వైయస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ చంకలు కొట్టుకుంటుందని, అది సూపర్ ఫెయిల్యూర్ అంటూ వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మీ ఎల్లో మీడియా, మీకు మీరే సక్సెస్ అంటూ ఊదరగొట్టుకుంటే సక్సెస్ ఎలా అవుతుందని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం కడపలో రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.` సూపర్ సిక్స్‌లో అన్నీ అమలు చేశాం అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంల మోసం లేకపోతే వీళ్ల ప్రభుత్వమే లేదు. ప్రజల సమస్యలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి. తల్లికి వందనం, ఫ్రీ బస్సు అమలవుతుందంటే అది వైయస్ఆర్‌సీపీ పోరాట ఫలితమే. మీరు స్వచ్ఛందంగా చేసింది కేవలం పింఛన్లు మాత్రమే. ఇది సూపర్ సిక్స్ ప్రభుత్వం కాదు..సూపర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఫ్రీ బస్సు కోసం అప్పట్లో మీరు చెప్పింది ఏంటి..? అమలు చేస్తోంది ఏంటి..? మీరు సూపర్ 6 పూర్తిగా అమలు చేసేవరకూ వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. షరతులు లేవు..కటింగులు లేవు అని చెప్పి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. పింఛన్లు 5 లక్షలు తీసివేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉంది. నిజమైన వికలాంగులు ఇప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నావు...దాని ఊసే లేదు. తల్లికి వందనం 80 లక్షల మంది పిల్లలుంటే...50 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ఎంత మందికి తల్లికి వందనం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు...ఇంగ్లీషు మీడియం విద్య లేకుండా పోయింది. ఇక విద్యాదీవెన, వసతి దీవెన అనేది అసలే లేకుండా చేసేశారు. రైతులకు మీరు ఉపయోగపడింది ఎక్కడ..? వర్షాలు వచ్చి నష్టపోతే పరిహారం లేదు. రైతులకు ధరలు తగ్గిపోతే కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది లేదు. రైతులకు అండగా నిలిచిన రైతు బరోసా కేంద్రాలను పనికి రాకుండా చేసేశారు. ఎరువులు, విత్తనాలు లేవు..కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఉచిత బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లొచ్చని చెప్పి...ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అంటారా? ఇప్పుడు కేవలం ఉచిత బస్సును పల్లె వెలుగులకు మాత్రమే పరిమితం చేస్తావా? నిన్ను ప్రశ్నించకూడదు..మీ పచ్చ మీడియాలో ఊదర గొట్టించుకుని సక్సెస్ అంటే ఎలా? నెలకు మహిళకు 1500 అని చెప్పి...ఇప్పుడు పీ4 అంటున్నాడు. ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పి ఓట్లు దండుకుని అందర్నీ మోసం చేశాడు. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావు...? నిరుద్యోగ భృతి ఇచ్చావా...? చంద్రబాబు పరిపాలన కేవలం దండుకోవడం కోసం మాత్రమే.ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పులు చేశాడు..ఎక్కడ ఖర్చు చేశాడు..? మహిళపై ఏకంగా ఎమ్మెల్యేలే అరాచకాలు చేస్తున్నా చర్యలు లేవు. టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నజీర్ అహ్మద్ తీరుపై నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు..? ఎమ్మెల్యేలే ఇలా చేస్తుంటే ఇక మీ సామాన్య కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పులివెందుల, ఒంటిమిట్టలో ఎన్నికలొస్తే...పోలీసులు, మీరు కలిసి రిగ్గింగ్ చేసుకుంటారా? ప్రజలకు ఓట్లు వేసుకునే అవకాశమే ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఇక ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు..ప్రభుత్వం అసలే లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తే..కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేయండి. చంద్రబాబూ.. నీ నైజం ప్రజలకు అర్ధం అవుతోంది..సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారు` అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.