అగ్రిగోల్డ్‌ బాధితులకు సాయం వెంటనే అందాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 1150 కోట్ల పంపిణీతో పాటు అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనం వేగంగా జరగాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. మంగళవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా పలువురు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన 1150 కోట్ల రూపాయలు త్వరితగతిన బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.

అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అదే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా  అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేలా సీఎం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బినామీలుగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఉందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top