విశాఖ: చంద్రబాబు..నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విశాఖపట్టణంలోని ఎంపీ అభ్యర్థి ఘాన్సీ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. *ఓటమి తెలిసే.. చంద్రబాబులో అసహనంః* - చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన భాష, మాట్లాడే తీరును చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అనుభవశాలిగా చెప్పుకుంటూనే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకుని నెత్తిమీద అర్ధరూపాయి పెడితే దమ్మిడీకి కొనరంటున్నాడు. స్పీకర్‌నైతే రకరకాల పేర్లతో పిలుస్తాడా..? అసలెందుకు అంత సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు..? రాజకీయాల్లో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. నాయకులుగా గెలుస్తాం. ఓడతాం.. అయితే, తాను, తన కూటమి ఓడిపోబోతుందని తెలిసి అంత సహనం కోల్పోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా..? అతను ఏమనుకుంటున్నాడు.? ప్రజలు ఛీకొట్టే విధంగా మాట్లాడటానికి అతను సిగ్గుపడాలి. *వెన్నుపోటు రాజకీయాల్లో నీకన్నా నీచుడెవడు..?* నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు.. మరి, నిన్నేమని సంభోధించాలి..? నీచుడనాల్నా.. అంతకన్నా పెద్ద మాట ఇంకేమైనా ఉందా..? దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలి. *ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది అందుకేగా..?* - రాజకీయ నేతల తలల మీద ఎంత పెట్టాలో.. ఏ రకంగా వాళ్లను కొనాలో.. బేరాలకు లొంగే నేతల గురించి కొలమానం నీకు తెలుసు. అంతమాత్రానా అందర్నీ వేలం పెడతానంటే ఎలా కుదురుతుంది..? మరి, నీకు అంత సామర్ధ్యం ఉండబట్టే కదా.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పారిపోయి వచ్చింది..? ఓటుకు కోట్లు కేసులో నువ్వు చేసింది ఇదేనని అందరికీ తెలుసుకదా..? అతెందుకు.. అసలు, నీ తల మీద ఉన్న విలువెంతో నీకు తెలుసా..? నువ్వొక చెల్లని కాసు అనేకదా.. నిన్ను 2019లో ప్రజలు ఓడించి మూలన కూర్చొబెట్టారు. అలాంటి నువ్వు.. ప్రజా మద్దతుతో రాష్ట్రంలో 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్‌రెడ్డి గారిని పట్టుకుని వేలం వేస్తానంటావా..? ఆ మాట అనడాని కి నీకు సిగ్గుగా అనిపించలేదా..? నీ మాట్లాడే తీరును, భాషను, సహనం కోల్పోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. *విశాఖ రాజధానిగా, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం* ఎస్.కోటలో నా గురించి మాట్లాడుతూ.. ఏం బొత్సా అని పిలిచావ్..? సరే, నాకంటే వయస్సులో పెద్దోడివనుకుంటా.. నువ్వు అలా నన్ను సంభోదించినా నేనేం అనుకోను. ఎస్.కోటను విశాఖపట్టణంలో కలపకుండా విజయనగరంలోనే ఎందుకు ఉంచావన్నావు. నీమాటకే వస్తే.. ఎస్.కోటను విశాఖలో కలపడం వలన ఏంటి లాభం..? సమాధానం చెప్పు..? మా ఉద్దేశంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంత 34 ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధిలోకి తేవడం మా అభిమతం. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే హక్కు నీకెవరిచ్చారు...? మేం వారి అభిప్రాయాల్ని గౌరవిస్తాం కనుక ఉత్తరాంధ్రలో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఎలా చేయాలనేది మాకు తెలుసు. *విశాఖను రాజధానిగా నువ్వెందుకు సమర్ధించవు..?* - విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాం.. దీన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని జగన్‌మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. నువ్వేమో.. ఇక్కడ రాజధాని ఉండటానికే వీల్లేదంటూ.. ఆ స్థాయి పట్టణంగా విశాఖ పెరగకూడదని నువ్వు అడ్డుపడుతున్నావు. విశాఖ రాజధానిగా నువ్వు సమర్ధించనప్పుడు ఎస్.