విజయవాడ: వేసవి కాలం ఎండ నేపథ్యంలో ఈనెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడుస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచి ఒంటి పూటే బడులు నిర్వహించాలని మంత్రి సూచించారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సోమవారం(ఏప్రిల్ 3) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షలు 18వ తేదీ వరకు జరుగనున్నాయని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. టెన్త్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు మంత్రి వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుంది. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.