ఏపీకి కేంద్ర సహకారం చాలా అవసరం

ఆంధ్రరాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌ మీద బతుకుతుంది

ఐదేళ్ల బాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది

సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరాం

మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తాను

ఇచ్చిన ప్రతి మాట అమలు చేస్తా.. అవినీతి లేని పాలన అందిస్తా

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి

రాజధాని విషయంలో బాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు

దోపిడీ ఆపేందుకు రివర్స్‌ టెండరింగ్‌ తీసుకువస్తాం

పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్రరాష్ట్రానికి అవసరం 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, కాబోయే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఢిల్లీ: ఆంధ్రరాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలు చాలా అవసరం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక దుస్థితి గురించి వివరించడం జరిగిందన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్‌ జగన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జననేత ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. 
గత మూడు నాలుగు రోజులుగా తెలుసుకున్న విషయాలపై కేంద్రం నుంచి సహాయం చాలా అవసరం అని గ్రహించి ప్రధాని మోదీని అభ్యర్థించాం. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై నరేంద్రమోదీకి పూర్తి అవగాహన ఇస్తూ చర్చించాం. ప్రత్యేక హోదా అంశంపై ఆవశ్యకత ఎందుకు ఉందనే విషయాలను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ రకంగా రాష్ట్రం ఓవర్‌ డ్రాప్‌ (ఓడీ) మీద బతుకుతుందని వివరించాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయేనాటికి అప్పు రూ.97 వేల కోట్లు అయితే ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రూ. 2,58,928 కోట్ల అప్పుకు ఎగబాకింది. వీటి మీద వడ్డీ రూ. 20 వేల కోట్లు. అప్పులు, దానికి సంబంధించిన రీ పేమెంట్‌ రూ. 40 వేల కోట్లు ఉన్న పరిస్థితులు నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు కావాలని అభ్యర్థించామని వైయస్‌ జగన్‌ చెప్పారు. ఆ తరువాత విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.  

రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలపై చెప్పడం నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నా. ఎన్డీయే ప్రభుత్వం 250 స్థానాల్లో ఉండి ఉంటే బహుశా ఇంతగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. మన సాయం అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. రాష్ట్రాన్ని బాగా నడిపించాలనే తపన, తాపత్రయం ఉంది కాబట్టి అన్ని రకాలుగా సాయం అందించాలని కోరాం. 

ప్రత్యేక హోదా అనే అంశంపై పాజిటివ్‌గా స్పందించారు. ఫైల్‌పై సంతకం పెట్టే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హోదా అమలు చేస్తామని చెప్పారు. ఇది మనం వదిలివేస్తే ఆ తరువాత ఎప్పుడూ ఇవ్వరు. ఎవరూ పట్టించుకోరు. హోదా ఒక్కటే అనుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక సమస్య కూడా ఉంది. రాష్ట్రం బాగుపడాలంటే వారి సహాయ సహకారాలు కావాలి. ఒకసారితో ఆగిపోదు ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా అనేక సార్లు ప్రధానిని కలుస్తాను. కానీ, కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతి రోజు అడుగుతూనే ఉంటా. హోదా కచ్చితంగా వస్తుంది. 

మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం. దశలవారిగా అమలు చేస్తాం. 2024లో ఓటు అడిగే సమయానికి మాత్రం కచ్చితంగా మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసిన తరువాతే ఓటు అడుగుతాను. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం తూచా తప్పకుండా అమలు చేస్తా. విశ్వసనీయత అనే పదానికి రాష్ట్ర ప్రజలు ఓటు వేశారు. ఆ పదంపై నమ్మకం సన్నగిల్లకుండా అడుగు ముందుకువేస్తాను. 

కేసీఆర్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సాధించుకోవాలంటే పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి. కేసీఆర్‌ గారు ఒక అడుగు ముందుకువేస్తూ తన స్నేహాన్ని గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక హోదా అంశంపై కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్పారు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరూ తెలుగు మాట్లాడే రాష్ట్రాలే. ఇద్దరం కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో వైయస్‌ఆర్‌సీపీ బలం 22, ఇదిగాక కేసీఆర్‌ గారి బలం 9. ఇద్దరం కలిస్తే 31 మంది ఎంపీలు ఒకరి కోసం ఒకరం తోడుగా నిలబడేందుకు ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశాను. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించాం. 

