అమరావతి: ఆరోగ్యశ్రీకి ఊపిరిపోస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు, సుజాతరావు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరోగ్య రంగ సంస్కరణలపై నిపుణుల కమిటీ సిఫారస్సులు అందజేసింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాలని, ఆ మేరకు డాక్టర్ల జీతాలు పెంచాలన్న నిపుణుల కమిటీ పేర్కొంది. దీన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంగీకరించారు. ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. – హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు – నవంబర్ 1 నుంచి ప్రారంభం, డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల జారీ ప్రారంభం. – ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా మరికొన్ని వ్యాధులు. – జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కింద అమలు. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు అమలు. 12 వందల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ మిగిలిన జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు. – రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. 2020 ఏప్రిల్ 1 నుంచి జిల్లాల వారీగా అమలు. – ఆపరేషన్ చేయించుకున్నవారు కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేల చొప్పున సాయం. – తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు రూ. 10 వేల పెన్షన్‌ను ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం. – దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరి కిందకు తీసుకొచ్చి నెలకు రూ. 5 వేలు ఇవ్వాలన్న సీఎం వైయస్ జగన్. దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలని సీఎం ఆదేశం.