విజయవాడ: రామరాజ్య స్థాపనకు సీఎం వైయస్ జగన్ కృషిచేస్తున్నారని, కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారని చెప్పారు. టీడీపీ హయాంలో విజయవాడలో కూల్చిన 9 ఆలయాల నిర్మాణంతో పాటు, రూ.70 కోట్లతో దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ రేపు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. అందులో భాగంగానే కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు రేపటి సీఎం కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి పర్యవేక్షించారు.
సీఎం వైయస్ జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. మారుమూల గ్రామాల్లో.. జనసంచారం లేని సమయాల్లో.. అర్ధరాత్రులు ఆలయాలపై దాడులకు తెగబడుతూ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో 40 దేవాలయాలను కూల్చివేస్తే.. పవన్ కల్యాణ్ అప్పుడు నోరు ఎందుకు మెదపలేదని నిలదీశారు. రాజకీయ రాబందులకి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.