ఢిల్లీకి రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి. మీ సహాయ సహకారాలు కావాలని అర్థించేందుకు ఢిల్లీకి వచ్చాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎటువంటి చాన్స్‌ తీసుకోదల్చుకోలేదు. కచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు దేవుడి ఆశీర్వాదంతో చేసుకుంటూ పోతాను. రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో చేసుకుంటూ పోతాం. 

రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రమాణస్వీకారం చేసిన తరువాత డిపార్టుమెంట్ల వారీగా రివ్యూలు తీసుకుంటూ ఆ రివ్యూల ఆధారంగా శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు పరిస్థితులు తెలియజెప్పాల్సిన పరిస్థితులు మాపై ఉంది. 

ఎంతటి దారుణమైన స్కామ్‌లు రాజధాని ప్రాంతంలో జరిగాయనేది ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పలానా చోట రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. 2014 మేలో ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్‌లో పలానా చోట డిక్లేర్‌ చేశారు. ఈ మధ్య కాలంలో రాజధాని ప్రాంతం మారిందని ప్రజలను తప్పుదోవపట్టించారు. చంద్రబాబు, ఆయన బినామీలు రాజధాని ప్రాంతంలో తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేశారు. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. ల్యాండ్‌ పూలింగ్‌ అని రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారు. ఆయనకు నచ్చిన రేటు, నచ్చిన వ్యక్తికి ఇష్టారీతిగా అమ్మేశాడు. ఈ రోజు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాన్ని దేశం చూసేలా చేస్తాం. అవినీతి లేకుండా చేస్తాం. సిస్టమ్‌ క్లీన్‌ చేస్తాం. మేము లేకపోయి ఉంటే ఇంతలా దోపిడీ ఉండేది.. ఉన్నాం కాబట్టి దోపిడీ ఆపగలిగామని చూపిస్తాం. రివర్స్‌ టెండరింగ్‌ సిస్టిమ్‌ తీసుకువస్తాం. ట్రాన్స్‌పరెన్సీ లెవల్‌ను పెంచుతాం. 

నాపై కేసులు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు పార్టీ మనుషులు, కాంగ్రెస్‌ పార్టీ మనుషులు నాపై కేసులు పెట్టారు. మా నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. మా నాన్న చనిపోయిన తరువాత, కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పుడు నాపై కేసులు పెట్టారు. మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సెక్రటేరియట్‌లో అడుగు పెట్టలేదు. ఒక్క మంత్రి నేను ఫోన్‌ చేయలేదు. నేను హైదరాబాద్‌లోనే లేను. బెంగళూరులో ఉన్నాను. 

పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్రరాష్ట్రానికి లేదు. కానీ ఆంధ్రరాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవసరం యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. ఏ చర్యలు తీసుకున్నా కూడా.. టెండర్‌ క్యాన్సిల్‌ చేసి రివర్స్‌ టెండరింగ్‌ పిలిచి ఈ మేరకు స్కామ్‌ జరిగిందని చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం. టెండర్లు పిలిచినప్పుడు వెంటనే చెబుతాం.. ఈ ప్రాజెక్టు.. ఈ సమయంలోపు చేయాలని చెబుతాం. కేంద్రం ప్రభుత్వాన్ని ఇన్వాల్స్‌ చేసి వారి ద్వారానే టెండర్లు వేయించాల్సిన అవసరం ఉంటే వారితోనే చేయిస్తాం. మాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడమే అవసరం. 

30వ తేదీన నా ఒక్క ప్రమాణస్వీకారం జరుగుతుంది. తరువాత వారం పది రోజుల్లో మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుంది. మొదటి సంతకం ఆగిపోయే పరిస్థితి కాదు. తొమ్మిది పథకాలు నవరత్నాలు అమలు చేస్తాం. మొదటి రోజు నుంచి ఏమేం చేయబోతున్నామో స్టార్ట్‌ చేస్తాం. ప్రమాణస్వీకారం స్పీచ్‌ చేస్తే అందరికీ అర్థం అవుతుంది.

ప్రతిసారి మీరు ఒంటరి పోరుకే సిద్ధపడ్డారు. ఈ అఖండ విజయాన్ని ముందే ఊహించారా.. అని విలేకరి అడిగిన ప్రశ్నకు దేవుడి మీద, ప్రజల మీద ఉన్న నమ్మకం అని వైయస్‌ జగన్‌ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ఇంగ్లిష్‌ మీడియాతో మాట్లాడారు.

 

Back to Top