పేపర్‌ లీకైతే అప్పుడెందుకు రాయలేదు?

ఫలితాలు వచ్చాక తప్పుడు వార్తలు రాస్తారా?

సచివాలయ పరీక్షలు పారదర్శకంగా జరిగాయి

కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు

కోడెల చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించలేదు

చంద్రబాబు తీరు ఎన్నికల ఊరేగింపులా ఉంది

తాడేపల్లి: సచివాలయ పరీక్షలు పారదర్శంగా జరిగాయని, కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పేపర్‌ లీకైతే లీకైనప్పుడే ఎందుకు వార్త రాయలేదని ఆయన ప్రశ్నించారు. ఫలితాలు వచ్చిన తరువాత లీకైనట్లు వార్తలు రాస్తారా అని నిలదీశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకకే ఇలాంటి కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని హితవు పలికారు. మాజీ స్పీకర్‌ కోడెల మృతిని చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఒక లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించింది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు విడుదల అయ్యాయి. పేపర్‌ లీకైందంట. పేపర్‌ లీకైతే పరీక్షల రోజు వార్త రావాలి కానీ, ఫలితాల రోజు రావడం ఏంటీ.. ఎల్లో మీడియా, చంద్రబాబు కలిసి
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కష్టపడి చదివిన వారందరికీ మంచి మార్కులు వస్తే.. అన్యాయం జరిగింది. అవినీతి జరిగిందని విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారు. పిచ్చిరాతలు నమ్మి మోసపోవద్దు. పారదర్శకంగా పరీక్షలు జరిగాయి. కావాలని చేస్తున్న కుట్రను దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోండి.

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కాదు. ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి సంబంధించి చెడుగా, వ్యతిరేకంగా మాట్లాడడం బాధ కలిగించే అంశం. అలా మాట్లాడడం కూడా మన సంప్రదాయం కాదు. కోడెల మృతికి వైయస్‌ఆర్‌ సీపీ కూడా సంతాపం తెలిపింది. కానీ చంద్రబాబు పనిగట్టుకొని ఆయన మరణాన్ని మాపై రుద్ది దోషులగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడాల్సిన అణివార్యమైంది. కోడెల చెడు కోణాన్ని చెప్పే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు.
16వ తేదీన కోడెల చనిపోతే 18వ తేదీ అంత్యక్రియలు జరిగే వరకు చంద్రబాబు ఎన్నిసార్లు ప్రెస్‌ ముందుకు వచ్చారో చెప్పలేం. హైదరాబాద్‌ నుంచి యాత్రగా నర్సరావుపేటకు తీసుకువచ్చి అంతిమసంస్కరణలు చేశారు. పార్టీకి చెందిన లీడర్‌ చనిపోతే బాధ కలుగుతుంది. భావోద్వేగం వస్తుంది. మొత్తం చంద్రబాబు 16 నుంచి 18వ తేదీ వరకు ఎక్కడా భావోద్వేగం లేకుండా, బాధ లేకుండా నర్సరావుపేటలో తిరుగుతున్నప్పుడు ఎన్నికల సమయంలో ప్రచారంలో ప్రజలను కలుసుకున్నట్లుగా వ్యవహరించాడు. కోడెల శవాన్ని రాజకీయంగా ఎంత సానుభూతి పొందుతామనే తాపత్రయం కనిపించింది తప్ప ఎక్కడా చంద్రబాబు ముఖంలో బాధ కనిపించలేదు .
ప్రభుత్వ వేధింపులు భరించలేకనే కోడెల చనిపోయారనే భావన కలిగించేలా చంద్రబాబు మాట్లాడారు. గత 23వ తేదీన కోడెల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అంతకు తెగించినప్పుడు చంద్రబాబు ఈరకంగా పోరాడి ఉంటే కోడెల బ్రతికి ఉండేవాడు. ఆ రోజున పోరాడకపోగా.. చట్ట ప్రకారం కోడెలపై ప్రభుత్వం యాక్షన్‌ తీసుకుంటే ఏ అభ్యంతరం లేదని మాట్లాడారు. కోడెల మరణించిన తరువాత సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

గవర్నర్‌ను కలిసి పెద్ద మెమోరండం ఇచ్చారు.ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి కట్టుకథలు రాసే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేస్తారు. కోడెల మీద 18 కేసులు పెట్టారంటున్నారు. ఇప్పటి వరకు కోడెలకు పోలీసులు నోటీసులు కూడా ఇవ్వలేదు. కోడెల ఎత్తుకెళ్లింది లక్ష రూపాయల ఫర్నిచర్‌ కాదు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి సంబంధించి అసెంబ్లీ ఫర్నిచర్‌. హైదరాబాద్‌ నుంచి అమరావతి తాత్కాలిక అసెంబ్లీ భవనం కోసం తీసుకువచ్చిన ఫర్నిచర్‌ కోడెల శివప్రసాద్‌ ఏ విధమైన అనుమతి లేకుండా తీసుకెళ్లారు. ఇవన్నీ కోడెల కుమారుడు షోరూంలో పెట్టారు. ఫర్నిచర్‌ విలువ సుమారు కోట్ల రూపాయల విలువ ఉంటుంది. కోడెల మరణాన్ని వైయస్‌ఆర్‌ సీపీ, ప్రభుత్వం వల్ల జరిగిందని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా ఇదంతా గమనించాలి.శవ రాజకీయాలు చేసి చంద్రబాబు రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top