మ‌హిళ‌లకు ఇచ్చిన మాట ప్ర‌కారం..వైయ‌స్ఆర్ ఆస‌రా

సెప్టెంబర్‌ 11న వైయ‌స్సార్ ఆసరా పథకానికి  ముహూర్తం ఖరారు 

నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్‌ ఆమోదం

సెప్టెంబర్‌ 1న వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ పథకం

సెప్టెంబర్‌ 5న వైయ‌స్సార్ విద్యాకానుక పథకం

కేబినెట్ భేటీ వివ‌రాల‌ను వెల్ల‌డించిన మంత్రి పేర్ని నాని

అమ‌రావ‌తి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో స్వ‌య స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కానికి శ్రీ‌కారం చుడుతున్న‌ట్లు మంత్రి పేర్నినాని పేర్కొన్నారు.నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైయ‌స్సార్‌ ఆసరా పథకం ప్రారంభించనున్నామ‌ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం వైయ‌స్ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వైయ‌స్ఆర్ ఆస‌రా ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.  నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌ 1న వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్‌ 5న వైయ‌స్సార్ విద్యాకానుక పథకం, సెప్టెంబర్‌ 11న వైయ‌స్సార్ ఆసరా పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు. కేబినెట్‌లో చ‌ర్చించిన  వివ‌రాల‌ను మంత్రి పేర్ని నాని మీడియాకు వివ‌రించారు.

నాలుగు విడ‌త‌ల్లో జ‌మ‌..

ఎన్నిక‌ల ముందు పాద‌యాత్ర‌లో సీఎం ఇచ్చిన మాట మేర‌కు వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థకాన్ని ఏర్పాటు చేసి ఆ ప‌థ‌కం ద్వారా 2019 ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఉన్న‌టువంటి స‌క్ర‌మంగా అప్పులు చెల్లించే గ్రూపుల‌కు ఆరోజు ఎంత అయితే గ్రూపు మొత్తానికి లోన్ ఉందో.. ఆ లోన్ మొత్తాన్ని నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా అక్క‌చెల్లెమ్మ‌ల అ‌కౌంట్ల‌లో జ‌మ చేస్తామ‌ని సీఎం చెప్పిన మాట మేర‌కు వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం తీసుకురాబ‌డింది. దీని ద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా మ‌హిళా సంఘాల‌కు ల‌బ్ధి చేకూర‌బోతుంది. 2020-21 సంవ‌త్స‌రంలో ప‌థ‌కం ప్రారంభించే మొద‌టి సంవ‌త్స‌రానికి రూ.6792 కోట్ల మేర డ్వాక్రా అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ల‌బ్ధి చేకూర‌బోతోంది. వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థకం మొత్తానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌డానికి నిర్ణ‌యించిన మొత్తం రూ.27,168.83 కోట్లుగా అంచనా వేయ‌బ‌డింది. డ్వాక్రా అక్క‌చెల్లెమ్మ‌లు ఆర్థికంగా గ్రూపుల‌ను ప‌రిపుష్టి చేయ‌డం ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తాయ‌నే విశ్వాసంతో సీఎం ఈ కార్యక్ర‌మాన్ని చేప‌డుతున్నారు.

 
కొత్త‌గా 51 డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టులు..

పంచాయ‌తీ రాజ్ డిపార్టుమెంట్‌లో మండ‌ల అభివృద్ధి అధికారులను అనే పోస్టు ఉంది. వారంద‌రిదీ ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితి. గ్రూపు -1 కేట‌గిరిలో ఎంపికై కూడా అదే పోస్టులో రిటైర్ అవుతున్నారు. గ‌డిచిన ప్ర‌భుత్వంలో ఆ ముఖ్య‌మంత్రి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ద‌గ్గ‌రికి ఎన్నో సార్లు తిరిగి విసిగిపోయారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎండీఓల‌తో స‌న్మానాలు కూడా చేయించుకున్నారు. కానీ, వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేదు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎండీఓల నుంచి ఒక ద‌ర‌ఖాస్తు రాగానే.. రెవెన్యూ డివిజ‌న‌ల్ ప‌రిధిలో (సుమారు 10-12 మండ‌లాలు ఉండే ప్రాంతం) 51 డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టులు కొత్త‌గా ఏర్పాటు చేస్తూ మంత్రి మండ‌లి తీర్మానం చేయ‌డం జ‌రిగింది.

