ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిజానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. పరిపాలనా పరమైన నిర్ణయాలను తీసుకోవడానికి చాలా పరిమితులు ఉంటాయి. కానీ వీలైనంతగా రాష్ట్రాన్ని నాశనం చేసే వెళ్లాలన్నిది చంద్రబాబు ప్లాన్. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేయాలని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారు. అప్పుగా తెచ్చిన సొమ్మును విచ్చలవిడిగా ప్రకటనలు, ప్రచారాలకూ వాడేయాలన్నది దీని వెనకున్న అసలు ఉద్దేశ్యం అంటున్నారు తెదేపా నేతలు. ఐదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు చంద్రబాబు. కేవలం వాటి నిర్మాణ ఖర్చులు పెంచడం, బదులుగా కాంట్రాక్టర్ల నుంచి భారీ ముడుపులు పుచ్చుకోవడంలోనే బాబుగారు బిజీ అయిపోయారు. పట్టిసీమలో కమీషన్ల వరద పారించారు. అది తప్ప మరో ప్రాజెక్టు ఏదీ ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ వాటిని తనఖా పెట్టి ప్రైవేటు సంస్థల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధం అయ్యిపోయారు. గతంలోనూ బాండ్ల పేరుతో 2,000 కోట్ల అప్పు చేసింది టీడీపీ ప్రభుత్వం. అదే పద్ధతిలో అత్యధిక వడ్డీకి ప్రైవేటు సంస్థల నుంచి రుణాలు పొందేందుకు సర్వ సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి బాంకుల నుంచి, ప్రాజెక్టులు అడ్డుపెట్టి సంస్థల నుండి అప్పులు పుట్టిస్తున్న చంద్రబాబు ఈ భారాన్నంతా ఏపీ ఖజానామీద అంటే తెలుగు ప్రజల మీద మోపబోతున్నాడన్నమాట. ప్రాజెక్టుల మీద ఐదేళ్లుగా రాని అక్కర బాబుకు ఎన్నికలు 10 రోజుల్లో ఉండగా ఎందుకు వచ్చింది? ఈ పది రోజుల్లో ఎన్ని ప్రాజెక్టును పూర్తి చేసేయాలని 5,545 కోట్ల భారీ రుణానికి చంద్రబాబు అనుమతి ఇచ్చాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇరిగేషన్ అధికారులు... విజయవాడలో ఉన్న ఆర్.ఈ.సీ లిమిటెడ్ 10.75% వడ్డీతో ఇస్తున్న ఈ రుణానికి ప్రభుత్వమే పూచికత్తు ఇస్తోంది. ఇందుకోసం చంద్రబాబు తాజాగా జీవో కూడా జారీ చేసాడు. మరో 10,000 కోట్ల రూపాయిల రుణాల కోసం వాణిజ్య బ్యాంకులు, సంస్థల నుంచి రుణసేకరణకు పచ్చ జెండా ఊపాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మునుపటి 9 ఏళ్ల పాలనలోనూ ఇలాగే ప్రపంచ బ్యాంకు నుంచి, ఇతర దేశాలనుంచి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చాడు చంద్రబాబు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ ఆ అప్పులన్నిటినీ తీర్చి, రాష్ట్రాన్ని అప్పుల నుంచి విముక్తి చేసారు. ఇప్పుడూ అదే పద్ధతిలో రాబోయే ప్రభుత్వానికి అప్పుల కుప్పలాంటి రాష్ట్రాన్ని అప్పజెప్పి, సమస్యల పాలు చేయాలని చంద్రబాబు ఇలాంటి కుట్రకు తెరతీసాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు.