తాడేపల్లి: ప్రాంతాల మధ్య విధ్వేషాలకే చంద్రబాబు యుద్ధభేరీ పేరుతో బయలుదేరారని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర అగ్రిమిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దోమలమీద దండయాత్ర అని కూడా అన్నాడు. మరి ఆ దండయాత్ర ఏమయ్యిందో.. దోమలు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు బాబు చెప్పే యుద్ధభేరీ అంటే అర్ధమేంటి..? ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్‌లో కాదు. ఉండేదేమో తెలంగాణలో .. అంటే, తెలంగాణలో నివాసం ఉంటూ విజిటింగ్ వీసా మీద ఆంధ్రకొచ్చి ఇక్కడి ప్రజల మీద యుద్ధభేరీ అంటున్నాడని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, అగ్రిమిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ధ్వంసానికి బాబు యుద్ధభేరిః రాయలసీమలో చంద్రబాబు పదిరోజులపాటు యుద్ధభేరీ చేస్తానంటూ ప్రకటించాడు. అంతకు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దోమలమీద దండయాత్ర అని కూడా అన్నాడు. మరి ఆ దండయాత్ర ఏమయ్యిందో.. దోమలు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు బాబు చెప్పే యుద్ధభేరీ అంటే అర్ధమేంటి..? ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్‌లో కాదు. ఉండేదేమో తెలంగాణలో .. అంటే, తెలంగాణలో నివాసం ఉంటూ విజిటింగ్ వీసా మీద ఆంధ్రకొచ్చి ఇక్కడి ప్రజల మీద యుద్ధభేరీ మోగిస్తున్నాడా.. ఆంధ్రప్రదేశ్ విధ్వంసాన్ని చంద్రబాబు కోరుతున్నాడా..? అని ప్రశ్నిస్తున్నాను. భారత దేశ రాజకీయాల్లో తానే సీనియర్‌నని చెప్పుకునే బాబు ఒక్కసారి చరిత్రను తిరగేసి చూసుకోవాలని నేను గుర్తుచేస్తున్నాను. ఎందుకంటే, నాలుగేళ్లకు ముందు నీ పరిపాలన ఎలా ఉంది..? ప్రస్తుతం నాలుగేళ్లుగా మా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎలా ఉందో.. చూసుకో.. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. గణనీయంగా ఆహారపదార్థాల ఉత్పత్తి పెరిగింది. ధాన్యం, పండ్లతోటల ఉత్పత్తి పెరిగాయి. ఇదంతా దేవుడు దయతోనే సాధ్యమైందని మా ముఖ్యమంత్రి జగన్‌గారు చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా ఏదేదో ఊహించుకుని అంతా నాదే గొప్ప.. ఇవన్నీ నాతోనే సాధ్యమని మా జగన్‌గారు ఏనాడూ చెప్పడంలేదు. బాబు హయామంతా కరువు కాటకాలేః 2014 నుంచి 2019 వరకు చూస్తే.. రాష్ట్రంలో నిరంతరం కరువు కాటకాలే కొనసాగాయి. చంద్రబాబు పాలనలో సగటున ప్రతి ఏటా 300 కరువు మండలాలు డిక్లేర్ చేసిన పరిస్థితులున్నాయి. కృష్ణాడెల్టాలోనే నీరులేక ఊడ్చిన పొలాలు ఎండిపోయిన పరిస్థితుల్ని రైతులు ఇప్పటికీ మరిచిపోలేరు. 2018–19లో పది లక్షల ఎకరాల్లో పంటసాగు చేస్తే.. ఆ పంటంతా ఎండిపోయిన పరిస్థితిని అందరూ కళ్లారా చూశారు. అలాంటి దౌర్భాగ్యమైన, నికృష్టమైన పాలన చంద్రబాబుది. చంద్రబాబు, కరువు కవలపిల్లలేః నిత్యం కరువు కాటకాలను అధికారికంగా ప్రకటించుకున్న చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. అందుకే, చంద్రబాబు, కరువు అనేవి కవల పిల్లలంటూ టీడీపీ నాయకులే మనసులో అనుకుంటున్నారు.. తమ అధినేత ఎదుట బహిరంగంగా అనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులో నీరుండదని వాళ్లకు తెలుసుకాబట్టి. మరి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు తన ఐరన్‌లెగ్ మోపబోతున్నారా..? అని అందరూ భయపడుతున్నారు. 4ఏళ్లలో పోతిరెడ్డిపాడు నుంచి సీమకు 553 టీఎంసీల నీరిచ్చాంః మా నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక నాలుగేళ్ల కాలంలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడుతుంది. రాయలసీమకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని మనం ఒకసారి పరిశీలిస్తే.. 