చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతోనే అనంత‌పురంలో అరాచకాలు

దండుపాలెం ముఠాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 

ఖాళీ స్థ‌లం క‌నిపిస్తే క‌బ్జా..క‌మీష‌న్లు ఇవ్వ‌క‌పోతే దాడులు

అనంత‌పురం న‌గ‌ర ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఫైర్‌

వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియా సమావేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలకు కేంద్రంగా మారిన అనంతపురం నగరం  

ఇల్లు కట్టాలన్నా, షోరూం పెట్టాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ తప్పనిసరి అన్నట్టు పరిస్థితులు  

ఖాళీ భూమి కనిపిస్తే చాలు… గద్దల్లా వాలిపోతున్న ఆలిబాబా ముఠా  

టీడీపీ నేతలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?

ప్ర‌శ్నించిన వారిపై దాడులు జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు   

ముఖ్య నేత‌ల‌కు ముడుపులు పంపిస్తున్నామని బహిరంగంగా చెప్పుకుంటూ దౌర్జన్యాలు

ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుందా?  

సీఎం, డీఐజీ, ఎస్పీల‌కు అనంత వెంక‌ట్రామిరెడ్డి సూటి ప్ర‌శ్న‌

పాలెగాళ్లుగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త…

అనంతపురంలో మళ్లీ ప్రశాంతత తీసుకొస్తాం

అనంత వెంకట్రామిరెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఆశీస్సులతోనే అనంతపురం నగరంలో అరాచకాలు కొన‌సాగుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ దండుపాలెం ముఠాను ఏర్పాటు చేసుకొని నగరమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడం, కమీషన్లు ఇవ్వకపోతే దాడులకు పాల్పడటం నిత్యకృత్యంగా మారిందన్నారు. సినిమా థియేటర్లు, షోరూంలు, వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండటం వెనుక రాజకీయ ఒత్తిడే కారణమని ధ్వ‌జ‌మెత్తారు. అనంతపురంలో ఇలాంటి అరాచకాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని నగరంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్ర‌వారం అనంపురం జిల్లా పార్టీ కార్యాల‌యంలో అనంత వెంక‌ట్రామిరెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో అనంత వెంక‌ట్రామిరెడ్డి ఏమ‌న్నారంటే..

అనంతపురం కాదు… దండుపాలెం
అనంతపురం నగరం అంటే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు. ఇతర ప్రాంతాల నుంచి రిటైర్డ్‌ అయిన వారు సైతం ఇక్కడ స్థిరపడేంత సురక్షితమైన నగరం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిత్యం దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు నగర నడిబొడ్డునే జరుగుతున్నాయి. ఇది అనంతపురం కాదు… దండుపాలెంగా మారిపోయింది.

ఎన్నికల్లో అనంతపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి, అధికారంలోకి రాగానే ఒక ముఠాను ఏర్పాటు చేసి, దానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆలిబాబా అరడజన్‌ దొంగల్లా వ్యవహరిస్తూ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసుల అండతో ప్రజలను బెదిరిస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు.

ఈ దండుపాలెం బ్యాచ్‌ ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘ఎవరికి చెప్పుకున్నా మాకు భయం లేదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ మద్దతుతోనే ఈ బెదిరింపులు చేస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు.

ఎమ్మెల్యే ప‌ర్మిష‌న్ లేనిది ఏ పనీ జరగడం లేదు
అనంతపురం నగరంలో సినిమా థియేటర్‌ నడపాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, షోరూం పెట్టాలన్నా, పరిశ్రమ స్థాపించాలన్నా ఎమ్మెల్యే ఆఫీస్‌ పర్మిషన్‌ కావాలంటున్నారు. చిన్న ఇల్లు కట్టాలన్నా అదే పరిస్థితి. టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌, తాలూకా ఆఫీస్‌, చివరకు కలెక్టరేట్‌ వెళ్లినా ఎమ్మెల్యే పర్మిషన్‌ కావాలంటున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే అనుమతి లేకుండా ఏ పనీ జరగడం లేదు. గతంలో పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు ఉన్నప్పటికీ అనంతపురంలో ఇలాంటి దౌర్జన్యాలు ఎప్పుడూ చూడలేదు.

పైకి ముడుపులు పంపిస్తున్నామంటూ దోపిడీ
నారాయణపురంలో బుడబుడకల వ్యక్తికి చెందిన ఐదెకరాల భూమిని టీడీపీ నేత‌లు ఆక్రమించారు. మంత్రి టీజీ భరత్‌ బంధువుకు చెందిన మూడు ఎకరాల భూమినీ వదలలేదు. శారదానగర్‌లోనూ భూఆక్రమణలు జరిగాయి. ఓప్రొఫెసర్ కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆమె ప్రమాదంలో మృతి చెందితే దొంగ సంతకాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవ‌డం లేదు. లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ను కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఏటా ఎగ్జిబిషన్‌ నిర్వహించే వారిపై క‌మీష‌న్ల కోసం దాడులు చేశారు. టీడీపీకి చెందిన వ్య‌క్తి ఆస్తులకు నిప్పు పెట్టారు. ఇంత జరుగుతున్నా ఎస్పీ, డీఐజీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? చంద్రబాబు, లోకేష్‌ ఆశీస్సులతోనే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. పైకి ముడుపులు పంపిస్తున్నామని కూడా బహిరంగంగా చెప్పుకుంటూ దోపిడీ.

పోలీసులే భ‌య‌ప‌డుతున్నారు
టీడీపీ ఎమ్మెల్యే ఆగ‌డాల‌పై ఫిర్యాదు చేస్తే పోలీసులు భ‌య‌ప‌డి కేసులు న‌మోదు చేయ‌డం లేదు. చివరకు టీడీపీ నాయకుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తున్నారు. అరటికాయల వ్యాపారి నారాయణరెడ్డిపై దాడి జరిగితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. మీ పార్టీ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏమైంది?
బందీపోటు దొంగల్లా వ్యవహరిస్తుంటే ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏమైంది? ఈ విషయాలు చంద్రబాబుకు తెలియడం లేదా? తెలిసీ నటిస్తున్నారా? సభల్లో లా అండ్‌ ఆర్డర్‌ భంగం చేస్తే తోలు తీస్తానని చెబుతారు కదా? అనంతపురంలో జరుగుతున్న అరాచకాలు కనిపించడం లేదా?

పాలెగాళ్లుగా వ్యవహరిస్తే తస్మాత్‌ జాగ్రత్త
అనంతపురం ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆస్తులు ఎవరు ఆక్రమించినా వెంటనే వైయస్‌ఆర్‌సీపీ దృష్టికి తీసుకురండి. మేము మీకు అండగా ఉంటాం. అనంతపురం నగరంలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొల్పుతాం. ఇది పాలెగాళ్ల రాజ్యం కాదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే అడుగులకు మడుగులు ఒత్తవద్దు. తప్పు ఎవరు చేసినా తప్పే. దండుపాలెం ముఠాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. వీరిపై సమగ్ర విచారణ జరపాలి. స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని, అనంతపురంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top