రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ ఏదీ?

తిరుపతి జిల్లాలో రోజుకో అఘాయిత్యం వెలుగులోకి వస్తోంది

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం 

బాధితురాలిని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌రామ‌ర్శించేందుకు అనుమ‌తించ‌ని పోలీసులు

తిరుపతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువైందని టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో రోజుకో అఘాయిత్యం వెలుగులోకి వస్తున్నాయన్నారు. మెటర్నిటి ఆసుపత్రి బాధితురాలిని పరామర్శించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై డిప్యూటి సీఎం పవన్‌ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు నడిపిన పల్సర్ వాహనంపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉంది. దీనిపై కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ద్వారా ఏరులై పారుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోండి. ప్రతిపక్షాల పార్టీలు పై విమర్శలు చేయడం మానుకోండి. శాంతి భద్రతలు కాపాడండి అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు.

 కాగా,  తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం చోటుచేసుకుంది. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. 

ఎప్పటిలా సోమవారం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. బాలిక పాఠశాలలో లేకపోవటంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతో లోనికి వెళ్లి చూశాడు. బాలిక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు. అక్కడే సపర్యలు చేసి ఏం జరిగిందని బాలికను ఆరా తీశాడు.

పొట్టపై తన్ని.. చాకుతో దాడి
పాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్‌ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. వెంటతెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో ఆమె పొట్టపై తన్నారు. ఆపై చాకుతో దాడిచేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. అనంతరం ఎవరికో వీడియో కాల్‌చేసి.. ఈ అమ్మాయేనా? కాదా? అని అడిగి తెలుసుకున్నారు. 

తరువాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. తండ్రిని సర్పంచ్‌ ఓబులేసు, వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగార్జునరెడ్డి కారులో తీసుకుని పోలీసు వాహనాన్ని వెంబడించారు.

కేసులో అనేక సందిగ్ధాలు: ఎస్పీ కార్యాలయం
యర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రచారం  ప్రచారం చేస్తున్నారని.. దీనిపై యర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.  విచారణలో అనేక సందిగ్ధాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. అయితే, విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఆ దుండగుల్ని ఉరి తీయాలి
బాలికపై చాకుతో దాడిచేసి.. మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేయాలని బాలిక తండ్రి కోరారు. నిందితులిద్దరినీ పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. అలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

దోషులను శిక్షించే వరకు వదలం: చెవిరెడ్డి
మైనర్‌ బాలికపై దారుణం జరిగిందన్న సమాచారం అందుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హుటాహుటిన యల్లమంద దళితవాడకు చేరుకున్నారు. అనంతరం బాలిక చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. దారుణ ఘటనకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 
 
 

Back to Top