తండ్రికి తగ్గ వారసుడు.. మంత్రి గౌతమ్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం

 అమ‌రావ‌తి:  మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. అనంతరం 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావు పేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు.  గౌతమ్‌రెడ్డి బాబాయ్‌ చంద్రశేఖర్‌రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా 2004, 2009, 2012ల్లో ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 

ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) సోమవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఉదయం  హైదరాబాద్‌లోని ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్‌ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు.  మేకపాటి గౌతమ్‌రెడ్డి అకస్మిక మరణంపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని హైదరాబాద్‌ బయల్దేరారు.

గౌతమ్‌రెడ్డి ప్రస్థానం
► 1971 నవంబర్‌ 2న  జననం.
► తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌రెడ్డి- మణిమంజరి
► గౌతమ్‌ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి.
► 1994-1997లో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు. 
► భార్య: మేకపాటి శ్రీకీర్తి
► పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు
► మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు.
► మొదటిసారి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.
►  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి రెండోసారి గెలుపొందారు.
► ప్రస్తుతం సీఎం వైయ‌స్ జగన్‌ కేబినెట్‌లో పరిశ్రమలు,ఐటీశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Back to Top