కాకినాడ: ప్రజల మన్ననలు పొందిన ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. ఎండీయూ వాహనాలకు కాలపరిమితి ఉన్నా ఇంటింటికీ రేషన్ అందించే వ్యవస్థను రద్దు చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా, రాజాం తహశీల్దార్ కృష్ణంరాజుకు ఎండీయూ ఆపరేటర్లు వినతిపత్రం ఇచ్చారు. పిఠాపురం టౌన్, పిఠాపురం మండలం యూ. కొత్తపల్లి లో ఎండీయూ ఆపరేటర్ల నిరసన కార్యక్రమంలో వంగా గీతా పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. 2027 జనవరి వరకు అగ్రిమెంట్లు ఉన్నప్పటికి ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుందన్నారు. 2021లో కరోనా వంటి ఉపద్రవంలో మా జీవితాలను పక్కన పెట్టి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా విధులను నిర్వహించి ప్రజలకు రేషన్ అందించి దేశ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. ఎండీయు వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.