తన మతం...జన హితం

కష్టం కాదు. నష్టం రాదు. జనం కోసం...జనం మెచ్చిన పాలనకోసం జగనన్న ఎంచుకున్న మార్గం కష్టమైనదీ కావచ్చు. కాస్త కటువైనదీ కావచ్చు.  కానీ ఆసాధ్యాలను సుసాధ్యాలను చేసే భగీరథప్రయత్నాలకు ఓటమి లేదు. ప్రజల మంచికోసం తలపెట్టిన సంకల్పానికి వెనకడుగు వేయడమూ తెలీదు.
ఆలోచనల్లో స్పష్టత వుంది. వాస్తవ పరిస్థితుల సంపూర్ణ అవగాహన ఉంది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు గురించి వేస్తున్న నిరంతర ప్రణాళికల జాబితా వుంది. అందుబాటులో వున్న వనరులతో ముందడుగులు వేస్తూ...అభివృద్దిని సాధించే క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కచ్చితంగా రేపటిరోజున సత్ఫలితాలు సాధించిపెట్టేవే. నాయకుడికి నమ్మకం వుంది. ఆయనపై మెజారిటీ ప్రజలకు విశ్వాసం ఉంది. ఇక అనుకున్నవి సాధించడానికి కష్టమేమి వుంది?  చిత్తశుద్దితో కూడిన ప్రయత్నాలకు ఓటమి లేదన్నది చరిత్ర చాటుతున్న సత్యం. రేపటి చరిత్ర మరోసారి చెప్పబోయే సత్యమూ అదే.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడాలేని సందేహాల పుట్టలు పెరుగుతూ వచ్చాయి. అవకాశాలు వెదుక్కునే రాజకీయనాగులు వాటిలో తిష్టవేసి బుసలు కొడుతున్నాయి. అమాయకులైన కొందరు ప్రజలు ఆ పుట్టల్లో దూరిన పాములకు పాలు పోసి పెంచాలనుకోవడం వారికి నష్టం కాక మరేమిటి?
కలనైనా ప్రజలకు కష్టం నష్టం కలిగించాలని ఆలోచించని ప్రజాపాలకుడు వైయస్‌ జగన్‌. రాష్ట్రవిభజన అనంతరం సరైన దిశానిర్దేశం లేక దారితప్పిన ఏపీ పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో, అసలుసిసలు ప్రజాపాలనకు సరైన నిర్వచనం ఇచ్చే దిశలో సాగుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.  ఓవైపు పేదజనం, బడుగుజనం, సామాన్యజనం కోసం శషబిషలు లేకుండా, లెక్కలేసుకుంటూ కూర్చోకుండా సంక్షేమపథకాల నవరత్నాలను ప్రారంభించారు. మామూలు రాజకీయనాయకులు కలనైనా సంకల్పించలేని ప్రజాసంక్షేమాన్ని, కళ్లముందు పట్టిచూపుతున్న జగన్‌కు ఇప్పటికే కోట్లాదిమంది జనం నీరాజనాలు పలుకుతున్నారు.
 దేవుడి దయ, ప్రజల ఆశీస్సలుంటే.. తను తలపెట్టిన ప్రజాసంక్షేమం...రాష్ట్ర అభివృద్ది విషయంలో వెనుకంజ వేయనని, వడివడిగా ముందడుగులు వేస్తూ పోతానని వైయస్‌ జగన్‌ తరచూ అంటుంటారు. ఆయన ఆలోచనల్లో చిత్తశుద్ది, ప్రయత్నలోపం కనిపించని కార్యదీక్ష అనుకున్న లక్ష్యాలను సాధించి తీరతాయి. సంక్షేమం పూలు పూస్తుంది. అభివృద్ది ఫలాలు అందరికీ అందుతాయి.

 

Back to Top