నేడు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రకటన 

175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలను వెల్లడించనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

ఇడుపులపాయలో దివంగత సీఎం వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రకటన 

మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో  

18 నుంచి ప్రచారం ప్రారంభించే చాన్స్‌

వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్‌ షోలు  

అమరావతి: వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ శనివారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రచార భేరి మోగించనున్నారు.

ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైయ‌స్ఆర్‌సీపీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులేస్తోంది. 

Back to Top