ఆత్మ‌స్థైర్యంతో చ‌దువుకోవ‌డానికి జ‌గ‌న‌న్న విద్యా కానుక‌..

జ‌గ‌న‌న్న విద్యా కానుక ప‌థ‌కం ద్వారా క్వాలిటీతో కూడిన‌ యూనిఫామ్స్‌, పాఠ్య‌పుస్త‌కాల‌తో పాటు నోట్‌బుక్స్ కూడా అందించాల‌ని, బూట్లు, సాక్స్‌, బెల్టు, బ్యాగ్‌, మూడు జ‌త‌ల యూనిఫాం ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారు. కేవ‌లం పాఠ్య‌పుస్త‌కాలు మాత్ర‌మే ఇచ్చేవారు.. మొట్ట‌మొద‌టి సారిగా నోట్‌బుక్స్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. పిల్ల‌ల‌కు యూనిఫామ్స్ ఇవ్వ‌డం ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దివే పేద పిల్ల‌లు కాన్వెంట్‌ల‌తో పాటుగా ఆత్మ‌స్థైర్యంతో చ‌దువుకోవ‌డానికి అంద‌జేస్తున్నాం. డ‌బ్బున్న పిల్ల‌ల మాదిరిగానే మంచిగా యూనిఫాం, షూ, బెల్టు వేసుకొని స్కూల్‌కు వెళ్తున్నామ‌ని భావ‌న క‌ల‌గ‌డం కోసం అంద‌జేస్తున్నాం. 42,34,322 మందికి అని అంచ‌నా వేశాం. ప‌దో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు కూడా యూనిఫామ్స్ అంద‌జేస్తాం. జ‌గ‌న‌న్న విద్యా కానుక ప‌థ‌కాన్ని సెప్టెంబ‌ర్ 5న ప్రారంభిస్తాం.

రూ.1,863 కోట్ల‌తో సంపూర్ణ పోష‌ణ‌..

గ‌ర్భిణీ స్త్రీ, బాలింత‌లు, చిన్న పిల్ల‌ల‌కు వైయ‌స్ఆర్ సంపూర్ణ పోష‌ణ ప‌థకాన్ని సెప్టెంబ‌ర్ 1న ప్రారంభించనున్నాం. దీని ద్వారా సుమారు 30 ల‌క్ష‌ల మంది త‌ల్లులు, పిల్ల‌ల‌కు మేలు చేకూర‌నుంది. ఇది కాకుండా ఇంకా పోష‌క ప‌దార్థాలు, విట‌మిన్లు క‌లిపి 77 ట్రైబ‌ల్ మండ‌లాల్లో వైయ‌స్ఆర్ సంపూర్ణ ప్ల‌స్ అనే ప‌థ‌కం ద్వారా పౌష్టికాహారం అంద‌జేయ‌నున్నాం. 2018-19 సంవ‌త్స‌రంలో సంపూర్ణ పోష‌ణ అందించే ప‌థ‌కానికి రూ.762 కోట్లు ఖ‌ర్చు అయితే.. 2020-21 వైయ‌స్ఆర్ సంపూర్ణ పోష‌ణ ప‌థ‌కం అమ‌లు చేయ‌డం ద్వారా రూ.1,863 కోట్ల‌తో అమ‌లు చేస్తున్నాం.

 రాష్ట్ర‌మంతా ఇంటింటికి నాణ్య‌మైన బియ్యం..

