శ్రీవారి సొమ్ము ఇక సేఫ్

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నగదు ఏదైనా ఇకపై ప్రభుత్వ బ్యాంకులో మాత్రమే జమ చేయనున్నారు. శ్రీవారి సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయరాదని, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జమచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రకటన జారీ చేసింది. 
టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ శ్రీవారి ఆలయం చుట్టూ ఎన్నో వివాదాలు ముసిరాయి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వందల కోట్ల డిపాజిట్ల వ్యవహారం ఒకటి. స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకల్లో నగదు రూపంలో వచ్చేవి ఎక్కువ శాతం ఉంటాయి. కేవలం హుండీ ఆదాయమే రోజుకు రూ.80లక్షలు ఉంటుందని అంచనా. బ్రహ్మోత్సవాలు, పండుగ సమయాల్లో ఇది మరింత పెరిగి కోటి రూపాయిలకు పైనే ఉంటుంది. ఇక వసతి గదులు, ప్రసాద విక్రయాలు, ఇతర బ్యాంకుల్లో ఉన్న శ్రీవారి బంగారం, నగలపై వచ్చే వడ్డీ ఇతరత్రాలు కలిపి చూసినా స్వామివారి నిత్యాదాయం కోట్లల్లోనే ఉంది. ఇలా సమకూరిన ఆదాయంలో సుమారు రూ. 4000 కోట్ల రూపాయిల నగదులో రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేసింది గత ప్రభుత్వం. అంతకు ముందు ఎప్పుడూ శ్రీవారి సొమ్ములను ప్రైవేటు సంస్థల్లో పెట్టింది లేదు. ఇండస్ ఇండ్ అనే ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డబ్బును డిపాజిట్ చేయడాన్ని భక్తులు ఎంతో మంది తప్పు పట్టి కోర్టును సైతం ఆశ్రయించారు. 
గత ప్రభుత్వం చేసిన ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత టీటీడీ పాలక మండలిని వివరణ కోరింది.  వైవీ సుభ్బారెడ్డిగారి అధ్యక్షతన టిటిడి పాలక మండలి దీనిపై పూర్తి స్థాయిలో చర్చజరిపింది. గతంలో తీసుకున్న ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని, కేవలం జాతీయ బ్యాంకుల్లోనే శ్రీవారి ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుస్తామని హైకోర్టుకు తెలియబరిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీకి చెందిన రూ.4కోట్ల రూపాయిల నిధులను పార్టీ కార్యక్రమమైన తిరుపతి ధర్మపోరాట దీక్షకు వినియోగించినట్టు విజిలెన్స్ కమీషన్ దర్యాప్తులో తేలింది. ప్రైవేటు బ్యాంకుల్లో శ్రీవారి సొమ్ములు ఉంచి తమకు ఇష్టం వచ్చిన రీతిలో నిధుల దుర్వినియోగం చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇకపై అలాంటి ఘటనలు జరిగే ఆస్కారం లేకుండా ప్రభుత్వ బ్యాంకుల్లోనే శ్రీవారి సొమ్ములను ఉంచేలా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం  చేస్తున్నారు. ఇదే విధంగా స్వామి వారి నగల ఆడిట్ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నారు. 
తిరుమల కొండపై అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండకూడదనే నిర్ణయం, టీడీపీ హయాంలో తొలగించి స్వామివారి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు గారిని ఆగమ సలహాదారుగా నియమించడం వంటి నిర్ణయాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భక్తుల మన్ననలందుకుంటున్నారు. ఇప్పుడిక శ్రీవారి సొమ్ములను సేఫ్ గా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రతిష్ట మరింత పెరిగింది. 

Read Also: వైయస్‌ఆర్‌సీపీ పాలనలో అందరూ సమానమే

Back to Top