అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మార్కెట్‌ యార్డుల్లో దళారీ వ్యవస్థను అరికట్టాం

రైతు సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ మిషన్‌

శనగ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నాం

చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడు

ఆ సంస్కారంతోనే లోకేష మతిలేనివాడిగా గుర్తింపుపొందాడు

పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

సచివాలయం: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన వ్యవసాయ మిషన్‌ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మాసంలో ఈ వ్యవసాయ మిషన్‌ సమావేశమై.. రైతాంగ సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో పంటకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. శనగ రైతులను ఆదుకున్నామని, మార్కెట్‌ యార్డుల్లో దళారీ వ్యవస్థను అరికట్టామని మంత్రి మోపిదేవి చెప్పారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. ‘రూ.3 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతును ఆదుకుంటుంది. ఆ క్రమంలోనే భాగంగానే అధికారం చేపట్టిన రెండో మాసంలోనే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పండించిన శనగ పంటకు గిట్టుబాటు ధర లభించక గోదాములలో నిల్వ ఉంచుకొని కష్టాలు పడుతున్న రైతులకు ఉపయోగపడే విధంగా చక్కటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రూ. 45 వేల నష్ట పరిహారం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎకరాకు 6 క్వింటాళ్ల శనగ పండుతుంది అనుకుంటే క్వింటాల్‌కు రూ.15 వందల చొప్పున రూ. 9 వేల చొప్పున 5 ఎకరాలు సీలింగ్‌ పెట్టి అదనపు ఆర్థికసాయం అందే విధంగా చర్యలు తీసుకున్నారు. 63 వేల మంది శనగ రైతులను గుర్తించి 30 వేల మంది రైతులకు రూ.75 కోట్ల పరిహారం చెల్లించాం. మిగిలిన రైతుల రికార్డులు పరిశీలిస్తున్నాం. ఈ నెలాఖరులో వారికి కూడా పరిహారం చెల్లిస్తాం.

Read Also: ఇసుక కొరత - వాస్తవాలు

రైతు పంట వేసుకునే సమయంలో ఈ క్రాపు బుకింగ్‌ చేసుకోవడం ఆనవాయితీ. దాని ఆదారంగా లోన్లు వస్తాయి. శనగపంటకు బ్యాంకులు లోన్లు ఇవ్వరని వేరే పంట బుక్‌ చేసుకొని శనగ పంట వేస్తారు. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ క్రాపులో ఏ పంట బుక్‌ చేసుకుంటారో.. దాని ప్రకారమే పరిహారం చెల్లించాలి. ఈ క్రాపు నిబంధనలతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారు. గోదాములలో నిల్వ ఉన్న స్టాకులు ఎవరి పేరు మీద ఉన్నాయో ఆ మేరకే పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

ఉల్లిధర రూ.50 నుంచి 60 పలుకుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. ఉల్లి ఎక్కువ పండుతున్న రాష్ట్రాల నుంచి 370 క్వింటాళ్లు, కర్నూలు మార్కెట్‌ నుంచి 350 క్వింటాళ్లు కొనుగోలు చేసి 85 రైతు బజార్‌లకు రూ.25 కిలో చొప్పున విక్రయించాలని సప్లయ్‌ చేశాం. గతంలో ఇలా చేసిన పరిస్థితి లేదు. దీని వల్ల దాదాపు 2 కోట్ల ఆర్థికభారం రాష్ట్ర ఖజానా మీద పడింది. అయినా వినియోగదారులు ఇబ్బందులు పడొద్దనేది ప్రభుత్వ ఉద్దేశం.

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా దళారీలు మోసం చేస్తున్నారని సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చింది. వెంటనే దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని సూచించారు. మార్కెట్‌ డిపార్టుమెంట్‌ రంగంలోకి దిగి రూ. 25 కిలో టమాటా రైతు నుంచి కొనుగోలు చేసి వాటిని తిరుపతి, ఆధోని, రైతు బజార్‌లకు పంపిణీ చేశాం. అవి రూ. 11కే సప్లయ్‌ చేశాం.
 
పెసర, మినుము, శనగలు వారు కూడా గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని ఆలోచించి రూ.100 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన సుబాబుల్‌ రైతుల బిల్లులు రూ.5.70 కోట్లు ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని కూడా ఆదుకున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణ చెప్పారు.

40 సంవత్సరాల అనుభవం, పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చంద్రబాబు అంటాడు. అధికార పార్టీలో ఉన్న 151 ఎమ్మెల్యేలను మేకలతో పోల్చుతున్నాడని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. తెలుగుదేశంకి సంబంధించినవారు 23 మంది పులులు అని మాట్లాడుతున్నాడని, పులులు కాబట్టే ప్రజలు వారిని అరణ్యంలోకి పంపించారన్నారు. ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు ఆ విధమైన సంస్కారంతో పెరిగారేమో కాబట్టే ఆయన తనయుడు లోకేష్‌ బాబు మతిలేని వాడిగా గుర్తింపుపొందాడన్నారు. అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్‌ను తిరస్కరించారని ఎద్దేవా చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ అటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. అర్హులందరికీ ప్రభుత్వ  సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అది చూసి చంద్రబాబుకు మింగుడుపడడం లేదన్నారు. స్థాయి దిగజారి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని సూచించారు.

Read Also: ఇసుక కొరత - వాస్తవాలు

 

Back to Top