ఎన్నిక‌ల ముందు ఇంటింటికి నాణ్య‌మైన బియ్యం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. పాద‌యాత్ర‌లో పేద‌ల ద్వారా బాధ‌లు విన్నారు. ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పేద‌ల‌కు నాణ్య‌మైన బియ్యం ఇవ్వాల‌నే త‌లంపుతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుగా శ్రీ‌కాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేప‌ట్టారు. డిసెంబ‌ర్ 1 నుంచి రాష్ట్రం అంతా ప్రారంభించ‌డానికి నిర్ణ‌యించడం జ‌రిగింది. సార్టెక్స్ విధానం ద్వారా మ‌ట్టి, రాళ్లు లేకుండా, 15 శాతం మించి నూక ఉండ‌కుండా నాణ్య‌మైన బియ్యాన్ని సార్టెక్స్ ద్వారా సేక‌రించ‌డం కోసం మామూలుగా జ‌రిగే ప‌థ‌కానికి అద‌నంగా రూ.480 కోట్లు వెచ్చించాల‌ని, అలాగే ఇంటింటికీ డిజిట‌ల్ కాటా ద్వారా బియ్యాన్ని ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని డిసెంబ‌ర్ 1 నుంచి ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. పంపిణీ కోసం 9,260 వాహ‌నాల ద్వారారాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల‌కు సంబంధించిన డ్రైవింగ్ వ‌చ్చి లైసెన్స్ ఉండి నిరుద్యోగులుగా ఉన్న యువ‌త‌ను ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక చేయ‌నున్నాం. నిరుద్యోగుల కాంట్రిబ్యూష‌న్ 10 శాతం, ప్ర‌భుత్వ‌హామీ ఉన్న బ్యాంకుల ద్వారా 30 శాతం లోన్‌, స‌బ్సిడీ 60 శాతం అందించ‌నున్నాం.  ప్ర‌భుత్వ‌మే హామీ ఉండ‌డం ద్వారా సివిల్ స‌ప్ల‌య్ డిపార్టుమెంట్ ద్వారా బ్యాంకు లోన్ చెల్లించ‌డం, ఆరు సంవ‌త్స‌రాల్లో రుణం చెల్లించ‌డం ద్వారా ఆ వాహ‌నం నిరుద్యోగ యువ‌తకు సొంతం అవుతుంది. నెల‌వారీగా ఇంటి పోష‌ణ కోసం డ‌బ్బులు మిగిలే అవ‌కాశం ఉంటుంది. 9,260 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగుల‌ను ఎంచుకొని ఈ కార్య‌క్ర‌మాన్ని డిసెంబ‌ర్ 1న ప్రారంభించ‌నున్నాం.

వైయ‌స్ఆర్ బీమా

గ‌తంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎల్ఐసీని నోడ‌ల్ ఏజెన్సీగా ఉంచి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేవి. దాంట్లో కేంద్ర ప్ర‌భుత్వం రూ.396 కోట్లు చెల్లిస్తే.. మ‌రో రూ.396  కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రీమియంగా చెల్లించేది. కానీ, 2019 సంవ‌త్స‌రంలో ఆ ప‌థ‌కాన్ని మేము ర‌ద్దు చేస్తున్నామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. కేంద్రం బీమా ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసిన‌ప్ప‌టికీ మ‌న‌మే సొంతంగా బీమా ప‌థకాన్ని న‌డ‌పాలి.. పేద‌వాడికి ప్ర‌మాదం జ‌రిగి మ‌ర‌ణిస్తే.. ఆ కుటుంబానికి ఆర్థిక ఆస‌రా లేక‌పోతే రోడ్డున ప‌డ‌తార‌ని న‌మ్మిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌. అందుక‌ని రూ.583  కోట్ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1.50 కోట్ల బియ్యం కార్డుదారులకు ఈ వైయ‌స్ఆర్ బీమా ప‌థ‌కం వ‌ర్తింప‌జేయాల‌ని కేబినెట్ ఆమోదించింది.

 • చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ఏర్పాటు చేయాల్సిన ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌కు 26 టీచింగ్‌, 14 నాన్ టీచింగ్ పోస్టుల‌కు, అదే విధంగా వైయ‌స్ఆర్ జిల్లా వేంప‌ల్లె ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్‌, 8 నాన్‌టీచింగ్ పోస్టుల‌ను కేబినెట్ ఆమోదించింది.
 • విశాఖ జిల్లా దిగువసీలేరు జ‌ల‌విద్యుత్ కేంద్రంలో అద‌నంగా మ‌రొక 115 మెగావాట్ల రెండు యూనిట్ల‌ను జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తికి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సుమారు రూ.510 కోట్ల వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది.
 • రాయ‌చోటిలో కొత్త పోలీస్ స‌బ్ డివిజ‌న్ ఏర్పాటుకు మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది. పులివెందుల స‌బ్ డివిజ‌న్ నుంచి రాయ‌చోటి శివారు గ్రామాలు 120 కిలోమీట‌ర్లు ఉండ‌డంతో.. రాయ‌చోటి జ‌నాభా పెరిగిన నేప‌థ్యంలో కొత్త స‌బ్ డివిజ‌న్ ఏర్పాటుకు నిర్ణ‌యం చేయ‌డం జ‌రిగింది. అలాగే రాయ‌చోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ఏర్పాటుకు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.
 • వైయ‌స్ఆర్ జిల్లాకు కొత్త‌గా 76 హోంగార్డు పోస్టుల‌ను మంజూరు చేస్తూ మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. అలాగే గ‌త వారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌క‌టించిన నూత‌న పారిశ్రామిక విధానం 2020-23కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 • కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కంలోని బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించ‌బోతోంది. దానిలో కేంద్రం ప్ర‌క‌టించిన ఒక పార్కు మ‌న రాష్ట్రం పొందేలా ఏపీ బ‌ల్క్ డ్ర‌గ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అనే కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి కేంద్రం సూచిక‌ల‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేసి త‌ద్వారా బ‌ల్క్ డ్ర‌గ్ పార్కును ఏపీలో నెల‌కొల్పేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని ఏపీఐఐసీకి అధికారం ఇస్తూ మంత్రి మండ‌లి తీర్మానం చేయ‌డం జ‌రిగింది.
 • వైయ‌స్ఆర్ జిల్లా కొప‌ర్తిలో కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఎల‌క్ట్రానిక్ మ్యానిఫ్యాక్చ‌రింగ్ క్ల‌స్ట‌ర్ను ఏర్పాటు చేసేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెల‌ప‌డం జ‌రిగింది. వైయ‌స్ఆర్ జిల్లాలో ఎల‌క్ట్రానిక్ పార్కు ఏర్పాటు చేయ‌డంతో రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని, సుమారు ల‌క్ష మందికి ఉపాధి వ‌స్తుంద‌నే అంచ‌నాతో క్ల‌స్ట‌ర్ల ఏర్పాటు కోసం దాదాపు రూ.730 కోట్లు ఖ‌ర్చు చేసే ల‌క్ష్యంతో ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు అనుమ‌తులు మంజూరు చేయ‌డం జ‌రిగింది.
 • అలాగే బావ‌న‌పాడులో పోర్టు నిర్మాణం కోసం రైట్స్ సంస్థ త‌యారు చేసిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అంచ‌నాల‌ను ఫేజ్‌-1 కింద రూ. 3,670 కోట్ల‌తో ఇచ్చిన డీపీఆర్‌ను మంత్రిమండ‌లి ఆమోదించింది.
