సోనియా గాంధీ మాటల్లో ఎంత నిజం ఉందో దేశ‌ప్ర‌జ‌ల‌కు తెలుసు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: ‘గత 8 ఏళ్లుగా దేశంలో అధికారం కొద్ది మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల చేతుల్లో కేంద్రీకృతమైంది. దీంతో భారత రాజ్యాంగం, వ్యవస్థలు బలహీనమౌతున్నాయి,’ అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 2004–2014 మధ్య దేశాన్ని పాలించిన యూపీఏ చైర్‌పర్సన్‌గా అపరిమిత అధికారాలు అనుభవించిన సోనియాజీ ఆంగ్ల దినపత్రిక హిందూస్తాన్‌ టైమ్స్‌ లో రాసిన సంపాదకీయ వ్యాసంలో దేశ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె చెప్పిన మాటల్లో ఎంత వరకు నిజం ఉందో 140 కోట్ల మంది భారతీయులకు తెలుసు. అలాగే, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ పదేళ్ల పాలనలో ఆమె పార్టీలో, పాలక కూటమిలో ఎంతటి గొప్ప ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందీ దేశ ప్రజలకు ఇంకా గుర్తుంది. మౌన మహర్షి వంటి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ జీని ప్రధాని కుర్చీలో కూర్చో బెట్టి అన్ని నిర్ణయాలూ తీసుకుంది, అన్ని కీలక నియామాకాలూ జరిపింది సోనియా గాంధీయే అనే విషయం చెప్పడానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. కష్టకాలాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బాసటగా నిలిచి, కేంద్రం లో యూపీఏ అధికారంలోకి కారకులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జననేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు కన్నుమూశాక 2009 సెప్టెంబర్‌ నుంచీ సోనియాగాంధీ, ఆమె కోటరీ ఆడిన నాటకాలు కాంగ్రెస్‌ ను ఇక్కడ శాశ్వతంగా భూస్థాపితం చేశాయి. అధికారం ఉన్న ఆ పదేళ్లూ భారత రాజ్యాంగాన్ని, చట్టాలను ఆటబొమ్మలుగా పరిగణించారు సోనియా, ఆమె కుటుంబ సభ్యులు. పార్టీలో ఇబ్బందులు ఇక చాలనుకోవడమేగాక, తెలుగునాట కాంగ్రెస్‌ నడక సరిగా లేదని గ్రహించిన యువనేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పార్టీ నుంచి వైదొలిగారు. దీంతో ఆగ్రహించిన సోనియాగాంధీ ఆయనను ఎంతగా వేటాడి, వేధించినదీ సమస్త తెలుగు ప్రజానీకానికి గుర్తుంది. కుటుంబం చేతిలో నడిచిన ఒక మీడియా సంస్థ విషయంలో తాము చేసిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనను, తన కుమారుడిని రోజుల తరబడి ప్రశ్నిచడంతో సోనియాజీకి ప్రజాస్వామ్యం విలువ తెలిసొచ్చింది. ప్రధాన మంత్రిని మరమనిషిగా మార్చి, కేంద్ర సర్కారు అనే కారులో ‘బ్యాక్‌ సీట్‌ డ్రైవింగ్‌’ చేస్తూ, తన చేతుల్లో, తన కుమారుడి జేబుల్లో అపరిమిత అధికారాలు పెట్టుకున్న పదేళ్లూ– ఇండియాను ఇష్టారాజ్యంగా పాలించిన విషయాన్ని ఆమె మరిచినట్టు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లకు రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థల విలువ ఏమిటో ఆమె గుర్తించడం నిజంగా సంతోషదాయకం. 

దేశంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నడకపై విమర్శల వర్షం కురిపించే హక్కు సోనియా జీకి ఉంది. సందేహం లేదు. అయితే, దేశంలో అన్ని రకాల ద్వేషభావాలను తొలగించి ప్రజలను తన పార్టీకి అనుకూలంగా ‘ఏకం చేయడానికి’ కన్యాకుమారి నుంచి బయల్దేరిన కాంగ్రెస్‌ ఆశాజ్యోతి రాహుల్‌ పాదయాత్ర  ఒక రాజకీయ నాయకుడుగా అయన కున్న హక్కు. తన 150 రోజుల భారత్‌ జోడో యాత్రలో 19 రోజులు 20 లోక్‌ సభ సీట్లున్న కేరళలోనే నడిచేలా, 80 సీట్లున్న యూపీలో కేవలం 2 రోజులే గడిపేలా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ రూపొందించడం వారి అంతర్గత విషయం. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమికి 19 సీట్లు వచ్చాయి. ఈ 19 సీట్లు నిలబెట్టుకోవడం కోసమే అన్నట్టు ఇప్పుడు కేరళలో రాహుల్‌ యాత్ర సాగుతోంది. గొప్ప ఉద్దేశాలతో మొదలైన రాహుల్‌ కాలినడక ఒక సంకుచిత లక్ష్యం కోసమే జరుగుతోందా అనే విమర్శలు వస్తున్న తరుణంలో రూటును సోనియా జీ పునః పరిశీలిస్తే బాగుంటుంది.  అంతేగాని, భారత రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటూ తాము అనుసరించని, తమకు నమ్మకం లేని విషయాల గురించి  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు చెప్పడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top