రైతులకు రాష్ట్ర సర్కారు సంఘీభావం

కేంద్రంతో రైతు సంఘాల చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాం

రైతు సంఘాలు మధ్యాహ్నం ఒంటిగంటలోపు బంద్‌ పూర్తి చేయాలి

ఒంటి గంట తర్వాతే రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీస్‌లు తెరుచుకుంటాయ్‌

మధ్యాహ్నం దాకా ఆర్టీసీ బస్సుల నిలిపివేత.. విద్యా సంస్థలకు సెలవు

బాబువి దిగజారుడు రాజకీయాలు 

రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు

అమరావతి: రైతు సంఘాలు మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోంది. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలకు, కేంద్రానికి మధ్య జరుగుతున్న చర్చలు జయప్రదం కావాలని ఆకాంక్షించింది. కనీస మద్దతు ధర విషయంలో రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళనకు తగిన పరిష్కారం లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ ఆందోళనలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన బంద్‌ విషయంలో వారి మనోభావాలను గౌరవిస్తున్నామని అందులో పేర్కొన్నారు. రైతు సంఘాలు హింసాత్మక చర్యలకు తావివ్వకుండా మధ్యాహ్నం ఒంటి గంటలోపు బంద్‌ను ముగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో రైతులకు సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం ఒంటిగంట తరవాత తెరవాలని ఆదేశిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. బస్సు సర్వీసులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడపవద్దని ఆర్టీసీని ఆదేశించామన్నారు. విద్యాసంస్థలు మూసివేయాలన్నారు. బంద్‌ పూర్తిగా స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే పార్టీగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రకటన చేస్తున్నామని కన్నబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు మరో యూటర్న్‌..
వ్యవసాయ బిల్లుల విషయంలో చంద్రబాబు వైఖరిపై కన్నబాబు మండిపడ్డారు. కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు చంద్రబాబు పార్టీ బేషరతుగా, గట్టిగా పార్లమెంటులో మద్దతు పలికిన విషయం ప్రజలు గ్రహించాలని కోరారు. అదే సమయంలో కనీస మద్దతు ధరకు పూర్తి భరోసా ఇస్తున్నామని, రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగదన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలోనే వైయ‌స్సార్‌సీపీ ఈ బిల్లులకు షరతులతో కూడిన మద్దతు పలికిందన్న సంగతి తెలిసిందేనన్నారు.

బిల్లుకు పార్లమెంటులో బేషరతుగా మద్దతు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపనలు ఇవ్వాలని నిర్ణయించడం ఎంతటి దిగజారుడు రాజకీయమో కనిపిస్తోందన్నారు. వ్యవసాయ చట్టాల అంశంలో కలెక్టర్లకు ఏం పాత్ర ఉంటుందని ప్రశ్నించారు. ‘‘వ్యవసాయ బిల్లులు సెప్టెంబర్‌లో ఆమోదం పొందితే నవంబర్‌ వరకు కనీసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయలేదు. ఇవాళ కూడా ఢిల్లీ వెళ్లి గతంలో మాదిరిగా ఓ ధర్నా చేస్తానని ప్రకటించడం లేదు. మరెందుకు ఈ డ్రామాలు?’’ అని మంత్రి క‌న్న‌బాబు నిలదీశారు.  

Back to Top