విజయవాడ : వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలనుకుంటారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కాకుండా బాధితులకు సాయం అందించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అన్నారు. మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైయస్ఆర్‌సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ శ్రీకారం చుట్టాం. నిత్యావసర సరుకులను ప్రతిఇంటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలకుంటారు. 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో ఆనాడు నేను మంత్రిగా ఉన్నా.. అప్పడు బుడమేరకు వదర వస్తే.. తగు జాగ్రత్తలు తీసుకున్నాం. పైనఉన్న బ్యారేజీలు(శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల)నుంచి కిందకి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. రేపల్లె సమీపంలో వరదలలో గండిపడితే నెల్లూరు కృష్ణపట్నం పోర్టు నుంచి 250 లారీలతో మట్టిని తెప్పించి పూడ్చాము. మా బాధ్యతగా అప్పడు మేము చేశాం. బుడమేరకు వరద వస్తుందని అధికారులకు ముందే తెలిసినా నిర్లక్ష్యంగా పట్టించుకోలేదని వారే మాట్లాడిన విషయాన్ని మనం వార్తల్లో చూశాం. వర్షాల విషయంలో వాతావరణ శాఖ ముందుగానే సూచించింది. ఈ ప్రభుత్వం వరదలపై ఎటువంటి మానిటరింగ్ చేయలేదు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వానికి అసలు ఆలోచననే లేదు. గత ప్రభుత్వం బురదజల్లె ప్రయత్నాలు చేస్తోంది. గతంలో వరదలు వచ్చిన సమయంలో అధికారులతో కలిసి ఇక్కడ తిరిగి సహాయక చర్యలు చేపట్టాం. అదృష్టవశాత్తు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ కట్టడంతో నగరానికి చాలా పెద్ద ముప్పు తప్పింది. విపత్తు విషయంలో ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి. ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కూడా బాధితులకు సాయం అందించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మూడు రోజులపాటు చాలా మందికి బాధితులకు నీరు, పాలు, ఆహారం లేదు. మేము ఆహారం, నీరు అందించేతవరకు ప్రభుత్వం స్పందించలేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితుల నష్టాన్ని ప్రభుత్వం పూడ్చాలని వైయస్ఆర్‌సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.