ఏలూరు: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఆయనపై కేసు నమోదు అయ్యింది. స్కిల్ స్కాంపై సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. స్పీకర్ తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని హెచ్చరించారు. ప్రతీ సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. శాసనసభ్యులు సభా సంప్రదాయాలను ఉల్లఘించి సమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నారు. స్పీకర్ పోడియంపైకి రావడం.. గేలి చేయడం ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను శాసనసభలో ఉన్నాను అని, బాధ్యతగా వ్యవహరించాలనే స్పృహ సభ్యులకు ఉండాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో సభలో చర్చించేందుకు సమయం ఇచ్చాం. కానీ, టీడీపీ సభ్యులు ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. ప్లకార్డులు ప్రదర్శించడం, విజిల్స్ వేయడం, సభలో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే భావన ఉంటే.. శాసనసభలో ఉండి పోరాడాలి. చంద్రబాబును, టీడీపీ సభ్యులను సభ నుంచి ఎవరూ పొమ్మనలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.