వైయస్ఆర్ జిల్లా: వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి వారు), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ, ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.