పోలవరంలో మరో కీలక అంకం పూర్తి

సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో వడివడిగా నిర్మాణ పనులు

స్పిల్‌ వేకు 192 గడ్డర్లను అమర్చిన నిర్మాణ సంస్థ

ఒక్కోగడ్డర్‌ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు 

192 గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగం 

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేలో మరో ప్రధాన అంకం పూర్తయింది. ప్రాజెక్టు స్పిల్‌ వేకు గడ్డర్ల అమరికను నిర్మాణ సంస్థ పూర్తిచేసింది.Sప్రపంచంలోనే భారీ స్పిల్‌ వే నిర్మాణంతో పాటు అదే స్థాయిలో భారీ గడ్డర్ల వినియోగించారు. 60 రోజుల్లోనే 192 గడ్డర్లను అమర్చారు. పోలవరం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

స్పిల్‌ వే బ్రిడ్జి నిర్మాణంలో గడ్డర్లు కీలకం. స్పిల్‌ వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్ల వినియోగిస్తున్నారు. స్పిల్‌వేపై గడ్డర్లు, షట్టరింగ్‌ పనులతో స్లాబ్‌ నిర్మాణం పూర్తవుతుంది. ఒక్కోగడ్డర్‌ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఒక గడ్డర్‌ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ ఉపయోగిస్తారు. పోలవరం స్పిల్‌వేలో ఉపయోగించిన ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు ఉంటుందని నిర్మాణ సంస్థ ‘మేఘా’ తెలిపింది. మొత్తం 192 గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ ఉపయోగించారు. 

గతేడాది ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థl‘మేఘా’.. జూలై 6న గడ్డర్లను స్పిల్‌వే పిల్లర్లకు అమర్చడం ప్రారంభించింది. నిన్నటి వరకు (2021 ఫిబ్రవరి 20) నాటికి 192 గడ్డర్లను స్పిల్‌ వే పిల్లర్లకు అమర్చారు. నీటి పారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ సంయుక్తంగా  పక్కా ప్రణాళికతో వరదలకు ముందే స్పిల్‌ వే పిల్లర్లపై గడ్డర్ల అమర్చారు. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్లను వినియోగించారు. 
 

Back to Top