అమరావతి: అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు... అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన రోజు 14 మే 2004. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు... డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విశాలాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన పాదయాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి... ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైయస్ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించినా.. పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, మే 14న విశాలాంధ్రలో మార్పుకు ఓ తొలి పొద్దుపొడుపు. అప్పటి దాకా దశాబ్ధాల పాటు కనిపించని, కనివినీ ఊహించని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆ రోజు ముహూర్త వేళ. ఆ అడుగుల ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం. జనం నుంచి వచ్చిన నాయకుడు వైయస్‌ఆర్. ప్రజల మనస్సుల్లో నమ్మకమైన నాయకుడిగా నిలిచినవాడు వైయస్‌ఆర్. ప్రజల ప్రేమాభిమానాలతోనే ఆయన సీఎం అయ్యారు. రాజకీయ పోరాటాలు, సుదీర్ఘ నిరీక్షణ...అన్నింటి మధ్య నుంచి వైయస్‌ఆర్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా దూసుకొచ్చారు. భావి తరాలకు స్ఫూర్తిప్రదాత తనమీద తనకు అపార నమ్మకం ఉన్నా..ఏ వ్యక్తి అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. విజేతగా మారిన తరువాత నిలకడైన వ్యక్తిత్వంతో రాణించే వ్యక్తే నిలుస్తాడు. భావి తరాలకు స్ఫూర్తిప్రదాత అవుతాడు. వైయస్ రాజశేఖరరెడ్డిలోని విలక్షణ గుణం ప్రత్యర్థుల గురించి అతిగా ఆలోచించకపోవడం. అతిగా పట్టించుకోకపోవడం. తనపై తనకు ఆపార నమ్మకం ఉన్న వ్యక్తి ఆయన. అందులో తాను నమ్మింది మంచి అయినప్పుడు ఇక యూటర్న్‌ల గొడవెందుకు అన్నదే అలోచన. అందుకే వైయస్‌ఆర్ రాజకీయ జీవితం...ప్రజా జీవితం రెండూ వేరు వేరు కాదు.ప్రజల కోసం పని చేసేదే రాజకీయం అన్నది వైయస్‌ఆర్ సిద్దాంతం. ఆ సిద్దాంతాన్ని ఆయన కడవరకు వీడలేదు. తూచా తప్పకుండా పాటిస్తూనే పోయారు. చంద్రబాబు గారి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అప్పుల కుప్ప అయిన ఆంధ్రప్రదేశ్, నిత్య కరువులతో రైతన్నలు అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టకాలంలో నేనున్నానని భరోసా అందని ఆంధ్రప్రదేశ్‌కు అప్పుడు వైయస్‌ఆర్ ఒక్కడే తోడయ్యారు. ప్రజల కోసం నేనున్నానని మండుటెండల్లో నడిచిన మనిషి అయ్యాడు. ప్రజలకు ధైర్యం చెప్పాడు. తను ముఖ్యమంత్రి కాగానే ప్రజలకు చెప్పినట్లుగా పాలన సాగించారు. వ్యవసాయ రంగం, చేనేత రంగం, పారిశ్రామిక రంగాలతో పాటు భగీరథుడిని తలపిస్తూ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు అన్నీ...వైయస్‌ఆర్ కేసి కళ్లెత్తి చూడాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఆయన సంకల్ప బలానికి జేజేలు కొట్టేలా చేశాయి. అయినవాడే అందరికి...అయినా ఎవరికి అందడు పాలన అంటే అంత సులభతరం కాదు. అంత కష్టతరం కాదు. ప్రజాస్వామిక పాలనలో ప్రతిరోజు ప్రజల సంక్షేమం వైపే ప్రభుత్వ ఆలోచన సాగాలి. ఆలోచన ఆచరణగా మారి ఫలితం సాధించాలి. ఈ విషయంలో నాడు..