 • అలాగే దేశంలో ఆక్వా ప‌రిశ్ర‌మ‌లో విత్త‌న త‌యారీ కేంద్రాలు సుమారుగా 550 ఉంటే 389 మ‌న రాష్ట్రంలో ఉన్నాయి. మ‌త్స్య ప‌రిశ్ర‌మ విత్త‌న ఉత్ప‌త్తి కేంద్రాలు రైతుల‌ను విప‌రీతంగా ఇబ్బందులు పెడుతున్నాయి, మోసం చేస్తున్నాయ‌ని గ్ర‌హించి ఆక్వా రైతులు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆక్వా క‌ల్చ‌ర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్‌ను స‌వ‌రించ‌డం జ‌రిగింది. రైతుల ర‌క్ష‌ణ కోసం ఈ చ‌ట్టం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.
 • రాష్ట్రంలోని సీజ‌న‌ల్ కండీష‌న్స్ ఎలా ఉన్నాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ రాష్ట్ర మంత్రిమండ‌లికి నివేదించ‌డం జ‌రిగింది. 01-06-2020 నుంచి 18-8-2020 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్ష‌పాత న‌మోదు సంతృప్తిక‌రంగా ఉంది. ఒక్క శ్రీ‌కాకుళం జిల్లాలో మాత్ర‌మే సాదార‌నం కంటే త‌క్కువ‌గా న‌మోదైంది. 27 శాతం త‌క్కువ‌గా న‌మోదైంది. విజ‌య‌న‌గ‌రం, విశాఖ జిల్లాల్లో సాదార‌ణ స్థితిలో వ‌ర్ష‌పాతం న‌మోదైతే.. తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఎక్సెస్ రైన్‌ఫాల్ న‌మోదైంది. క్రింద‌టిసారి కంటే వ్య‌వ‌సాయ సాగు 101 శాతం అద‌నంగా న‌మోదైన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ తెలిపింది.
 • రైతుల‌కు నూత‌నంగా ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా కేంద్రాల్లో రైతుల‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌తీ అంశం అందులో ల‌భ్య‌మ‌య్యేట్లుగా తీసుకున్న నిర్ణ‌యం ఆధారంగా మొత్తం 1,37,068 ఎరువుల కోసం బుకింగ్స్ జ‌రిగాయి. వీటిలో 1,34,927 ఆర్డ‌ర్స్ డెలివ‌రీ చేయ‌డం జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్య‌వ‌సాయ సాగుకు, రైతుకు అవ‌స‌ర‌మ‌య్యే ప్ర‌తీది ల‌భ్య‌మ‌య్యేలా స్టోర్ చేయ‌డం జ‌రిగింది.
 • అలాగే వ్య‌వ‌సాయం యంత్రాలు చిన్న రైతులు కొనుగోలు చేయ‌డానికి ఇబ్బందులు ప‌డ‌తారు కాబ‌ట్టి ప్ర‌భుత్వ‌మే ప్రైమ‌రీ అగ్రిక‌ల్చ‌ర్ సొసైటీల ద్వారా , ట్యాక్స్ ద్వారా, ఆర్బీకేల ద్వారా యంత్రాలు కొనుగోలు చేసి చిన్న రైతుల‌కు అద్దెకు ఇచ్చేందుకు కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. త్వ‌ర‌లో కార్యరూపం దాల్చ‌నుంది. అలాగే వ్య‌వ‌సాయానికి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు రైతాంగానికి రూ.26,872 కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా అందించ‌డం జ‌రిగింది. 2019 సంవ‌త్స‌రంలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు రూ.26,636 కోట్లు ఉంటే ఈ సంవ‌త్స‌రం రూ.26,872 కోట్ల రుణాలు అందించ‌డం జ‌రిగింది.
 • మొద‌టి సారిగా పొగా పంట‌కు మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ కింద రూ.60 కోట్లు వెచ్చించి ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా జ‌రగ‌ని విధంగా పొగాకు రైతుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ ఆదుకుంది. అలాగే ఈ సంవ‌త్స‌రం రూ.3300 కోట్ల‌తో మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ కింద రైతుల‌కు ఎక్క‌డ‌, ఏ పంట‌కు న‌ష్టం వ‌చ్చిందో.. ఆ రైతుల‌కు అండ‌గా నిలిచింది.  
 •  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top