అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ గాలికి అధికార టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కొట్టుకుపోతున్నాయి. గురువారం మొదలైన కౌంటింగ్‌లో వైయస్ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యతవైపు అడుగులేస్తోంది. 150కి పైగా ఎమ్మెల్యే, అన్ని ఎంపీ స్థానాల్లో (25) ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్, రాష్ట్ర కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వైయస్ఆర్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ విజయంవైపు అడుగులేస్తుండటంతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకుంటున్నారు. డప్పుచప్పుళ్లతో, నృత్యాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ‘ఇది ప్రజాతీర్పు.. బాయ్‌బాయ్ బాబు’ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్.. జై జగన్ అంటూ నినదిస్తున్నారు. ఇక ఆస్థాన సర్వేచిలక లంగడపాటి రాజగోపాల్ పలికిన పలుకులతో ధీమాగా ఉన్న టీడీపీ క్యాడర్.. ఫలితాలు చూసి కంగుతిన్నది. ఎప్పుడూ హడావుడిగా ఉండే టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసం బోసిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చుతుండటంతో టీడీపీ నాయకుడు, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు కౌంటింగ్ హాలునుంచి బయటకు వెళ్లిపోయారు.