నేడు..డాక్టర్ వైయస్‌ఆర్‌కు సరిసాటి ఎవరూ లేరు. అయినవాడే అందరికి...అయినా అందడు ఎవరికి అన్న మాటలు విన్నాం. కానీ ప్రజలకు ఎప్పుడు వైయస్‌ఆర్ అందుబాటులోని మనిషే.సాటి రాజకీయ నాయకులకు మాత్రమే కొరుకుడుపడని కొయ్య. రాటు తేలిని రాజకీయ నాయకులతో తీసిపోని రీతిలో తలపడటంలోనైనా, రాజకీయాలు నడపడంలోనైనా వైయస్‌ఆర్‌ది ఎప్పుడు ముందడుగే. కానీ అలా కనిపించేవారు కాదు. ఆవేశపరుడు, దూకుడు మనిషి అనే భ్రమల్లో ప్రత్యర్థులు ఉండగానే మరోవైపు గొప్ప దార్శనికుడు అయిన నేతగా ఎదిగారు వైయస్‌ఆర్. నేల మీద పట్టు...నేలమీదే అడుగులు. కానీ ఆశయాలు ఆకాశమంతా. అది సాధించేందుకు వైయస్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అది ఆయనకు మాత్రమే తెలిసిన విషయం. వైయస్ ఐదేళ్ల పాలన కాలాన్ని గమనించిన వారైనా ఆయనతో పనిచేసిన వారైనా..వైయస్‌ఆర్ పనితీరుపై అద్భుతమైన రీతిలోనే స్పందిస్తారు.పథకాలు ప్రకటించడంలోనైనా వాటికి ఆర్థిక వనరులు సమకూర్చడంలోనైనా, నిర్ణయాలు వేగంగా తీసుకోవడంలోనైనా వైయస్‌ఆర్ తరువాతే ఎవరైనా..కానీ ఇవన్నీ ప్రజల కోసం ఉద్దేశించినవే కావడంతో వైయస్‌ఆర్ రాజీలేని దోరణితో వ్యవహరించేవారు. వైయస్‌ఆర్ నడక, నడతలో ధీమా ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కారణాలు ఏంటీ అని ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పనే లేదు. ఆయన పదవీ కాలంలో పని తీరే ఆయనకు ఆ స్థాయిని సాధించిపెట్టింది. వైయస్‌ఆర్ నడకలో, నడతలో కనిపించే ధీమాతో ఆయన పని, సామర్ధ్యం పోటీ పడింది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో మొదటి స్థానం వైయస్‌ఆర్‌దే. తీసుకున్న నిర్ణయాల దశ, దిశ స్పష్టంగా నిర్ణయించి, ఆచరణలో అమలు చేయడంలో మొదటి స్థానం ఆయనదే. వైయస్‌ఆర్ స్పష్టంగా ఆలోచిస్తారు. ధైర్యంగా ఆలోచిస్తారు. ఆలోచనల్లో శష దిశలకు చోటివ్వని నైజం ఆయనది. వైయస్‌ఆర్ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కనిపించే ఈ లక్షణాలే ఆయన బలం, బలహీనత కూడా. తన రాజకీయ జీవితంలో దశాబ్ధాల పాటు పదవులకు దూరం కావడానికి ఆయన వేగం, ముక్కుసూటితనమే కారణం. అదే సమయంలో ఆ లక్షణాలే ప్రజల్లో వైయస్‌ఆర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. సమకాలీన రాజకీయ నాయకుల్లో వైయస్‌ఆర్ ఓ ప్రత్యేకం అయ్యారు. నిత్యం సమరమే స్వపక్షం కాంగ్రెస్‌లో ప్రత్యర్థులు. ప్రత్యర్థి పార్టీలో సహజంగా ఉండే ప్రత్యర్థులు. అటుఇటు వారితో నిత్య సమరం వైయస్‌ఆర్‌ది. అందుకు పెద్ద కారణాలు ఏమీ లేవు. వైయస్‌ఆర్ ఆలోచనలు ఎప్పుడు ప్రజల పక్షమే. తనకు రాజకీయంగా నష్టం జరిగినా ఆయన తన ప్రజా పథా మార్చుకునేవారు కాదు. రాజకీయ దారి పట్టేవారు కాదు. అప్పుడది వైయస్‌ఆర్ బలహీనత. ఆ బలహీనతే ఆయనకు తిరుగులేని బలమని తర్వాతి కాలం నిరూపించింది. వైయస్‌ఆర్ ఎందరో నాయకులకు మార్గదర్శి అయ్యారు. ఓ చెరిగిపోని సంతకం 2004 నుంచి 2009 వరకు వైయస్‌ఆర్ ఐదేళ్ల పాలన .. విశాలాంధ్ర ప్రదేశ్‌లో ఓ చెరిగిపోని సంతకం. రాష్ట్రం విడిపోయినా..