రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోం

అల్లర్లు సృష్టించి రాక్షసానందం పొందాలని చంద్రబాబు కుట్ర

బుద్ధా, బోండా 10 కార్లలో మాచర్లకు ఎందుకెళ్లారు

ఓవర్‌ స్పీడ్‌తో టీడీపీ నేతల కార్లు చిన్నారులపైకి దూసుకెళ్లాయి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది

అభివృద్ధి, సంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ చూస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ అలజడులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 కార్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్లకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పది కార్లలో ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లడంతో మాచర్లలో చిన్నారులపై కార్లు దూసుకెళ్లాయన్నారు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాక్షస ఆనందం పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ఇంకా ఏం మాట్లాడారంటే..
మాచర్లలో చిన్న పిల్లలకు ప్రమాదం జరిగితే.. దాన్ని పట్టుకొని చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పార్టీ అధ్యక్షుడిని అని మాట్లాడుతున్నాడు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ చావుకు ఎలా కారణం అయ్యాడో అందరికీ తెలుసు.. పదే పదే పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమైనా ఉంటే.. అతన్ని విడిచి ఆ పార్టీ నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి చంద్రబాబు అన్యాయాన్ని వివరించాడు. విశాఖలో పంచకర్ల రమేష్‌ చంద్రబాబు మోసాన్ని  వివరించాడు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరాడు.

ఈ రాష్ట్రం శాంతిభద్రతలకు ఆటంకం కలగాలి.. కొట్లాటలు, విధ్వంసాలు జరగాలని, తద్వారా రాక్షసానందం పొందాలని చంద్రబాబు చూస్తున్నాడు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోం.

ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు ఉండకూడదు.. వ్యవస్థలో మార్పు రావాలని చెప్పారు. దానికి తగ్గట్టుగా చట్టాలు చేశారు. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంటే.. నువ్వు చేసే కుట్రలు చూస్తు ప్రభుత్వం, పార్టీ ఊరుకోదు. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా.. దానికి పచ్చమీడియా మద్దతు పలికినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. జిల్లాల్లో శాంతిభద్రతలు ఏ విధంగా పరిరక్షిస్తున్నారో.. ఎన్నికలు శాంతియుతంగా జరగాలని ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఎందుకు బోండా ఉమా, బుద్ధా వెంకన్న ఇద్దరూ పది కార్లలో మాచర్లకు ఎందుకు వెళ్లారు. పార్టీ పరంగా పంపిస్తే రెండు కార్లు సరిపోతాయి కదా..? గుండాలతో దౌర్జన్యం చేయడానికి పది కార్లలో వెళ్తున్నారా..? శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదు. ముందు లా అండ్‌ ఆర్డర్‌ ముఖ్యం. మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారు.

గత ఐదేళ్లలో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. అయినప్పటికీ వాటిని సహించాం. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేదు. నీలాంటి దుష్టమైన పాలన రాకూడదని ప్రజలు కోరుకొని సీఎంగా వైయస్‌ జగన్‌కు అవకాశం ఇచ్చారు. ప్రజల ఆలోచన మేరకు సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికైనా రౌడీయిజాన్ని చంద్రబాబు కట్టిపెట్టాలి.

గత ఐదు సంవత్సరాల్లో మరో బిహార్‌గా తయారు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ నీతికబుర్లు చెబుతున్నాడు చంద్రబాబు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. శాంతియుతంగా ఎన్నికలు జరగాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. గ్రామ స్వరాజ్యం రావాలి. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక పరిపాలన రావాలని సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు.

చంద్రబాబు ఐదేళ్లకాలంలో విశాఖపట్నానికి మేయర్‌ ఎన్నికలు పెట్టలేకపోయాడు. ఏదిఏమైనా చంద్రబాబు భాషను, వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

చంద్రబాబుకు ప్రజలు ఎందుకు వేయాలి ఓటు. వందల కోట్లు ఖర్చు చేసి మంగళగిరిలో కొడుకును గెలిపించుకోలేకపోయాడు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు.

ప్రభుత్వం నవరత్నాలు అమలు చేస్తోంది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్, గృహాలు, రైతు భరోసా, వాహనమిత్ర, తెల్లవారు జామున 4 గంటలకే పెన్షన్, మత్స్యకారులకు భరోసా ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా కాదనుకుంటారా..? ప్రజలు తప్పకుండా వైయస్‌ఆర్‌ సీపీని ఆశీర్వదిస్తారు.

 

Back to Top