కోట గురించి ఎందుకు మాట్లాడుతున్నావు..? ఒకవేళ, నువ్వు విశాఖపట్టణాన్ని రాజధానిగా సమర్ధిస్తే.. ఒక్క విశాఖ ఏంటి..? అనకాపల్లి, పార్వతిపురం, విజయనగరం, ఎస్.కోట, శ్రీకాకుళం తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోంది కదా..? *ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లొద్దుః* గతంలో విశాఖ జిల్లాలోనే ఉన్న అనకాపల్లిని జిల్లా చేశామంటే.. అదొక వెనుకబడిన ప్రాంతంగా ఉండాలని చేశామా..? పరిపాలనా సౌలభ్యం కోసమే ఆ ప్రాంత ప్రజలకూ అభివృద్ధి ఫలాలు శరవేగంగా దక్కాలని కాదా..? మరి, ఇవ్వన్నీ ఏం తెలియకుండా నీ లెక్కలేంటి..? నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నావా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధిలోకి రావడంతో పాటు విశాఖ ప్రపంచస్థాయి నగరం అవుతోందనేది అందరికీ తెలుసు. అలాంటిది, నువ్వేమో ఒక్క పక్కన కోర్టులకెళ్లి మరీ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మోకాలడ్డుతూ.. ఎన్నికలనగానే, ఇక్కడకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లు చెబుతావా..? ఉత్తరాంధ్ర ప్రజలు నువ్వు చెప్పే మాటల్ని నమ్మేంత అమాయకులేమీ కాదని తెలుసుకో.. *అవినీతి చక్రవర్తి బిరుదాంకితుడు చంద్రబాబుః* -చంద్రబాబు కాలేజీకి సైకిల్ మీదనే వెళ్లేవాడనేది ఆయన సన్నిహితులే గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. మరి, నేనైతే.. కాలేజీకి స్కూటర్ మీద వెళ్లాను. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాల్టికి రూ.1400 కోట్లు ఏ విధంగా వచ్చాయి..? అంతమొత్తం ఎలా సంపాదించాడు..? మరి, మేమూ 15 ఏళ్లపాటు అనేక ప్రభుత్వాల్లో మంత్రులుగా చేశాం కదా..? అన్ని కోట్లు రూపాయలు మాకెందుకు రాలేదు..? ఎన్ని కుంభకోణాలు చేసి అన్ని రూ.వేల కోట్లు సంపాదించావో ప్రజలకు సమాధానం చెప్పు. అవినీతి చక్రవర్తి అనే బిరుదును ప్రజలు నీకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకో.. ఇప్పటికైనా, నీ భాషను సరిచేసుకోకపోతే చాలా దెబ్బతింటావు. రాజకీయాల్లో సహనం కోల్పోయి మరీ అంతగా నోరుపారేసుకోవడం మంచిది కాదు. ప్రజలు నీ మాటలు విని అసహ్యించుకుంటున్నారు. *ఉత్తరాంధ్ర నీ జాగీరేం కాదు..?* ఉత్తరాంధ్ర ప్రాంత నేతలుగా మేము రాజకీయాల్లో ఎప్పట్నుంచో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకూ మనోభావాలు.. ఆత్మగౌరవం మాకు తెలుసు. అలాంటిది, ఈరోజు ఎన్నికలనగానే నువ్వొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నీ జాగిరు అన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది..? వయసులో పెద్దోడివైనప్పటికీ, కొంచెం వళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నోటికేదొస్తే అది మాట్లాడుతానంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు. *పేద పిల్లలకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో టోఫెల్ శిక్షణః* రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోని అనేకమంది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు జగన్ గారి విజయం గురించి మాట్లాడతున్నవన్నీ వాస్తవాలే కదా..? మరి, ఆయన గానీ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, ఆయా కుటుంబాలకు ఖరీదైన వైద్యం దూరం అవుతుంది కదా..? ఈ రాష్ట్రంలో మూడోతరగతి నుంచే పిల్లలకు టోఫెల్ పరీక్షకు తయారుచేసే విద్యావిధానంలో దేశంలో ఎక్కడైనా ఉందా..