అమ్మ ఒడితో 100 శాతం సత్ఫలితాలు

రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లుగా జీఈఆర్‌ పెరుగుదల

ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిని మించి విద్యార్థుల చేరికలు

విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణం

టెన్త్, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలైనా రెగ్యులర్‌గా చేరేందుకు అనుమతి

వారికి కూడా అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద  

అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలతో ముఖ్యంగా జగనన్న అమ్మఒడి ద్వారా నూటికి నూరు శాతం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ ఒడి ద్వారా ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిని మించి చేరికలు నమోదైనట్లు వెల్లడైంది.

గతేడాది ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 100.13 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 100.80కి చేరింది. అమ్మ ఒడి ద్వారా ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ విద్యలో జీఈఆర్‌ పెరిగినట్లు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్య­దర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశా­రు. మండల, జిల్లా స్థాయిల్లో నూరు శాతం జీఈ­ఆర్‌ నమోదుకు కృషి చేయాలని సూచించారు. 

రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లుగా ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో జీఈఆర్‌ పెరుగుతూ వస్తోంది. 2020 జనవరి 9వతేదీన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి పథకం కింద ఇప్పటి వరకు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.19,674.34 కోట్లు జమ చేశారు. 2023–24కి సంబంధించి ఈ నెల 28న అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

 ప్రాథమిక విద్యలో 2018లో జాతీయ స్థాయిలో జీఈఆర్‌ 96.09 ఉండగా రాష్ట్రంలో 92.91 ఉంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమ్మ ఒడితో పాటు పలు పథకాలను అమలు చేయడంతో 2019–20 నుంచి వరుసగా ప్రాథమిక విద్యలో జీఈఆర్‌ పెరుగుతూ 2022–23 నాటికి జాతీయ స్థాయిని మించి 100.80కి చేరింది.

సెకండరీ విద్యలో  2018–19లో జీఈఆర్‌  79.69 ఉండగా 2022–23 నాటికి 89.63కి చేరింది. ఉన్నత విద్యలో రాష్ట్రంలో 2018–19లో జీఈఆర్‌ 46.88 ఉండగా 2022–23 నాటికి 69.87 శాతానికి జీఈఆర్‌ పెరగడానికి ప్రధాన కారణం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తదితరాలు కారణమని స్పష్టం అవుతోంది. 

టెన్త్, ఇంటర్‌  సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు చదువు మానేస్తున్నారు. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను మరింత పెంచడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారిని రెగ్యులర్‌ తరగతుల్లో అవే కోర్సుల్లో తిరిగి చేర్చుకునేందుకు అనుమతించింది.

ఈమేరకు మిషన్, విజన్‌ పేరుతో ఈ ఏడాది ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను వలంటీర్ల ద్వారా అమలు చేస్తోంది. అంతేకాకుండా పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలై తిరిగి రెగ్యులర్‌ తరగతుల్లో చేరిన విద్యార్ధులకు కూడా జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Back to Top