సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద వంద శాతం ఫీజురియంబర్స్‌మెంట్. సమాజంలోని అన్ని వర్గాలకు సంవత్సరానికి రూ. రెండున్నర లక్షల ఆదాయం ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఫీజురియంబర్స్‌మెంట్ చెల్లించాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. జగనన్న వసతి దీవెన పథకం కింద చదువుకునే ప్రతీ విద్యార్థికి మెస్ చార్జెస్ కింద నగదు అందజేయనున్నాం. ఐటీఐ చదువుతున్న వారికి రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి సంవత్సరానికి రూ. 15 వేలు, డిగ్రీ నుంచి ఉన్నత చదువులకు సంవత్సరానికి రూ. 20 వేలు అందించేందుకు కేబినెట్ ఆమోదం. డిసెంబర్‌లో 50 శాతం, జూలైలో 50 శాతం చెల్లించడం జరుగుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుంది. జగనన్న వసతి దీవెన కింద ప్రతి ఏటా రూ. 2300 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. గత ప్రభుత్వం కంటే వైయస్ జగన్ సర్కార్ సంవత్సరానికి రూ.1500 కోట్లు అదనంగా ఖర్చు చేయబోతుంది. జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఏటా రూ. 3400 కోట్లు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదించింది. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు మాత్రమే వెచ్చించింది. ఈ ప్రభుత్వం రూ.3400 కోట్లు వందశాతం ఫీజురియంబర్స్‌మెంట్‌కు ఖర్చు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ రెండు పథకాలకు రూ.5700 కోట్లు ఖర్చు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఆదాయ పరిమితిని రూ. రెండున్నర లక్షలకు తీసుకున్నాం. రైతాంగం అయితే పది ఎకరాల వరకు మాగాణి పొలం ఉన్నా.. 25 ఎకరాల వరకు మెట్ట పొలం ఉన్నా.. రెండు కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పారిశుద్ధ్య పనిచేసే ప్రతి కుటుంబానికి ఫీజురియంబర్స్‌మెంట్ సంపూర్ణంగా జరుగుతుంది. ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీలను వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వృత్తిగా చేసే వారికి మాత్రమే మినహాయింపు. వైయస్‌ఆర్ కాపు నేస్తం అనే పథకం అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉప కులాలకు చెందిన ఆడపడుచుల వయస్సు 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ప్రతి సంవత్సరం రూ. 15 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసాయం అందించేందుకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎన్నికల హామీల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నాం. వైయస్‌ఆర్ కాపు నేస్తం పథకం కోసం రూ. 1101 కోట్లు కేటాయించాం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీలకు కావాల్సిన సమాచారం మొత్తం కోడీకరించి అందించేందుకు, సూచనలు, సలహాలు చేసేందుకు అధికారుల బృందం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అటవీ, పర్యావరణ, ఆరోగ్య, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలల విద్యాభివృద్ధి బృందం, దీనికి ఆర్థిక ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు కూడా ఏర్పాటు చేయబడిన కేబినెట్ సబ్ కమిటీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. 2020 మార్చి 31 లోగా సీపీఎస్ రద్దుకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని సూచించాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ రిపోర్టు జూన్ 30వ తేదీ వరకు ఇవ్వాలని సూచించడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ ఏరియాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఆశావర్కర్లకు గతంలో రూ.400 వచ్చే వేతనాన్ని రూ. 4000 పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. రూ.14.46 కోట్లు కేటాయించడం జరిగింది. దీని ద్వారా సుమారు 2652 మందికి లబ్ధిచేకూరుతుంది. రాష్ట్రంలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయాలని, గతంలో ఉన్న ఆదాయ పరిమితులను పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు వచ్చే వారు అర్హులు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 12 వేలు సంపాదించే వారు అర్హులుగా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఫీజురియంబర్స్‌మెంట్ పథకానికి రూ.2.50 లక్షలు, ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు రూ.5 లక్షల వార్షిక ఆదాయం లోబడి ఉండాలి. కార్డులు అచ్చు వేయడానికి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ సివిల్ సప్లయ్ డిపార్టుమెంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సదన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని రెండుగా విభజించాలని, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా కొత్తగా ఏర్పాటు చేయాలని, దీనిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్ ఆమోదించింది. సీఎం వైయస్ జగన్ నవరత్నాల హామీల్లో భాగమైన రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు అనే పథకానికి కేబినెట్ ఆమోదం తెలుపుతూ వచ్చే ఏడాది ఉగాది నాటికి స్థలాలు ఇవ్వాలని, కులాలు, మతాలు, పార్టీలు ఏవీ చూడకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని, దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డిపార్టుమెంట్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తూ నియమ నిబంధనలను అన్ని పొందుపరుస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఏపీఐఐసీకి 50 ఎకరాల భూమిని కేటాయించాం. దీన్ని పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం ఈ భూమి వాడాలని కేటాయించడం జరిగింది. నడకుడి, శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం కోసం దక్షిణమధ్య రైల్వేకు 92.05 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ యాక్టులో సవరణలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడం కోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది. మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 డిసెంబర్ 26న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన కోసం జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లి, నందలూరు గ్రామాల మధ్య స్థలాన్ని గుర్తించి ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయాలని, దీని కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయడం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 3295 ఎకరాల భూమిని సేకరించాలని, అదే కాకుండా కడప స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ఇసుక ఖనిజం సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకోవడానికి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానెటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇంటర్ విద్యను కూడా చేర్చుతూ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోని సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయ శాఖ చట్టం సవరణ కోసం కేబినెట్ ఆమోదించింది. షెడ్యుల్ క్యాస్టు, షెడ్యుల్ తెగల కమిషన్‌ను రెండుగా విభజించి ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. Read Also: వికలాంగుడి పట్ల సీఎం వైయస్ జగన్ ఉదారత