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై పట్టుతో మాట్లాడేందుకు టోఫెల్‌ను గతంలో నేర్చుకునేవాళ్లు. కానీ, మన పిల్లలకు మూడో తరగతి నుంచి టోఫెల్ నేర్పిస్తూ.. బేసిక్, జూనియర్, సీనియర్ అంటూ టెస్టులు పెట్టి ప్రభుత్వమే వాళ్లకు ఫీజులు కడుతూ ఇంగ్లీషు మీడియంను వృద్ధిలోకి తెస్తున్నాం. గతంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో నడిచే హైస్కూళ్లు రాష్ట్రంలో అన్ని కలిపితే 100 ఉండేవి కాదు. అలాంటిది, ఇవాళ వెయ్యికి పైగా సెంట్రల్ సిలబస్‌తో హైసూళ్లను అప్‌గ్రేడ్ చేశాం. ఇంగ్లీషు మీడియం పట్ల కొత్తగా మేం చైతన్యం తెచ్చాం. - ఐబీ విద్యను రాష్ట్ర విద్యావిధానంలోకి తెస్తున్నాం. జెనీవాలోని సంస్థతో మాట్లాడి.. ఆ సంస్థ మేనేజ్‌మెంట్‌ను ఏపీకి రప్పించి.. జగన్‌మోహన్‌రెడ్డి గారి సమక్షంలో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఐబీ కొలబరేషన్‌తో ప్రభుత్వ స్కూళ్లల్లో సరికొత్త విద్యావిధానాన్ని నడిపించ నున్నాం. మరి, విద్యావ్యవస్థలో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా చూశామా..? అదే ఐబీ చదువుకోవాలంటే, ట్యూషన్ ఫీజు ఒక్కో విద్యార్థికి ఆరేడు లక్షల రూపాయలు వెచ్చించాలి. అలాంటిది, ప్రభుత్వ స్కూళ్లల్లో ఉచితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామంటే అది సంతోషమే కదా..? ఇది మా ప్రభుత్వం తాలూకూ నిబద్ధత. మా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆలోచన. అందుకే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి గారే ఎందుకు అవసరమనేది చెబుతున్నాం. - రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. కాలేజీకి వంద సీట్ల చొప్పున తీసుకుంటే.. ఈ రాష్ట్ర విద్యార్థులకు 1700 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లే కదా..? అందులో 70 శాతం పేద విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. రూ. కోటి నుంచి రూ.2 కోట్లు ఖర్చుపెట్టి సీట్లు పొందలేని విద్యార్థులకు ఉచితంగా మెడికల్ సీట్లు వస్తున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వస్తుంది. ఆ ఊరి పేదవాడికి ఖరీదైన నాణ్యమైన వైద్యం ఉచితంగానే అందుతోంది. *నీ విజన్‌తో పేదోడికి మేలు జరిగిందా బాబూ..?* ఇవన్నీ ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలే కదా..? వీటిని చెప్పకుండా నోటికేదొస్తే అది మాట్లాడటం.. అభివృద్ధి లేదని అదేపనిగా ఊదరగొడితే ఎలా కుదురుతుంది..? ప్రజలకు ఇవ్వన్నీ తెలిసిన వాస్తవాలని మీరు మరిస్తే ఎలా..? చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు చేసే ఇలాంటి మంచి ఆలోచనలు ఎప్పుడైనా చేశాడా..? అంటే, నీ విజన్‌లో పేదోడికి ఏనాడైనా మేలు జరిగిందా..? *జగన్‌గారి గెలుపు అనివార్యమంటోన్న మేధావులుః* అనేకరంగాల్లో మేధావులైన వారు సైతం ఇవాళ జగన్ గారి పరిపాలనా సంస్కరణలను మెచ్చుకుంటున్నారు. ఆయన ఎన్నిక అనేది ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. ఈ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి కోసం. ఆయా కుటుంబాల్లోని పేద పిల్లల చదువులు అంతర్జాతీయ స్థాయిలో పెరగాలంటే .. అది రాబోయేకాలంలో దేశానికి, రాష్ట్రానికి పెట్టుబడిగా ఉండాలనేది జగన్ గారి తాపత్రయం. అందుకే, విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు చేపట్టారని పెద్దలు ఉదాహరణలుతో సహా వివరించడం చాలా బాగుంది. ఒకవేళ, జగన్ గారే కనుక గెలవకపోతే.. ఇప్పటిదాకా రాష్ట్రంలో విద్యావైద్యంలో కొనసాగిన సంస్కరణలు ఆగిపోయే ప్రమాదం ఉందని మేధావులే చెబుతున్నారు. అవి ఆగిపోతే, ఈ రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి పేద కుటుంబాల ప్రజలు ప్రమాదంలో పడిపోతారని చెబుతున్నారు. ––––––––