2014–15లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59.56 టీఎంసీలు, 2015–16లో 0.95 టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు. అంటే, సాగునీటికి కూడా రాయలసీమకు నీళ్లువెళ్లలేని పరిస్థితి అది. 2016–17లో 67.94 టీఎంసీలు, 2017–18లో 91.97 టీఎంసీలు, 2018–19లో 88.87 టీఎంసీలు కాగా, మీ ఐదేళ్లలో 310 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వెళ్లింది. అదే మా జగన్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగేళ్లను చూస్తే.. 2019–20లో 179.29 టీఎంసీలు, 2020–21లో 134.41 టీఎంసీలు, 2021–22లో 111.07 టీఎంసీలు, 2022–23లో 123.44 టీఎంసీలు కాగా ఈ నాలుగేళ్లలోనే 553 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు అందాయి. అంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే రెండింతల నీరు జగన్‌గారి హయాంలో రాయలసీమకు వెళ్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు దండగన్నది బాబేః రాష్ట్రంలో ప్రాజెక్టులపై మనసులో మాట పుస్తకం రాసుకున్న చంద్రబాబు ఆనాడు ఏమన్నాడు..? సాగునీటి ప్రాజెక్టులు దండగ అని అన్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన డబ్బుకు బ్యాంకుల రుణాలు కూడా రావని ఈ చంద్రబాబే అన్నాడు. ఆనాడు తన మనసులో మాట పుస్తకంలో అలా రాసుకోలేదని గుండెలమీద చెయ్యేసుకుని బాబు చెప్పగలడా..? నిజాయితీగా బాబు దీనికి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యంకాదన్న బాబుః రైతుల శ్రమ, సాగుపెట్టుబడులపై అవగాహన కలిగిన మహానేత, దివంగత వైఎస్‌ఆర్ గారు ఆనాడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటే.. అది సాధ్యం కాని హామీ అన్నది చంద్రబాబు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలారేసుకోవడమేనని బాబు వేళాకోళమాడింది నిజంకాదా..? వ్యవసాయం దండగమారిదని నువ్వే అన్నావు. ఇవన్నీ సాగునీటికి సంబంధించిన అంశాలు కాదా బాబూ..? అని అడుగుతున్నాను. అసలు సంబంధం లేని సందర్భాల్లో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద బురదజల్లే చంద్రబాబు ప్రయత్నాలను ప్రజలు అర్ధంచేసుకోలేనంత పిచ్చోళ్లేమీ కాదని మనవి చేస్తున్నాను. సీమలో చేపట్టిన ఒక్కప్రాజెక్టైనా చెప్పగలవా బాబూ..? దాదాపు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు రాయలసీమలో మొదలుపెట్టి పూర్తిచేసిన ఏ ఒక్క ప్రాజెక్టు పేరైనా చెప్పగలడా..? వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు వెర్రివెంగళప్ప సామెతగా సాగునీటి ప్రాజెక్టులపై బాబు మాటలు అలా ఉన్నాయి. తాను మొదలుపెట్టి పూర్తిచేసిన సీమ ప్రాజెక్టులపై బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇన్నాళ్లకు సీమ గుర్తుకొచ్చిందా..? చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ అనుభవమే.. 75 ఏళ్ల వయసులో ఉన్నాడు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాయలసీమ ప్రాంతం గురించి గుర్తుకొచ్చిందన్న మాట. రాయలసీమలో పుట్టి, ఇక్కడ్నే పెరిగి, ఈ సీమలో ప్రధాన ప్రాంతమైన కుప్పం నియోజకవర్గ ప్రజలు నిన్ను పదేపదే ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి అవడానికి కారకులయ్యారే.. మరి, అంతటి చరిత్రనిచ్చిన రాయలసీమను ఇన్నాళ్లూ ఎందుకు మరిచిపోయావని చంద్రబాబును నేను నిలదీస్తున్నాను. కుప్పంకు నీళ్లిచ్చావా బాబు..? