దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం

దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం అని చెప్పాలి. ఒకేసారి లక్షమందికి  ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రొబేషన్ ఒకేసారి ఇచ్చి ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటైన గ్రామ,వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఇలా ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేశారు. దీనివల్ల వీరికి వస్తున్న వేతనాలు రెట్టింపు అవుతాయి. వీరిని రెచ్చగొట్టడానికి కొన్ని మీడియా సంస్థలు రెచ్చగొట్టే యత్నం చేసినా, వారంతా ప్రభుత్వం పై నమ్మకం ఉంచడం విశేషం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రామ,వార్డు సచివాల య వ్యవస్థను  ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.సుమారు లక్షన్నర మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది కలలో కూడా ఊహించలేం.

కానీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దానిని అమలు చేసి చూపింది. ఇవి ఎంతవరకు సఫలం అవుతాయన్న సందేహం తొలుత ఉండేది. కానీ అసాధారణ విజయం సొంతం చేసుకున్న ఈ వ్యవస్థ గ్రామాలు, పట్టణాలలో ప్రజలకు పాలనను వారి ముంగిటే అందిస్తోంది. వీరికి తోడు వలంటీవర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ స్కీముల పలాలు అందుతున్నాయి. దీనివల్ల చాలా వ్యయం అవుతుందని భావించినవారు సైతం ఇప్పుడు ఈ పాలన వ్యవస్థ వల్ల ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వం వచ్చినట్లు అయిందని అంగీకరిస్తున్నారు. నిజమే దీనికి కొంత వ్యయం అధికంగా ఉండవచ్చు.కానీ ప్రజల అవసరాలకు మించిన పని ఏముంటుంది.గతంలో ప్రజలు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ సమాచారం అవసరం అయినా, సుమారు పదిహేను, ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తహశీల్దార్ ఆఫీస్ కు వెళ్లవలసి వచ్చేది. అయినా పని పూర్తి అవుతుందన్న నమ్మకం ఉండేదికాదు. కానీ ఇప్పుడు గ్రామాల వారు పట్టణాలలో అయితే వార్డుల వారీగా ప్రజలు తమకు ఏ పని కావాలన్నా సమీపంలో ఉండే ఈ సచివాలయాల వద్దకు వెళ్లి ఒక దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. 

ఆ తర్వాత దానిని ప్రాసెస్ చేసి సంబంధిత ఉత్తర్వులు వచ్చేలా ఈ సిబ్బంది కృషి చేస్తున్నారు.నిజానికి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో గ్రామాలవారు ఇప్పుడే రుచి చూస్తున్నారని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , విలేజీ క్లినిక్ లు, బడుల నాడు-నేడు, ఇళ్లవద్దకే పెన్షన్ ,రేషన్  మొదలైనవన్ని తమ గ్రామాలలో జరుగుతాయని ప్రజలు ఎన్నడూ ఊహించలేదు. ఎన్నికలకుముందు జగన్ వీటి గురించి చెప్పినా, ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక్కో సంస్కరణ అమలు చేయడంతో ఆ ఫలాలు ప్రజలకు చేరాయి. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తహశీల్దార్ ఆఫీస్ లను విభజించి మండల ఆఫీస్ లుగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించినప్పుడు మంచిపేరే వచ్చింది. ఇప్పుడు ఆయనకు మించిన పేరు జగన్ పొందుతున్నారని చెప్పవచ్చు. ఇవి కీలకమైన వ్యవస్థలుగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో సిబ్బందికి జీతాలు పెంచడం హర్షణీయం. తొలుత రెండేళ్లపాటు కన్సాలిడేటెడ్ జీతానికి వీరంతా పనిచేశారు. తదుపరి వీరికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారందరికి కొత్త పిఆర్సి అమలు చేయడానికి జగన్ ఓకే చేశారు. 

