారం ఫలితం ప్రజాజీవితాన్ని ఎంత సంక్షుభితంగా మార్చిందో...పల్లెగడపలెంతగా కన్నీళ్ల మయమయ్యాయో?తెలియదెవరికి...? హైటెక్‌ సిటీ పేరొకటి చెప్పుకుంటూ ఊరేగిన చంద్రబాబు దెబ్బుకు ఎన్నెన్ని పేదల గుండెలు పగిలాయో??.ఎంతెంతగా జనజీవితం అల్లకల్లోలమైపోయిందో తెలియంది ఎవరికి? ఆ క్రమంలో ఆయన పాల్పడిన రాజకీయ అవినీతికి పట్టుపట్టి పట్టుకుని వుంటే ఎన్నెన్ని కేసులయ్యేవో? ఏయే తరహా కేసుల్లో ఏయే జైళ్లల్లో కూర్చోవాల్సి వచ్చేదో...? కానీ బాబు బడా బడా....? దొరకడు...దొరికినా తప్పించుకుంటాడు?ఇప్పుడు కాస్త కష్టకాలం వచ్చింది. ఇరుక్కుపోతానేమోనన్న భయం పట్టుకుంటున్నట్టుంది. అందుకే తన ఉస్కో బ్యాచ్‌ను ఉసిగొలుపుతున్నాడు. అంతా గప్‌చుప్‌ అయిపోవాలని....అమరావతి నామస్మరణ చేస్తున్నాడు. రెండెకరాల అసామీ గారు...మొదట్నుంచీ రాజకీయాల్లోనే వుంటూ..వ్యాపారం చేసి సంపాదించానంటాడు కానీ...ఆ వ్యాపారం రాజకీయవ్యాపారం కాదని గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలడా?
 చెప్పు బాబు...చెప్పు..
నిజాలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటావో...అబద్దాలతోనే రాజకీయ ’జీవితాన్ని’ ముగించుకుంటావో..?

 

- కే.వీ.రామిరెడ్డి
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌

Back to Top