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు కారణమైన కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు కనీసం నీళ్లిచ్చాడా..? అక్షరాస్యత విషయానికొస్తే , చిత్తూరు జిల్లాలోనే కుప్పం నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. అందులోనూ గుడిపల్లె మండలం రాష్ట్రంలోనే అక్షరాస్యతలో వెనుకబడి ఉంది. హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల్ని శంకుస్థాపనలతో సరిపెట్టారుః దేశంలోనే అత్యధిక సాగునీటి పనరుగా ఉన్నది కృష్ణానది. బచావత్ ట్రిబ్యునల్ అనేది 2000 సంవత్సరానికి పూర్తవుతుంది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలు ఒక హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ తర్వాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పడాలంటే, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ రెండు రాష్ట్రాలు కోరినా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. మరి, కొత్త ట్రిబ్యునల్ ఏర్పడే నాటికి 75 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు ప్రయార్టీ ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. బాబు 9 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టును ఎందుకు మొదలుపెట్టలేదు అని అడుగుతున్నాను. ఎన్నికలొచ్చినప్పుడల్లా హంద్రీనీవా, వెలిగొండ దగ్గర రెండుసార్లు శంకుస్థాపన చేశారు. హంద్రీనీవాను 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా చేపడితే.. మీ హయాంలో దాన్ని కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుకే పరిమితం చేసి మార్చారు. మహానేత వైఎస్‌ఆర్ హయాంలో హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు పూర్తిః మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హంద్రీనీవాను సాగునీటి ప్రాజెక్టుగా శంకుస్థాపన చేసి పూర్తిచేశారు. అలాగే, వైఎస్‌ఆర్ గారు పాదయాత్ర లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు దాకా చేస్తున్నప్పుడు.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 44వేల క్యూసెక్కులకు చేయాలని ఆయన సంకల్పిస్తే.. బాబు తన అనుచరులతో వ్యతిరేక ఉద్యమం చేయించి ఆ సంకల్పాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ 44 వేల క్యుసెక్కులతో నీటిని నింపుకుంటుందంటే ఆ పుణ్యం ఎవరిది..? మహానేత, వైఎస్‌ఆర్‌గారిదే కదా.. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లే ఇండియాలోనే అతిపెద్ద కాలువను విస్తరించింది మహానేత వైఎస్‌ఆర్ గారు. బనకచర్ల దగ్గర్నుంచి గోరకల్లు, అవుకు, గండికోట, సర్వరాయ రిజర్వాయర్ వరకు ఏ ఒక్క ప్రాజెక్టు గురించైనా బాబు ఆలోచన చేశాడా..? అని అడుగుతున్నాను. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం విషయంలోనూ బాబు నిద్రపోయాడు. మళ్లీ తాను రాయలసీమవాసినని చెప్పుకుంటాడు. వీధిరౌడీలా మాట్లాడుతున్న బాబుః రాయలసీమ అభివృద్ధికి, సాగునీటి రంగానికి కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టని చంద్రబాబు ఈరోజు అక్కడికెళ్లి ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నాడు. అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ము, ధైర్యంలేక పర్యటనల్లో మాత్రం ముఖ్యమంత్రి జగన్‌గారిని పట్టుకుని బాబు వీధిరౌడీలా మాట్లాడుతున్నాడు. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఆయన ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే వాతావరణాన్ని భ్రమింపజేసేందుకు 2009లో మహాకూటమి అనేదాంతో ప్రయత్నించాడు. రేపు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 23 సీట్లు కూడా వాళ్లకు దక్కవని గుర్తించి ప్రజల్ని డైవర్ట్ చేసే రాజకీయాలకు బాబు కుట్రపంథాను అమలు చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు బాగా దగ్గరగా గమనిస్తూనే ఉన్నారు. మీరెన్ని ఎత్తులు, పైఎత్తులేసినా.. కుట్ర రచనలు సాగించినా మరలా వైయస్‌ఆర్‌సీపీదే అధికారం అని మేం ప్రజలపక్షాన ధీమాగా చెబుతున్నాం.