సీనియార్టీ..సిగ్గేస్తోంది!

న‌ల‌భై ఏళ్ల చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం న‌వ్వులపాలు

మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా చేసినా ..ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేదు

ఎన్నిక‌ల ముందు చెప్పేది ఒక‌టి ..సీఎం అయ్యాక చేసిదే మ‌రొక‌టి

అమ‌రావ‌తి:  దేశంలోనే అందరికన్నా సీనియర్‌ పొలిటీషియన్‌ అని చెప్పుకుంటారు చంద్రబాబు. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన సీనియారిటీ..ఏపీకి ఎలా ఉపయోగపడింది? ఆయన ఏం చేశారు? ఏం సాధించారు? రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసమూహాల్లో చర్చలకు తావిస్తున్న టాపిక్‌ ఇది...ఇంతకూ ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితికి కారణమైన చంద్రబాబును నిలదీస్తున్న ప్రజలకు, నాయకులకు ఆయన చెబుతున్నదేంటి?
 ఆంధ్రప్రదేశ్‌లో సగానికిపైగా జనాలకు చంద్రబాబుగారి నలభై ఏళ్ల రాజకీయం తెలుసు. అందంతా పట్టించుకోని యంగ్‌జనరేషన్‌కు ..ఈ నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు తెలుసు. మొత్తానికి సీనియారిటీ చాంతాండంత అయ్యేసరికి, అందరికీ తెలిసిన చరిత్ర అయింది చంద్రబాబుది.
ఈ ఐదేళ్లకాలం...చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర గుట్టును రట్టు చేస్తోంది. అసలింతకాలం ఈయన రాజకీయాల్లో ఎలా నెట్టుకొచ్చారన్న విషయాన్ని కథలు..కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు...రాజకీయ జీవితమంతా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, తెరవెనుక భాగోతాలు, తెరముందు పొత్తులు, అవసరమనిపిస్తే ఎవరితోనైనా స్నేహం, అక్కర తీరగానే విదిల్చికొట్టడం వంటి వాటి మీదనే నడిచింది. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడంలో ఆయన తరవాతే ఎవరైనా? ఐదేళ్ల క్రితం ఆరువందల హామీలతో మేనిఫెస్టో సాక్షిగా ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించారు చంద్రబాబు, అందులో ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చకుండానే...కాలాన్ని ముగించారు. సరిగ్గా, ఎన్నికలకు మూడు నెలల ముందు...అటు ప్రతిపక్షనాయకుడు చెబుతూ వస్తున్న రెండువేల రూపాయల పింఛను దగ్గర నుంచి, రైతులకు పంట సాయం వరకూ..హడావుడి నిరుద్యోగభృతి అమలు నుంచి, పసుపుకుంకుమ పథకాల వరకూ ...రాత్రికి రాత్రి పుట్టిస్తున్న జీవోలతో ప్రవేశపెట్టేశారు. 
ఇంతకూ బాబు సీనియారిటీ ఎందులో...ఆయన తన సీనియారిటీతో సాధించింది ఏమిటి? ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులేమైనా చేశారా? నోరెత్తితే హైద్రాబాద్‌ను అభివృద్దిని చేశా చేశా...అని చెప్పుకోవడమే తప్పా...ఏపీ రాజధానిలో ఇంత పని జరిగింది? అని చెప్పారా...గ్రాఫిక్స్‌లో చూపించడం తప్పా? రోజురోజుకి పోలవరం అంచనా వ్యయాలు పెరిగిపోతూనే వున్నాయి. పనులు సాగి..సాగి..సాగుతూనే వున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ..ఎవరైనా ప్రశ్నిస్తే..బాబు తప్పు పట్టేది నరేంద్రమోడీని.  నాలుగేళ్లకాలం పాటు ముద్దొచ్చిన ప్రధాని మోడిగారు, ఇప్పుడు చేదయ్యారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికి,  ప్రధాని మోడీ మీదకు నెపాన్నంతా నెట్టేస్తూ...ప్రజల దగ్గర భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. 
 
మొత్తానికి ప్రత్యేకహోదాపైనా బాబు సీనియారిటీ ఫెయిల్‌...
పాలనా సామర్ధ్యంలో బాబు సీనియారిటీ ఫెయిల్‌.ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ విషయాలను మినహాయిస్తే...సంక్షేమ పథకాల విషయంలోనూ, అభివృద్ది పథకాల విషయంలోనూ బాబు సీనియారిటీ ఫెయిల్‌..ఫెయిల్‌ అని, రాష్ట్రంలో వేలగొంతులు ఎలుగెత్తి చాటుతున్నాయి. బాబు సీనియారిటీ ఎందులోనంటే... 

 
ఓటుకు నోటు కేసు నుంచి డేటాచోరీ వరకు...డబ్బు పెడితే ఎవరైనా వెళ్లగలిగే దావోస్‌ సదస్సుల హాజరీని  ఘనతగాచెప్పుకోవడం నుంచి, దేశదేశాలు తిరిగేస్తూ...అంతా రాష్ట్రం కోసమేనంటూ ప్రగల్బాలు పలకడం వరకూ బాబు సీనియారిటీ బాగానే ఉపయోగపడింది. రాష్ట్రాన్ని అప్పుల వూబిలోకి దించడం, దేశంలోనే అవినీతిలో నెంబర్‌వన్‌ ర్యాంకు సాధించడం..చంద్రబాబు సాధించిన ఘనతలేనని చెప్పుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రాన్ని దివాళా తీయించిన సీనియారిటీ చంద్రబాబుగారిదంటూ మండిపడుతున్నారు అటు ప్రజలు..ఇటు మేధావులు.
అవును అన్నట్టు ఎవరికైనా వయసుపెద్దదైతే ఏం ప్రయోజనం? పెద్దమనసు ఉండాలిగా?  రాజకీయ సీనియారిటీ అని చెప్పుకుని తిరిగితే ప్రజలకు ఒరిగేదేమిటి?  కేవలం రాజకీయమనుగడకోసమే కాలమంతా గడిపేయడంతోనే చంద్రబాబు సుదీర్ఘ రాజకీయచరిత్ర సాగిపోయింది. అంతకు మించి ఏమీ కాదుగాక కాదు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top