హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలా..?

చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజం

శ్రీకాకుళం: కరోనా వైరస్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. సాగునీటి ప్రాజెక్టుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ అనుమతులు, నిధులు ఇవ్వడం హర్షణీయమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తయింది. మదనాపురం, అన్నంపేట, వెన్నెలవలస, తాళపత్రి, నందివాడలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అనుమతులు వచ్చాయి. రూ.22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నాం. దీంతో 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

గత చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ప్రభుత్వ అక్రమాల వల్ల ఎత్తిపోతల పథకాలు డిజైన్లు మార్చడం, నష్టపరిహారం చెల్లింపులు వివాదాస్పదం అయ్యాయి. నీరు – చెట్టు పనుల్లో అక్రమాల వల్ల సాగునీటి వనరులు నిరుపయోగంగా మారాయి. నారాయణపురం ఆనకట్ట వద్ద బ్యారేజీ కమ్‌ రిజర్వాయర్‌ నిర్మించి ఆయకట్టు స్థిరీకరణ చేయాలి. 

చంద్రబాబు హైదరాబాద్‌ కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు అత్యంత ఉన్నతమైన వైద్యం అందించాం. కరోనా కష్టకాలంలో ప్రజలను టీడీపీ పట్టించుకోలేదు. చంద్రబాబు తన మైండ్‌ను పాజిటివ్‌గా మార్చుకోవాలి. ముసుగు తీసి రావాలి. గత ప్రమాదాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుందో తెలుసుకొని అభినందించాలి’ అని తమ్మినేని అన్నారు. 
 

Back to Top