అమరావతి: గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో నికర రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో గణనీయంగా పెరుగుదల నమోదైంది. అంతకు ముందు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కంటే గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలోనే అత్యధికంగా జీఎస్‌డీపీ పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ మేరకు 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలను ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్ రూపంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జీఎస్‌డీపీ పెరుగుదలను కూడా వివరించింది. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలు ఎదురైనా వాటిని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ రెండంకెల వృద్ధి నమోదైనట్లు తెలిపింది. జీఎస్‌డీపీతో పాటు వ్యవసాయం, తయారీ, నిర్మాణ తదితర రంగాల్లోనూ గత ఐదేళ్లలో సగటున ఏటా రెండంకెల వృద్ధి నమోదు కావడం విశేషం. కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ చంద్రబాబు అంతకు ముందు ఐదేళ్ల పాలనలో జీఎస్‌డీపీ రూ.3.77 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో జీఎస్‌డీపీ రూ.5 లక్షల కోట్లు పెరగడం విశేషం. అంటే.. ఏటా ఒక లక్ష కోట్లు చొప్పున జీఎస్‌డీపీ పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్‌డీపీ 2019–20 నుంచి వరుసగా 2023–24 ఆర్థిక ఏడాది వరకు పెరుగుతూనే ఉంది. 2018–19లో చంద్రబాబు పాలనలో ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్‌డీపీ రూ.7,90,810 కోట్లు ఉండగా 2023–24 నాటికి ఐదేళ్ల జగన్ పాలనలో రూ.12,91,518 కోట్లకు పెరిగింది. అంటే ఐదేళ్లలో రూ.5,00,708 కోట్ల మేర పెరిగింది. మొత్తం మీద వైఎస్ జగన్ పాలనలో జీఎస్‌డీపీలో ఏటా సగటున 12.66 శాతం మేర వృద్ధి నమోదైంది. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత.. కోవిడ్ సంక్షోభంలో వ్యవసాయ రంగానికి, రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. దీంతో 2019–20 నుంచి 2023–24 వరకు వరుసగా ఐదేళ్లు వ్యవసాయ రంగంలో కూడా ఏటా సగటున రెండంకెల వృద్ధి సాధ్యమైంది. ప్రస్తుత ధరల ప్రకారం.. ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో జీఎస్‌డీపీ విలువ రూ.1,69,652 కోట్లు పెరిగింది. అంటే ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో జీఎస్‌డీపీలో ఏటా సగటున 12.97 శాతం వృద్ధి నమోదైంది.