స్వచ్ఛ పాలనకు వజ్ర సంకల్పం

 

 రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కీలక నిర్ణయాలు
 

ప్రమాణ స్వీకార వేదిక నుంచే హెచ్చరికలు

 ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడమే లక్ష్యం

 దూకుడు పెంచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 

  స్వచ్ఛమైన పాలన దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి అడుగు వేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే తన పాలన ఎలా ఉండబోతుందో తన ప్రసంగం ద్వారా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్ల పేరుతో జరిగిన దోపిడీని వెలికితీసి రివర్స్‌ టెండరింగ్‌ విధానం చేపడుతామని వివరించారు.  పైరవీకారులు, అవినీతిపరులకు తన ప్రభుత్వంలో స్థానం ఉండబోదంటూ గట్టి హె చ్చరికలు పంపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు కసరత్తులు ప్రారంభించారు. వృద్ధాప్య, వితంతు పింఛన్‌లను రూ. 250 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుని మొదటి సంతకం చేశారు. ఏటా రూ. 250 వంతను పింఛన్లు పెంచుతూ నాలుగేళ్లలో రూ. 3 వేలు చేస్తానని ప్రచారంలో ఇచ్చిన హామీని తన తొలి సంతకంతో అమల్లోకి తెచ్చారు. 

పారదర్శక పాలన దిశగా అడుగులు... 
గ్రామ స్వరాజ్యం దిశగా.. ప్రభుత్వ పథకాలన్నీ డోర్‌ డెలివరీ చేస్తానన్న మాటకు అనుగుణంగా విలేజ్‌ సెక్రటేరిట్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గాంధీ జయంతి నాటికి ప్రతి గ్రామంలో పది మంది స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చి పథకాల అమలుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సమస్యలపై మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచే ఉంటున్న ఊర్లోనే 72 గంటల్లో సమస్య పరిష్కారం అయ్యేలా నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. దాంతోపాటే ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకునేలా వలంటీర్‌ వ్యవస్థను రూపొందించడం శుభపరిణామం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి పథకాలు సరిగా చేరుతున్నాయో లేదో తెలుసుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేసి పారదర్శక పాలనకు ముందడుగు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడం కూడా శుభపరిణామం.  ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా స్వయంగా తాను కూడా ఆచరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా తాను కేవలం రూ. 1 జీతానికే పనిచేస్తున్నట్టు చెప్పడం సంతోషం. తండ్రి రూపాయి డాక్టర్‌గా ఎంతో మందికి చేసిన సేవే స్ఫూర్తిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రూపాయి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయనున్నారు. పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే లక్ష్యంగా తన వంతు ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగానే ఆయనీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. 

బాబు పాలనలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సంగతి తెలిసిందే. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే.. ఏటా ఓవర్‌ డ్రాఫ్ట్‌లతో పాలన సాగించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. (రాష్ట్రం విడిపోయే నాటికి) రూ. 97 వేల కోట్ల లోటుతో చంద్రబాబు పాలన మొదలు పెట్టి అయిదేళ్లలో జనం నెత్తిన రూ. 2.20 లక్షల కోట్లకు పైగానే  అప్పుల భారాన్ని మోపారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రానికి కీలకమైన ఏ పనిని పూర్తి స్థాయిలో చతికిలబడిపోయిన చంద్రబాబు స్థానంలో అధికారంలోకి వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు చాలా పెద్ద బాధ్యతలే ఉంచారు. పోలవరం, రాజధాని నిర్మాణం, ఇతర సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన వంటి ఎన్నో పనులు వేల కోట్లు గుమ్మరించినా సమాధి స్థితిలోనే ఉన్నాయి. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఖజానాను ఖాళీ చేయించింది. లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రాష్ట్రంలో.. ఖర్చులకు ఖజానాలో వంద కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని నడిపించడంతోపాటు అభివృద్ధిలో పరుగులు పెట్టించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఉపన్యాసంలో కనిపించిన ఘాటు హెచ్చరికల వెనుక కారణం తప్పకుండా ఇదే అయ్యుంటుంది. రాష్ట్ర శ్రేయస్సుకు పాటుపడే నాయకుడికి వెన్నంటి ఉండాల్సిన అవసరం అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరిపైనా ఉంది. 

 
Back to Top