రెండు రాష్ట్రాల్లోనూ వైయస్‌ఆర్ అభిమానులు ఉన్నారు. ఆయనకు రుణపడి పోయామని చెప్పేవారు ఉన్నారు. ఈ రోజు మా బతుకుల్లో కనిపిస్తున్న వెలుగు వైయస్‌ఆర్ పుణ్యమే అనే వారు ఎందరెందరో. నిజంగా వైయస్‌ఆర్ రాజకీయ నాయకుల్లో అదృష్టవంతుడు. కోట్లాది మంది జనం ఇప్పటికీ ఆయనను తలుచుకోవడం అంటే ఎవరైనా ఆలోచించాల్సిందే. ప్రజల జీవితాలను, మరీ ముఖ్యంగా పేదల జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిన వైయస్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనను మరిచిపోని రాజన్నగా చేశాయి. రాజకీయ నాయకుల్లో పుణ్య పురుషుడిని చేశాయి. అరుదైన నాయకుడు వైయస్‌ఆర్ పేదలంటే అపేక్ష, వారి జీవితాలు మార్చాలని, వారు సంతోషంగా జీవించాలన్నదే తపన. దేశంలో ఈ తరహా ఆలోచన ఉన్న నాయకుల్లో అరుదైన నాయకుడు వైయస్‌ఆర్. అదే రీతిలో రైతులు, చేనేతలు, కార్మికులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అణుక్షణం పరితపించిన వైయస్‌ఆర్ లేని లోటు, దశాబ్ధకాలమైనా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వైయస్ రాజశేఖరరెడ్డి లేకపోవడంతో తెలుగు ప్రజల కష్టం, నష్టం అంతంత కాదన్నది అందరూ అనుకుంటున్న విషయమే. సమయ, సందర్భాన్ని బట్టీ అనేకసార్లు ప్రజలకు గుర్తుకు వస్తునే ఉన్నారు వైయస్‌ఆర్. ఆసుపత్రి గడపల దగ్గర పనిచేయని ఆరోగ్యశ్రీ వెక్కిరించినా, చాలీచాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ పేదల పెద్ద చదువులను కొడికట్టిస్తున్నా వైయస్‌ఆర్ ఉండి ఉంటే ఇలా ఉండేదా అని జనం గుర్తు చేసుకుంటున్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందకున్నా, కరువు పీడిస్తున్నా, సర్కార్ నిర్ణక్షం శాపంగా మారినా, ప్రజలకు రాజన్ననే గుర్తుకు వస్తున్నారు. ఆయన ఉంటే ఇలా జరిగేదా అని ప్రజలు తమలో తాము అనుకుంటున్నారు. ఆ ఆశల ఎదురుచూపులు ఇంకా ఆలానే.. 2004 మే 14న మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వైయస్‌ఆర్, ఐదేళ్ల తరువాత రెండోసారి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు నడిపించారు. ప్రజాభిమానం ఆయన వైపే నిలిచింది..గెలిపించింది. 20 మే 2009న వైయస్‌ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వంద రోజుల పాటు వైయస్‌ఆర్ పాలన సాగింది. ఆ వంద రోజుల కాలంలో వైయస్‌ఆర్‌ను గమనించిన వారికి కనిపించింది ఒక్కటే..ప్రజలకు మరింత మేలు చేయాలన్న తపన. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందాలన్న సంకల్పం. ఏ పనిలోనైనా వైయస్‌ఆర్ నిర్వహణ సామర్ధం తిరుగులేనిది. ఆ సామర్ధ్యం మరింత అద్భుత ఫలితాలు అందించి తీరేది. కానీ వైయస్‌ఆర్ దురదృష్టమో, ప్రజల దురదృష్టమో ఆయనను కబలించింది. ఆయనపై ప్రజలు ఎన్నేన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల ఎదురుచూపులు ఇంకా ఆలానే ఉన్నాయి. ఓ నమ్మకం వైపు చూస్తూ..వైయస్‌ఆర్ వారసుడు జగనే ఇక జనం నమ్మిక. ఎన్నేళ్లు బతికామన్నది కాదు. సమాజానికి ఎంత మేలు చేశామన్నది ఎవరైనా లెక్కలేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలను ప్రజల మేలు కోసం ఎంతవరకు ఉపయోగించామని నిరంతరం ఆలోచించాలి. ఇది వైయస్‌ఆర్ తరచు అనే మాటలు. ఆయన అలాగే జీవించారు. జనం మరవని రాజన్నగా నిలిచిపోయారు. ప్రజా నాయకుడిగా ఎదగాలని స్పష్టమైన లక్ష్యంతో పని చేసే ఒక వ్యక్తి , ఎంత ప్రభావవంతంగా తనదైన ముద్రవేయగలడో తెలియాలంటే వైయస్‌ఆరే ఒక కొలబద్దత, వైయస్‌ఆరే ఒక స్ఫూర్తి..