చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలి

బాబు ప్రేరణతోనే టీడీపీ నేతలు నన్ను దూషించారు

టీడీపీ కుల రాజకీయాలు కార్యకర్తల తలకెక్కాయి

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

అనంతవరం ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తా

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

తాడేపల్లి: చంద్రబాబు ప్రేరణతోనే టీడీపీ నేతలు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ నలుగురితో పాటు బాబును కూడా అరెస్టు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండ్‌ చేశారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ అవినీతి, అక్రమాలు అరికడుతున్నామని, ఏదో విధంగా తనను భయపెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే కొందరు టీడీపీ నేతలు తాను మండపంలోకి వెళితే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పెద్ద పెద్ద అరుపులతో అసభ్యకరంగా మాట్లాడారు. నా భర్త కాపు సామాజికవర్గం. మేము చర్చికి, మసీద్, టెంపుల్‌కు వెళ్తాం. కుల వివక్ష రాజధాని ప్రాంతంలో చూడడం తలతిరిగినట్లుగా అనిపించింది. సామాజికవర్గం పేరుతో దూషించి నైతికంగా, మానసికంగా కృంగదీయాలని ప్రయత్నించారు. ఈ బురద రాజకీయాలు ఇక చెల్లవు. ఎంత మంది దాడి చేసినా ప్రతి కార్యకర్త సమన్వయం పాటించాలని, లీగల్‌గా చూసుకుందామని చెప్పాను. 

గతంలో చంద్రబాబే.. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారు. ఆ పార్టీ పెద్దే అలా ఉంటే.. ఇంక కార్యకర్తలు ఎలా ఉంటారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు చదువుకోరు అన్నారు. దళితులు మీకెందుకు పదవులు అని చింతమనేని మాట్లాడారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంత ప్రేమ ఉందో గతంలోనే అర్థమైంది. చంద్రబాబు కుల రాజకీయాలు కార్యకర్తల తలలోకి ఎక్కిపోయాయి. ఎన్నికల దగ్గర నుంచి నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నాపై దూషణలకు దిగిన నలుగురు టీడీపీ నేతలతో పాటు చంద్రబాబును కూడా తప్పనిసరిగా అరెస్టు చేయాలి. దళితులను చిన్నచూపు చూసిన నాయకులు ఇంటికే పరిమితమయ్యారు. 

ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఇంత అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటీ..? చంద్రబాబు నాయుడే ఇవన్నీ ప్రేరేపించి గొడవలు సృష్టిస్తున్నారు. జరిగిన సంఘటనను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు.

Back to Top