ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారని చెప్పారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్‌లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.