తిరుపతి : మామిడి రైతులకు ఇదివరకెన్నడూ లేనంత పెద్ద కష్టం వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సమస్య సృష్టించి రైతులను అధఃపాతాళానికి తొక్కుతోంది. అయిన వారికి మేలు చేసేందుకు రైతులను ముప్పు తిప్పలు పెడుతూ నష్టాలపాలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా మామిడి సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. మామిడిలో అత్యధిక డిమాండ్ కలిగిన తోతాపురి వైపు మొగ్గు చూపించారు. ఈ ఏడాది కూడా పంట దిగుబడి బాగానే వచ్చింది. అయితే కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కూటమి పార్టీల నేతలకు చెందిన పల్ప్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నందున, వారికి మేలు చేయడం కోసం ధర ఎంతగా పతనమవుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైతులు నడిరోడ్డుపై మామిడి కాయలను పారబోసి ఆందోళనలు చేపట్టారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు. పల్ప్ తయారీ ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల కొద్దీ మామిడి లోడుతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంకా వేలాది టన్నుల మామిడి తోటల్లోనే దర్శనమిస్తోంది. మామిడి పంట సాగు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడంతో నష్టాలను భరించలేక, వారికి వారే శిక్ష విధించుకుంటున్నారు. పసి బిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి గ్రామాల్లోని మామిడి రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకున్న మామిడి చెట్లను మొదళ్లకు నరికేసి కలప వ్యాపారులకు అమ్మేస్తున్నారు. 40 ఏళ్లకు పైబడ్డ భారీ చెట్లను యంత్రాలతో తొలగించేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాలకు పైగా మామిడి చెట్లను తొలగించేసినట్టు సమాచారం. అప్పుడు చెరకు.. ఇప్పుడు మామిడి ⇒ పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొద్ది రోజులకే నల్ల బెల్లంపై నిషేధం విధించారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపించే చెరకు తోటలు క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. నల్లబెల్లం తయారు చేసిన రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడంతో అత్యధిక శాతం మంది రైతులు చెరకు సాగును వదిలేసుకున్నారు. ⇒ ఆ తర్వాత వేరుశనగ, వరి పంటల సాగుకు అవసరమైన నీరు లేక, వర్షాలు పడక ఆ పంటలను దూరం చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఇచ్చే మామిడిని చిన్న, సన్నకారు రైతులు అందరూ సాగు చేసుకున్నారు. ⇒ ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీలతో కలిసి గద్దెనెక్కిన చంద్రబాబు.. తన వాళ్లకు లబ్ధి చేకూర్చే ఉదే్దశంతో మామిడికి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. దీంతో రైతులు రోడ్డున పడ్డారు. ఈ ఏడాదే కాదు.. మరో నాలుగేళ్లు చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు నష్టాలు, కష్టాలు తప్పవని భావించే రైతులు ఏళ్లతరబడి పెంచుకున్న తోటలను నిర్ధాక్షిణంగా తొలగించేస్తున్నారు. కన్నీటి గాధలు.. బెదిరింపులు ⇒ భవిష్యత్తులో కూడా తమకు న్యాయం జరగదన్న ఆలోచనతో రైతులు మామిడి తోటలను తొలగించేస్తున్న విషయం మీడియాలో రావడంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడింది. తన చేతకాని తనం బయట పడుతుందనే భయంతో అధికారులను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా ఉద్యానవన, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా రైతులను బెదిరింపులకు చేస్తున్నారు. ⇒ ‘ఏ అధికారంతో మామిడి తోటను తొలగిస్తున్నావు.. పరి్మషన్ ఉందా.. అనుమతి లేకుండా చెట్లు కొట్టేస్తే.. అది మీ తోట అయినా సరే కేసు పెడతాం’ అంటూ రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన మామిడి రైతు మహేందర్‌రెడ్డిని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం పట్టించుకోనందునే ఈ దుస్థితి వచ్చిందని, ధర లేక ఏడుస్తుంటే ఓదార్చి న్యాయం చేయడానికి ముందుకు రాని మీరు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని సదరు రైతు తిరగబడే సరికి అధికారులు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. ⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సరకల్లు గ్రామంలో రమేశ్ అనే రైతు తన ఆరు ఎకరాల తోటలో మామిడి కాయలు కోయకుండానే వదిలేశారు. కనీసం కాయలు తెంపిన కూలి కూడా రాని పరిస్థితి ఉండటంతో మామిడి తోటను తొలగించేస్తున్నాడు. తన తండ్రి రెక్కల కష్టంపై 