తదనుగుంగా లక్ష మంది వరకు ప్రయోజనం పొందుతారు. వీరికి జీతం దాదాపు రెట్టింపు అవుతుంది. దీనివల్ల వారి జీవితాలకు ఒక భరోసా వచ్చినట్లయింది. అయితే ప్రభుత్వంలో ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు అధికంగాఉందన్న వ్యాఖ్య ఇప్పటికే ఉంది. అయినా జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేసి చూపారు. క్షేత్ర స్థాయిలో ఇది ప్రజలకు ఎంతో ఉపయోగే కార్యక్రమం కనుక ఎవరూ తప్పుపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం వలంటీర్ల వ్యవస్థపై నిందలు మోపారు కానీ, సచివాలయ వ్యవస్థను తప్పు పట్టలేకపోయారు. కాకపోతే తాను ఎప్పుడో ఆలోచన చేశానని ఒక సందర్భంలో అన్నారు. దీనిని బట్టి వీటి విశిష్టత అర్దం అవుతుంది.  గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్‌ ఖరారైన గ్రేడ్‌–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది. తమ సొంత గ్రామంలో ఉండి ఇంత మొత్తంలో జీతం తెచ్చుకుంటామని  ఆ సిబ్బంది ఎవరూ అనుకుని ఉండరు. 

ఇప్పుడు వారిపై మరింత బాద్యత పెరిగినట్లయింది. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో మరింత శ్రద్ద వహించి మెప్పు పొందగలిగితే వారు సార్దకత పొందుతారు. ఇదే సమయంలో మరో మాట చెప్పాలి. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి పెరిగిన జీతాలతో సంతోషపడుతున్న తరుణంలో వారికి నష్టం జరిగిందని ఈనాడు పత్రిక ఒక కదనాన్ని రాయడం ద్వారా వైసిపి ప్రభుత్వంపై తనకు ఉన్న విద్వేషాన్ని బయట పెట్టింది. అదేమిటంటే వీరికి ప్రొబేషన్ డిక్లేర్ చేయడం లో కొద్ది నెలలు ఆలస్యం అయిందట. దాని వల్ల వారికి ఈ కొద్ది నెలలు జీతం తగ్గిందని,దానివల్ల ఉద్యోగులు 80 కోట్ల మేర నష్టపోయారని , దిక్కుమాలిన వార్త ఒకటి రాశారు. 

అంటే సచివాలయ సిబ్బంది సంతోషంపై నీరు చల్లడం, వారు ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా మారకుండా ఉండాలన్న దురుద్దేశంతో ఇలాంటి కదనాలు రాశారని తెలసుకోవడం పెద్ద కష్టం కాదు.చంద్రబాబు సి.ఎమ్ గా ఉన్న రోజులలో అసలు కొత్త ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలే తక్కువ. పైగా ఆరో జులలో ప్రబుత్వం వద్ద డబ్బులు లేవంటూ బీద అరుపులు చేసేవారు. పోనీ అలా అని ప్రభుత్వ దుబారా తగ్గించుకున్నారా అంటే అదీ లేదు. నిజమే ..ఒకప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వ్యయాన్ని తగ్గించాలని ప్రయత్నించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చాయి. కాని కాలం మారింది.

ఉద్యోగాల కల్పన అన్నది ప్రభుత్వ బాద్యతగా మారింది.అందువల్ల వైయ‌స్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే సచివాలయాలపై నిరంతర నిఘా లేకపోతే, ఇతర ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా వీరు కూడా లెదర్జిక్ గా మారడం, అవినీతికి అలవాటు పడడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.అలా జరగకుండా ఒక పర్యవేక్షణ ఉండడం కోసం ప్రభుత్వం ఎమ్మెల్యేలను ఈ సచివాలయాలకు వారానికి రెండు రోజులు వెళ్లి రావాలని   ఆదేశించింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ వ్యవస్థలో జీతాలు పెంచడానికి అవసరం అయ్యే వ్యయాన్ని భరించడం కష్టం అవుతుందా?లేక ఇబ్బంది ఉండదా అన్నది తేలడానికి మరి కొంత సమయ పడుతుంది. ఆర్దికంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి ప్రభుత్వం ఆదాయ వనరులను కూడా పెంచుకోవల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.   

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

Back to Top