ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే జీ–20 సన్నాహక సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2023లో జీ–20 సదస్సును నిర్వహించే అవకాశం భారతదేశం దక్కించుకుంది. దానికి ఎజెండాను ఖరారు చేయడానికి దేశంలోని అన్ని పార్టీల నాయకులతో (అఖిల పక్షం) ప్రధాని నరేంద్రమోదీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.
భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు.
ఈ సమావేశానికి రావాలని గతంలోనే సీఎం వైయస్ జగన్‌కి ఆహ్వానం వచ్చినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుండటం, ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ఉండటంతో సీఎం వైయస్ జగన్ ఢిల్లీకి వెళ్లే విషయం ఖరారు కాలేదు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రత్యేకంగా ఫోన్ చేసి జీ 20 సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. దీంతో సీఎం వైఎస్ జగన్ ముందుగా ఖరారైన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకుని ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.
సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో సమావేశంలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే మళ్లీ బయలుదేరి.. రాత్రి 10.30 సమయంలో విజయవాడ చేరుకుంటారు.