40 ఏళ్లుగా నీరందించి కన్నబిడ్డల్లా సాకిన చెట్లను ఇలా తొలగించడం బాధగా ఉన్నా, ఇకపై మామిడికి గిట్టుబాటు ధర రాదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘పెట్టిన పెట్టుబడి ఎలాగూ రాదు. కనీసం కాయలు కోసినందుకు అయ్యే ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట పక్వానికి వచ్చి కుళ్లిపోతున్న అడిగేవారు లేరు. లారీల్లో తీసుకెళ్తే బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకే తోటను తొలగించేస్తున్నా’ అంటూ రైతు రమేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇకపై గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశ లేదు మామిడి దిగుబడి బాగానే వచ్చింది. అయితే గిట్టుబాటు ధర మాత్రం రాలేదు. దళారులు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ వారికి సహకరించడం దుర్మార్గం. పంటను తీసుకుని వ్యాపారి వద్దకు తీసుకువెళితే.. ఇక్కడ ఖాళీ లేదు.. ఇంకో చోటుకు వెళ్లు.. అంటూ చీదరించుకోవడం చూసి తట్టుకోలేకపోయాను. ఇకపై మామిడికి గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశలేదు. అందుకే చెట్లు నరికేసు్తన్నా. – గిరీష్ రెడ్డి, పీవీ పురం, రామచంద్రాపురం మండలం నష్టాలు భరించలేకనే.. మామిడి పంట సాగులో పెడుతున్న ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదు. సాగులో నష్టాలు భరించలేక పోతున్నా. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినా ఒక్క రూపాయి మేరకు అయినా సాయం చేయలేదు. వ్యాపారులు పంటను చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నష్టపోవడం కంటే మామిడిని వదిలించుకోవడమే మేలు. అందుకే తోటను నరికేస్తున్నా. – మహేందర్‌రెడ్డి, గంగిరెడ్డిపల్లి, రామచంద్రాపురం మండలం కరోనాలో కూడా రూ.12వేలు ఇచ్చారు మామిడి పంటకు ఇప్పడు ఇస్తున్న ధర చూస్తే కడుపు కాలుతోంది. కరోనా సమయంలో కూడా టన్నుకు రూ.12 వేలు ఇచ్చారు. ఇప్పుడు సీజన్ అయిపోతున్నా సరే పంటను అడిగేవారు లేరు. పండించిన పంటను అమ్ముకోవడానికి నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట మామిడి పంటలో లాభాలు చూస్తామన్న ఆశ లేదు. అందుకే ఆ చెట్లన్నీ నరికి వేసి వేరే పంట సాగు చేయాలనుకుంటున్నా. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలం ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు మామిడి పంటకు ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. రూ.2కు చాక్లెట్ కూడా రావడం లేదు. అలాంటిది ఎంతో కష్టపడి సాగుచేసిన మామిడి కేజీ రూ.2కు ఇవ్వాలంటే ఆ రైతు చచ్చిపోక ఏం చేయగలడు? చావడం చేతగాకనే ఇలా చెట్లను చంపేస్తున్నాం. దీనంతటికీ కారణం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే. గిట్టుబాటు ధర కల్పించి ఉంటే చెట్లను ఎందుకు నరుకుతాం? – చెంగారెడ్డి, రేఖల చేను, రామచంద్రాపురం మండలం చిత్తూరు–పుత్తూరు రహదారిపై రైతుల ఆందోళన గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద ఆదివారం మామిడి రైతులు చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మామిడి పంటను ఫ్యాక్టరీల వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. జైన్ కర్మాగారం యూనిట్ వన్ వద్ద 350 వాహనాలు, యూనిట్ టు వద్ద 450కి పైగా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో సకాలంలో అన్‌లోడ్ గాక ట్రాక్టర్లలో తీసుకొచ్చిన పంట సగానికి సగం కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లూ వాకిలి, కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి రేయింబవళ్లూ తిండి, నిద్ర లేక అవస్థలు పడుతూ రోడ్లపై పడిగాపులు కాస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం హీనంగా చూస్తోందని ఆరోపించారు. వారం పది రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకోకపోగా, అధికారులతో కుమ్మక్కైన దళారులు మాత్రం లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. వరుస క్రమంలో టోకెన్లు ఇవ్వకుండా, మిస్ చేసి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్న వారి సరుకునే కొంటున్నారని ఆరోపించారు. ఓ ఉన్నతాధికారి ఫోన్ చేస్తే 20–30 ట్రాక్టర్లు దర్జాగా మెయిన్ గేటు ద్వారా లోపలికి వెళుతున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీల వద్ద ఒక ట్రాక్టర్ అన్‌లోడ్ కావడానికి దాదాపు వారం, పది రోజులు పడుతోందని, ఆ సమయానికి అధిక శాతం పంట కుళ్లిపోవడంతో ఆ సరుకు వద్దంటూ ఫ్యాక్టరీ వారు తిప్పి పంపుతున్నారని రైతులు వాపోయారు.