ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వ‌డ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ న‌మ్మిన రాజ‌కీయం

పాదయాత్రలో ప్రజలకిచ్చిన భరోసా మరింత పెంచేలా వైయస్‌ జగన్‌ పాలన

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నాలుగేళ్లయిన సందర్భంగా పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌లో వేడుకలు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపునకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్, ఎంపీ నందిగం సురేష్, పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన భరోసాను మరింత పెంచేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగుతోందన్నారు. ఆరోజు ఇచ్చిన హామీలకు వందరెట్లు ఎక్కువగా ఈ మూడున్నరేళ్ల పరిపాలనలో అమలు చేశారన్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. కోవిడ్‌ సమయంలోనూ ప్రజలకు సంక్షేమ సాయం అందించారని గుర్తుచేశారు. అదే చంద్రబాబు అయితే కోవిడ్‌ పేరు చెప్పి పథకాలు ఎత్తేసేవాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని, పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలను మేనిఫెస్టోలో పెట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ఏనాడూ వమ్ము చేయలేదన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ, ప్రజల గురించే ఆలోచిస్తూ దేశంలోనే ఒక విలక్షణమైన పార్టీగా వైయస్‌ఆర్‌ సీపీ నిలబడిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

ప్రజా సంకల్ప యాత్రలో కొన్ని వేల సమస్యలు వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చాయని,  ప్రజా సమస్యలు తెలుసుకొని మేనిఫెస్టోలో పెట్టామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 98 శాతం హామీలు నెరవేర్చామని పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నినాదం వచ్చిందన్నారు. 
 

Back to Top